గురువారం 06 ఆగస్టు 2020
Devotional - Jun 10, 2020 , 00:23:01

గురు శిష్య సంబంధం

గురు శిష్య సంబంధం

భారతీయ సనాతన సంప్రదాయంలో, గురుస్థానం చాలా ఉత్కృష్టమైనది. ఎంతెంత ఉన్నతమైన విద్యలు అభ్యసించిన వారైనా, గురువు అనుగ్రహం లేకుంటే ఆ విద్యలు వారికి కావాల్సిన సరైన జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడవు. దీనికి మనకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. కర్ణుని జీవితం దీనికి చక్కని ఉదాహరణ.

గురువులలో కూడా మూడు రకాలు ఉంటారని బ్రహ్మవిద్యోపనిషత్తు, వేదాంత శాస్త్రం గురువులు నాలుగు రకాలని, ఒక్కొక్కరు ఒక్కో రకంగా శిష్యులను తరింపజేస్తారని తెలియజేస్తున్నాయి. కొందరు అత్యంత ప్రసన్నులై శిష్యులకు అడుగడుగునా మార్గనిర్దేశనం చేస్తే, కొందరు గురువులు మాత్రం శిష్యుని చిత్తశుద్ధిని, నిబద్ధతను, సత్య ధర్మాన్ని ప్రతీ క్షణం పరీక్షిస్తూ, వారిని జ్ఞానమార్గంలో నడిపి తమంత వారిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే, ‘గురుగీత’ లాంటి కొన్ని గ్రంథాలు, ఎలాంటి గురువు ఉత్తముడు, శిష్యుడు ఒక గురువును ఆశ్రయించే క్రమంలో ఎలాంటి గురువులను స్వీకరించ కూడదో కూడా వివరిస్తాయి.

ఒక ఉత్తమగురువు లభించడం ఎలాగైతే శిష్యుని అదృష్టమో, అలాగే ఒక మంచి సాధకుడైన శిష్యుని ఎన్నుకోవడం కూడా ఆ గురువు బాధ్యతగా చెప్పవచ్చు. ఒక ఉత్తమ శిష్యుడు తయారయినప్పుడే కదా ఆ గురువుకు కూడా సార్థకత. అందుకే సద్గురువులైన వారు వారి శిష్యుల్ని వెదికి వెదికి ఎన్నుకుంటారు. ఒక్కసారి శిష్యునిగా స్వీకరిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలక తమంత స్థాయికి తీసుకు రావడానికి అహరహం శ్రమిస్తారు. అలాంటి శిష్యులకు గురువులు తమ సర్వశక్తులూ ధారపోస్తారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడి కథ ఇందుకు చక్కని ఉదాహరణ.

ఉత్తమ గురువు లక్షణాల వలెనే ఒక సత్ప్రవర్తనతో మెలగాల్సిన శిష్యుని కర్తవ్యాలు కూడా ఒకానొక సందర్భంగా పరమేశ్వరుడు పార్వతికి గురు మహత్యాన్ని చెప్తూ వివరిస్తాడు. గురువుకు ఆనందం కలిగించేలా శిష్యుని సత్ప్రవర్తన ఉండాలి. అది అలవర్చుకోవడం శిష్యుని ప్రథమ కర్తవ్యం. నిత్య శుశ్రూష, అనునిత్యం గురువు కనుసన్నల్లో మెలగుతూ, మనోవాక్కాయ కర్మలతో అనునిత్యం గురుధ్యానం, ధ్యాసలో గడుపుతూ, సేవ చేస్తూ, సత్యవంతుడై ఉండాలి. అటువంటి శిష్యుడే గురువుకు అత్యంత ప్రీతిపాత్రుడై బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. అది పూర్తిగా శిష్యుడి చిత్తశుద్ధి, తాత్విక చింతన, తన శరణాగత తత్వం మీదనే ఆధారపడి ఉంటుంది. 

తనకు కావాల్సిన గురువును శిష్యుడు ఎన్నుకోలేడు. సచ్ఛిష్యుని అన్వేషణ దేనికొరకో, అది ఆ శిష్యుడు ఎంత ప్రగాఢంగా ఆశిస్తున్నాడో అన్న దానినిబట్టి, ఆ నిరంతర ప్రయాణంలో గురువు అవసరం ఎప్పుడైతే వస్తుందో, దానికి అనుగుణంగా శక్తి గలిగిన గురువు ఆ శిష్యుడిని వెదుక్కుంటూ తానే తారసబడతాడు. ఆ శిష్యుణ్ణి అన్ని రకాలుగా పరీక్షించిగానీ తమ శిష్యులుగా స్వీకరించరు ఉత్తమ గురువులు. ఎందుకంటే, శక్తినంతా ధారపోసి ఒక ఉత్తమ శిష్యుని సిద్ధపరచడంలోనే ఆ గురువుకు సంతృప్తి, సార్థకత. 

అందుకే, ప్రతి మానవుని జీవితపు మజిలిలో గురువు పాత్ర అత్యంత కీలకమైనది. మనిషి సరైన మార్గంలో ప్రయాణించి, బ్రహ్మజ్ఞానాన్ని, ఒక వైరాగ్య స్థితిని పొంది జీవితాన్ని సార్థకం చేసుకోవడంలో గురువు కృషి శిష్యునికన్నా వేయి రెట్లు ఎక్కువ. అటువంటి గురుశిష్య బంధంలో శిష్యుని చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నమే గురువుకు ప్రియ శిష్యులుగా మారుస్తుంది. నిజమైన గురు శిష్య సంబంధం, అన్ని బంధాలకు, రాగద్వేషాలకు అతీతమై, అత్యంత ఉత్కృష్టమైనదిగా ఉంటుంది. అందుకే, దేవుని నమ్మనివారు ఉండవచ్చుగాని, గురువును నమ్మనివారు దాదాపు అరుదనే చెప్పాలి. అలాగే, గురుకృప ఉంటే దైవకృపకూడా సులభతరమౌతుందని చెప్పవచ్చు.

ధ్యాన మూలం గురోర్మూర్తి:

పూజామూలం గురో:పదమ్‌

మంత్రమూలం గురోర్వాక్యం

మోక్షమూలం గురో: కృపా॥


logo