బుధవారం 12 ఆగస్టు 2020
Devotional - Jun 15, 2020 , 00:08:41

‘సీతారాములు’ పిలుపులోని పరమార్థం!

‘సీతారాములు’ పిలుపులోని పరమార్థం!

ప్రశ్న: ‘సీతారాములు’ అని ఎందుకు పిలుస్తారు? - డి.సాయితేజ, ఆల్వాల్‌ సికింద్రాబాద్‌

జవాబు: సీత అయోనిజ అయినా జనకుడు తన కూతురుకు శస్ర్తాస్త్ర విద్యలనూ నేర్పించాడు. ఆమె ‘సాటిలేని మేటి పరాక్రమ వనిత’ అనేందుకు ఒక చిన్న ఉదాహరణ. బాల్యంలో చెలికత్తెలతో బంతి ఆట ఆడుతుండగా అది వెళ్లి శివధనుస్సు కిందకు పడింది. అప్పుడు సీత తన ఎడమ చేతితో శివధనుస్సును పక్కకు జరిపి బంతిని తీసుకుంటుంది. ఈ దృశ్యం చూసిన తర్వాత ‘ఆ ధనుస్సును ఎక్కు పెట్టగలిగిన వీరుడికే తన కూతురునిచ్చి వివాహం చెయ్యాలనుకొంటాడు జనకుడు. ఈ మేరకే స్వయంవరం ప్రకటిస్తాడు. 

అప్పుడు రాముడు ఆ శివధనుస్సును తన కుడిచేతితో ఎక్కుపెట్టాడు. అది చూసిన జనకుని తమ్ముడు శతానందుడు విశ్వామిత్రుడితో అంటాడు కదా, ‘మీ శ్రీరాముడు శివుని విల్లు ఎత్తినాడని గొప్పగా చెప్పారు. కానీ, మా సీత ఆ విల్లును తన ఎడమ చేతితో ఎత్తింది’. దీనిని బయటకు పొక్కనీయకుండా అందరూ జాగ్రత్త పడ్డారు. సీత అంతటి శక్తిమంతురాలు కనుక, ఆమె గొప్పదనాన్ని అంగీకరిస్తూ రాముని పేరుముందు సీత పేరు చేర్చాలని వారు నిర్ణయించారు. అలా ‘సీతారాములు’గా పిలవడం మొదలైంది. 

ఇక, వ్యాకరణపరంగా చూసినప్పుడు తెలుగులో రెండు అంతకన్నా ఎక్కువ పేర్లు వచ్చినప్పుడు తక్కువ అక్షరాలుగల పదాల పేర్లు ముందు ఉంటాయి. తర్వాత ఎక్కువ అక్షరాల పదాలు వస్తాయి. సీత= రెండక్షరాలు, రాములు= మూడు అక్షరాలు. అంతే కాకుండా, స్త్రీ లింగ పదాలకూ తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఆ కారణంగా కూడా సీత పేరు ముందు పలకవచ్చు.

- రంగరాజు పద్మజ, 99897 58144


logo