గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Jun 14, 2020 , 23:44:55

ఆత్మ అనంతం, కాలాతీతం!

ఆత్మ అనంతం, కాలాతీతం!

కాలంతో మానవుడు ముడిపడి ఉన్నాడు. నిద్ర లేవడం మొదలుకొని కాలగణన చేస్తూనే మనిషి రోజును గడపడం కద్దు. మరి, ఈ కాలం ఎంతవరకు సమంజసం? దాని పరిధి ఎంత? ఇంతకీ కాలాతీతం ఎవరు? సౌరకుటుంబంలో ఒక్కో గ్రహానికి ఒక్కో కాలం. భూమి తనచుట్టూ తాను తిరుగడానికి 23 గంటల 56 నిమిషాలు తీసుకుంటుంది. అది మనకొక రోజైంది. మన భూమ్మీద అనుసరించే కాలంతో చూస్తే గురు గ్రహానికి ఒక రోజంటే 10 గంటలు. శనికి 11 గంటలు. బుధునికి 1,408 గంటలు కాగా శుక్రునికి 5,832 గంటలు. సూర్యునికీ రోజనేది ఉంది. ఐతే, సూర్యుడి ఒక్కో ప్రాంతానికీ ఒక్కో పరిధి గల రోజు ఉంటుంది. ఇవన్నీ ‘కాలమనేది స్థిరం కాదు’ అనే దానిని స్పష్టం చేస్తున్నాయి. కానీ, కాలమనేది తప్పని మితి. ప్రసరించే కాంతి ఒకటే అయినా, కాలం మాత్రం వైవిధ్యం.

పదార్థంగా రూపొందిన ప్రతి వస్తువుకూ కాలమనేది ఉంటుంది. సృష్టి ఆరంభం, అంతం అనడంలోనే కాలం ఇమిడి ఉంది. కాలమనేది పదార్థ రూపేణా లేని వస్తువైన ఆత్మకు వర్తిస్తుందా? మరి, ఆత్మ అనేది అనంతమైన వస్తువు. అది భౌతిక త్రిమితులైన ఎత్తు, పొడవు, వెడల్పులకు అతీతం. ఇటీవల ఖగోళానికి జోడించిన కాలం అనే మితికీ అంటదీ ఆత్మ. నిజానికి ఆత్మనుండే ఈ అనంతమైన ఖగోళ పదార్థాలు పుడుతూ వస్తున్నాయి. ఒక్కొక్క ఖగోళ పదార్థానికీ ఒక్కో కాలాన్ని తెచ్చుకుంటున్నాయి.

ఆత్మ కాలం ద్వారానే జీవులను, పదార్థాలను తనలోనే ఉంచుకొని నియంత్రిస్తుంది. ఈ భూమే కాలం రూపంలో తన పిల్లలను నిద్ర పుచ్చుతుంది, నిద్ర లేపుతుంది. ఈ భూమే అన్ని జీవుల జీవితకాలాన్ని ‘కాలం’ ద్వారా నిర్ణయిస్తుంది. కాలం ఎంతటి బలీయమైందంటే  సౌర కుటుంబం మొదలుకొని సకల చరాచర సృష్టీ కాలం బిగి కౌగిలిలో కరిగిపోవలసిందే! ఈ ఖగోళ పదార్థాలన్నింటిలో, అణువణువునా అంతర్లీనంగా, అగోచరంగా ఉంటూ, అన్నింటిలో గోచరిస్తూ, చలిస్తూ, సంచరిస్తూ ఉండికూడా, తాను మాత్రం నిశ్చలంగా ఉండటం వల్లనే ‘ఆత్మకు కాలమనేది అంటదు’. ఎందుకంటే, దానికి చావు పుట్టుక లేదు. దీనినే ‘ఈశావాస్యం’లో ప్రస్ఫుటంగా మన పూర్వీకులు స్పష్టం చేశారు.

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః॥

అది చలిస్తుంది, చలించదు. దగ్గరగా ఉంది, దూరంగా ఉంది. అన్నింటా అంతర్గతంగా, బాహ్యంగా ఉంది. అంటే, ఆత్మే పదార్థాలుగానూ, వాటి చలనాలుగానూ, చలనాల ద్వారా ఉత్పన్నమయ్యే కాలంగానూ ఉంటున్నది. శ్రీకృష్ణుడు ఆత్మస్థానంలో ఉండి ‘విభూతియోగం’లో ‘నేనే ఆత్మను! సర్వభూతాల బీజాన్నీ నేనే!’ అని ప్రకటిస్తాడు. ‘అహమ్‌ ఏవ అక్షయః కాలః నేనే అనంతమైన కాలాన్ని’ అంటాడు. కొలతల్లో కూడా కాలాన్ని నేనేనంటాడు. అంటే, సృష్టి కాలమూ తానే, సాపేక్ష కాలమూ తానేననడం. అలాగే ‘జగత్‌ అవ్యక్తమూర్తినా’ అంటూ తాను కాలంతోపాటు సర్వాతీతమనీ తేలుస్తాడు. అంతేనా, అంటే నాలో స్వల్పభాగమే ఖగోళమైందని ఆశ్చర్య పరుస్తాడు.

అనంతమైన ఆత్మలో స్వల్పమైన కాలం ఒక కొలత మాత్రమే. ఈ చిన్ని కొలత అనంతాన్నెలా కొలుస్తుంది? అనంతంలో ఒకానొక భాగమై ఉండి, అనంతాన్నెలా చుట్టి రాగలదు? ఆ కాలమనేది ఆత్మే అయినా, ఆత్మ మాత్రం కాలాతీతమై, పురాణమై విలసిల్లుతున్నది. ఆత్మ పదార్థమైన విశ్వంగా మారినప్పుడు మాత్రమే దానికి కాలం ఒక మితి ఔతున్నది. విశ్వం నశించి శక్తి రూపంలో ఉన్న ఆత్మగా మారినప్పుడు కాలాతీతం అయిపోతుంది. అంటే, కాలమనేది ఆత్మే అయినా, కాలం ఆత్మకు అంటలేనిదన్న మాట. కాలం తానే అయినా, కాలంతో అంటుకోబడని ఆత్మ ఎంతటి బలీయమైందో ఆలోచించడమే కాలజ్ఞానం.. 


logo