మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jun 12, 2020 , 00:12:45

దృష్టి జ్ఞాన రహస్యం!

దృష్టి జ్ఞాన రహస్యం!

‘యదృశ్యం తన్నశ్యం’ అంటుంది  అద్వైత తత్త్వం. కంటికి కనిపించేదేదీ మిగలదు. కానీ, కనిపించేదే నిజమనే భ్రాంతిలో చివరిదాకా జీవిస్తూ ఉంటాం. అదే మాయావాదం. ‘దృష్టి అంటే చూపు /దృశ్యం అంటే చూడబడేది / ద్రష్ట అంటే వీక్షకుడు / దర్శనమ్‌ అంటే దర్శించిన అనుభవం’. దృష్టి అన్నమాటను పరికిస్తే కేవలం మన చర్మచక్షువులకు గోచరమయ్యేదే అనుకుంటాం. కానీ అంతకన్నా చాలానే ఉంది. లౌకికార్థంలో చూడటం దృష్టికి పర్యాయ వాచకం. అభిప్రాయం, ఎఱుక, జ్ఞానం అనే ఆంతరార్థికాలు కూడా దీనికున్నాయి. ఎదుటివారి మనసులో ఏమున్నదో తెలుసుకోవడం, వారు చెప్పక ముందే వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం దృష్టి. 

ఆధ్యాత్మిక పరంగా దృష్టి అన్నమాటను జ్ఞానం అనే అర్థంలో గ్రహించాలి. ఈశ్వర తత్త్వాన్ని తెలుసుకోవడం, ఎఱుకతో మసలుకోవడం అనే సాధనా తత్త్వాలు దృష్టికి పర్యాయాలు. అందుకే, వేదాంతాలను ‘దర్శనాలు’ అన్నారు. వేద విదులను దార్శనికులన్నారు. ఋషులు ద్రష్టలు. వారి దృష్టి భవిష్యత్‌ జనావళికి అభ్యుదయాన్ని కలిగించడం. అందుకే, దృష్టియన్న మాటకు ‘ప్రకాశం’ అనే మరో అర్థం కూడా ఏర్పడింది. లోకానికి వెలుగు పంచడమే ద్రష్టల లక్షణం. కనుపాటు అంటే దృష్టిదోషం అన్నది కూడా దృష్టి లక్షణమే. ఎదుటివారి బాగును (అభివృద్ధిని) చూసి ఓర్వలేక పోవడం దృష్టిలో మరో కోణం. సాధారణార్థంలో కూడా మంచి దుస్తులు తొడిగినా, కాస్త డబ్బులు సంపాదించినా, కళ్ళకు ఇంపుగా కనబడినా ఓర్పు మాలిన కళ్ళు కొన్ని ఉంటాయి. ‘దిష్టి తగిలింది, దిష్టి తీయించుకోవాలి’ వంటి మాటలు అందుకే పుట్టాయి. 

కళ్ళు జన్మతః లేకుండా పుట్టిన ధృతరాష్ట్రుడివల్లే మహాభారతమంతా నడచింది. పేరుకు చూపు లేనివాడే అయినా పుత్రవ్యామోహాంధుడు ధృతరాష్ట్రుడు. అంధత్వానికి అరిషడ్వర్గాలూ తోడైతే ఎలా ఉంటుందంటే అచ్చంగా మహాభారతంలో ధృతరాష్ట్రునిలాగే. ‘దృష్టి’ని నియంత్రించుకోవడమంటే మనసును ఆధీనంలో ఉంచుకోవడమే. ‘దృష్టి అంటే లక్ష్యసిద్ధికి మార్గం’ అని చెప్పుకోవచ్చు. అర్జునుడు ‘గురువర్యా! నాకు మీరు చూపిన పక్షి కనుగుడ్డు తప్ప మరేమీ కనిపించడం లేదు’ అంటాడు. అందుకే, అర్జునుని ‘జగదేక వీరుడవవుతావని’ అశీర్వదించాడు ద్రోణాచార్యుడు. అదీ ‘గురి’ అంటే. బాహిరమైన విషయాలేవీ కంట పడకుండా ఆంతరిక దృష్టిని నిలుపడమే తపస్సు. విశ్వామిత్రుని తపోదృష్టిని మేనక పైకి మరల్చడంతోనే ఆయన తపోభగ్నుడైనాడు.

జీవన పోరాటంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా కొందరి దృష్టిలో మార్పు రాదు. ధర్మం మీదనే దృష్టిని నిలిపిన రాముడు రూపుదాల్చిన ధర్మస్వరూపుడు. తండ్రిమాటకోసం రాజ్యాధికారాన్నే తృణప్రాయంగా వదలి కారడవులకు వెళ్ళడమే ఇందుకు ఉదాహరణం. మనోభావాలకు దర్పణం దృష్టి. సాత్విక, రాజసిక, తామసిక ఆహారాలలాగే సాత్విక, రాజసిక, తామసిక దృక్పథాలూ ఉంటాయి. తనలాగే ప్రతి జీవి ఆనందంగా బతకాలనే దృష్టి సాత్వికమైతే పదవితో, అందంతో, ఐశ్వర్యంతో కూడిన దృష్టి రాజసికమవుతుంది. ఇక, కడుపులో విషం పెట్టుకొనే ఓర్పు మాలిన దృష్టి తామసికమై పతనానికి దారితీస్తుంది. 

‘యద్భావం తద్భవతి’ అన్నది దృష్టి విలాసానికీ వర్తిస్తుంది. శుకమహర్షి వస్తుంటే దేవ నదిలో వివస్త్రలుగా స్నానాలు చేస్తున్న దేవతా స్త్రీలు ఏ మాత్రం సిగ్గు పడలేదట. ఆ వెనుకనే ‘ఓ పుత్రా!’ అని పిలుచుకుంటూ వస్తున్న వ్యాసర్షిని చూసి మాత్రం దేవతా స్త్రీలు వెంటనే వస్ర్తాలు ధరించారట. ఈ విషయమై వ్యాసుడే వారిని ప్రశ్నించినప్పుడు ఆ దేవతా స్త్రీలు చెప్పిన సమాధానం.. ‘నీ పుత్రునికి స్త్రీ పురుష భేదం లేదు. నిర్వికల్పుడు, నిస్సంగుడు, నిరీహుడు, నిస్పృహుడు. నీకు అతనికి చాలా తేడా ఉంది’. ఇదీ దృష్టిలోని విశిష్టత. అమెరికాలో ఒక అందగత్తె స్వామి వివేకానంద బోధనలకు ముగ్ధురాలై- ‘స్వామీ! నాకు నీలాంటి పుత్రుణ్ణి కనాలని ఉన్నది’ అన్నదట. దానికి వెంటనే స్వామి.. ‘దానికేం భాగ్యమమ్మా! నన్నే నీ కొడుకుగా స్వీకరించ’మన్నాడట. విశాలమైన మన భారతీయ ధార్మిక దృష్టి ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క దృష్టాంతం చాలు.logo