గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jun 11, 2020 , 00:12:12

రాజనీతిజ్ఞుడు వశిష్ఠ మహర్షి

రాజనీతిజ్ఞుడు వశిష్ఠ మహర్షి

‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అన్నట్లు రామచంద్రమూర్తిని న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపంగా తీర్చిదిద్దిన రాజగురువు వశిష్ఠుడు. బ్రహ్మజ్ఞానం తెలుసుకుని జీవితాన్ని యోగమయంగా, తపోమయంగా, జ్ఞానమయంగా ఆచరించి జీవించిన మహనీయుడాయన. ‘మనిషిలోని వికారాలను సాధ్యమైనన్ని వదిలి వేసి, అసాధ్యమైతే అవసరాల మేరకు నియంత్రించి ఆదర్శప్రాయంగా జీవించే మనిషే గురువు’ అనే వ్యాఖ్యానానికి నిలువెత్తు సాక్ష్యం వశిష్ఠుడు. ఆధ్యాత్మిక, యోగ జ్ఞానాలతో రాజనీతిని సమన్వయం చేసి ఇక్ష్వాకుల వంశాన్ని వశిష్ఠుడు ప్రభావితం చేశాడు. 

విశిష్ఠమైన వ్యక్తిత్వంతో వాఙ్మయ ప్రభారాశియై మంచి రచయితగా, రాజగురువుగా వశిష్ఠుడు గౌరవ మర్యాదలు పొందాడు. వశిష్ఠ కల్పం, తంత్రం, పురాణం, శిక్ష, శ్రద్ధాకల్పం, వశిష్ఠ వ్రతం, వశిష్ఠ హోమం, లింగపురాణం వంటివి యోగవాశిష్ఠంతో ప్రభావితమయ్యాయి. విశ్వామిత్రుని కోరిక మేరకు ‘యోగ వాశిష్ఠం’ వేదాంత గ్రంథం రాసి వశిష్ఠుడు శ్రీరామునికి చెప్పాడు. వాస్తు వివరించాడు. శ్రీ రాముని బాల్యంలో అస్త్రశస్త్ర విద్యలు, మెళుకువలను వశిష్ఠుడు నేర్పాడు. అనుభవంతో శత్రువుల రాకపోకలు, శక్తి సామర్థ్యాలు అంచనా వేయటం, అదుపు చేయటంలో రాజర్షి విశ్వామిత్రుడు తనకంటే ప్రావీణ్యం గలవాడని వశిష్ఠుడు గుర్తించాడు. ఎంతైనా విశ్వామిత్రుడు రాజర్షి. తాను బ్రహ్మ తేజస్సు గలవాడు. 

ఓ సందర్భంలో వశిష్ఠుడు లౌక్యం ప్రదర్శిస్తాడు. పసిపిల్లలైన రామలక్ష్మణులను తన యాగరక్షణ కోసం పంపాలని విశ్వామిత్రుడు దశరథుడిని కోరుతాడు. లేకలేక కలిగిన, అమితమైన ప్రేమతో పెంచుకొనే తన పిల్లలను పంపడానికి దశరథుడు తటపటాయిస్తాడు. ‘అవసరమైతే తాను, బలగాలు వస్తామని’ బతిమాలుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ‘తేషాం నిగ్రహణేశక్తః స్వయంచ దశికాత్మజః పుత్రహితార్థాయ త్వాముపేత్యా భిజాయతే’ అంటాడు. ‘మహారాజా! విశ్వామిత్రుడు శత్రువులను సంహరించగల సమర్థుడే. మీ పిల్లలకు అనుభవంతో ప్రావీణ్యం పెరిగి, భయం తొలగి హితం కలగుతుంది. నిరభ్యంతరంగా పంపండి’ అని ప్రోత్సహిస్తాడు. దీనివల్ల దశరథుని మాట దక్కుతుంది. విశ్వామిత్రుని లక్ష్యం నెరవేరుతుంది. రామలక్ష్మణులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది రాజనీతి లక్షణం. తాను కోరుకున్నట్లు శిష్యులకు శత్రువులను అంచనా వేసి అణచటం, గెలవటం కోసం మెళుకువలు తెలుస్తాయి.

దశరథుని సభలో కూడా వశిష్ఠుడు మంత్రులకంటే ముందే నిలబడి రాజధర్మాలు చెప్పేవాడు. అందుకే వాల్మీకి విశ్వామిత్రునితో ‘అహంవేద్మి మహాత్మానం/ రామం సత్య పరాక్రమం/ వశిష్ఠోపి మహతే/ జాయేచాన్యే తపస్థితా’ అని చెప్పిస్తాడు. ‘రాముని సత్యధర్మ పరాక్రమాలు నాకంటే వశిష్ఠునికే ఎక్కువ తెలుసునని’ విశ్వామిత్రుడు అంటాడు. వశిష్ఠుడు త్యాగి, నిష్కాముకుడు, స్వతంత్ర ప్రజ్ఞాశాలి. ఋగ్వేదంలో వశిష్ఠుని ప్రభావం రాజనీతి అంశాలు గోచరిస్తాయి. అనుకోకుండా అయోధ్యలో చిన్న రాజ్యాధిపతి సత్యవ్రతుడు భ్రష్ఠుడై దేవరాజనే రాజపురోహితుని సూచనతో వశిష్ఠుడు రాజ్యభారం మోయాల్సి వస్తుంది. ఎటువంటి శాసనాలు లేకుండా నోటిమాటతోనే రాజ్యమంతా ఒక కుటుంబం వలె కఠిన స్వీయ నియంత్రణతో మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లే విధంగా వశిష్ఠుడు పాలన చేస్తాడు. 

అప్పుడు పొరుగు రాజ్యాధికారి రాజర్షి విశ్వామిత్రునికి అసూయ కలిగి, అతనిపై దాడికి వస్తాడు. వశిష్ఠుడు సాదరంగా ఆహ్వానించి విశ్వామిత్రునికి అతిథ్యమిస్తాడు. ఆశ్రమంలో ‘నందిని’ అనే గోవును ఇవ్వమని విశ్వామిత్రుడు కోరతాడు. వశిష్ఠుడు నిరాకరిస్తాడు. బలవంతంగా తీసుకుపోతానంటాడు విశ్వామిత్రుడు. ‘రాజబలం ముందు నేనెంత. తీసుకు వెళ్ళ’మంటాడు వశిష్ఠుడు. నందిని ఎదురు తిరుగుతుంది. ప్రజలంతా వశిష్ఠుని గెలిపిస్తారు. అప్పటి నుంచి ‘విశ్వామిత్రుని భుజబలం, వశిష్ఠుని బుద్ధిబలం’ రాముని రాజ్యం కళకళలాడేందుకు కారణమవుతాయి. అందుకే, వశిష్ఠుడు సాధారణ గురువు, పురోహితుడు కాదు, రాజనీతిజ్ఞుడు. అన్నీ తానై రాజ్యం క్షేమం కోసం మార్గదర్శనం చేసిన గురువు.


logo