సోమవారం 10 ఆగస్టు 2020
Devotional - Jun 07, 2020 , 23:08:54

రోగనిరోధక శక్తికి యోగా!

రోగనిరోధక శక్తికి యోగా!

‘యోగా’ అంటే చాలామంది ‘శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లోకి తిప్పడం’గా అర్థం చేసుకుంటారు. కానీ, ‘యోగా’ అంటే ‘శరీరాన్ని మెలికలు తిప్పటం’ లేక ‘తల్లకిందులుగా నుంచోవటం’ కాదు. ‘యోగా’ అనేది ఒక వ్యాయామ పద్ధతీ కాదు. అది ‘మనిషిని తను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం’. అసలు ‘యోగా’ అంటే ‘ఐక్యం’ అని అర్థం. మీరు అన్నింటితో ఐక్యం అయితే, అదే యోగా!

మీ ఎరుకలో అన్నింటినీ ఒక్కటిగా అనుభూతి చెందితే అప్పుడు మీరు ‘యోగా’లో ఉన్నట్లు. మీలో ఇటువంటి అనుభూతిని, ఐక్యతను సాధించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీ శరీరంతో మొదలుపెట్టి మీ శ్వాసతో, తర్వాత మీ మనసుతో, ఆపై మీ అంతరాత్మపైనే దీనిని సాధన చేయవచ్చు. ఇలా ఎన్నో మార్గాలు సృష్టితమైనాయి. కానీ, అవన్నీ యోగాలోని వివిధ దశలు మాత్రమే. ఇవన్నీ కూడా జాగ్రత్తగా సమతుల్యంతో ఒక్కసారే, ఒకే భాగంగా పరిగణన చేయటం ముఖ్యం. నిజంగా ఏ తేడాలూ లేవు, మీరుగా ఉన్న ప్రతి అంశాన్నీ యోగా వినియోగించుకుంటుంది. 

యోగా ప్రజాదరణ పొందడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో ఒకటి మీ గురించిన ప్రాథమిక వాస్తవాలను మీరు గ్రహించేటట్లు చేయడం. ఒకసారి కిండర్‌ గార్టెన్‌ స్కూల్లో టీచర్‌ పిల్లల్ని ఇలా అడిగింది- ‘నేను తలకిందులుగా నిలబడితే నా ముఖం ఎర్రబడటం మీరు చూస్తారు. ఎందుకంటే, రక్తం నా తలలోకి ప్రవహిస్తుంది. కానీ, నేను నా కాళ్లమీద నిలబడినప్పుడు మాత్రం అలా జరగదు. ఎందుకు?’. దానికి ఒక పిల్లవాడు ఇలా సమాధానం చెప్పాడు- ‘ఎందుకంటే మీ కాళ్లు ఖాళీగా లేవు’ అని. మీ శరీరం వాతావరణంలోని ఒత్తిడిని సూచించే ఒక బారోమీటరు లాంటిది. మీకు దాన్ని చూడటం తెలిస్తే అది మీ గురించి సర్వం చెప్తుంది. మీరు మీ గురించి ఊహించుకొనే వింత విషయాలు కాదు, మీ గురించిన వాస్తవ విషయాలు. మీ మనసు చాలా మోసగత్తె. ప్రతి రోజూ మీ గురించి భిన్నంగా చెప్తుంది. మీ శరీరాన్ని చదవడం మీకు తెలిస్తే అది ఉన్నదున్నట్లుగా మీ గురించి.. మీ గతం, వర్తమానం, భవిష్యత్తు.. అన్నీ ఒక పద్ధతిలో చెప్తుంది. అందుకే, ప్రాథమిక యోగా శరీరంతో ప్రారంభమవుతుంది.

మారే ఫేషన్లతోపాటు ఎన్నో విషయాలు వస్తాయి, పోతాయి. కానీ, యోగా వేలాది సంవత్సరాలుగా నిలబడింది. ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నది. దాన్ని చాలా ప్రాథమిక రీతుల్లో, సరిగ్గా లేని పద్ధతుల్లో ప్రసారం చేస్తున్నప్పటికీ అది నిలిచి ఉండగలిగింది. బలవంతంగా అమలు పరచడం గాని, ప్రచారం చేయడం కాని లేకుండానే సుమారు 15వేల సంవత్సరాలకు పైగా నిలిచిన అద్భుత వ్యవస్థ యోగా. ప్రపంచ చరిత్రలో ఎవరూ ఎవరి గొంతుమీదో కత్తి పెట్టి ‘యోగా చేసి తీరాలి’ అని అనలేదు. ‘ఒక సంక్షేమ ప్రక్రియ’గా అది పని చేసింది. కాబట్టే, అది ఇప్పటి వరకూ జీవించింది, ఇంకా కొనసాగుతున్నది.

ఈ కరోనా సంక్లిష్ట సమయంలో, బలమైన రోగనిరోధక వ్యవస్థను, బాగా పనిచేసే శ్వాసకోశ వ్యవస్థను ప్రతి ఒక్కరూ కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. రోగ నిరోధక శక్తిని, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి ‘సింహాక్రియ’ ఒక సరళమైన, శక్తివంతమైన యోగప్రక్రియ. ఇది చాలా తేలికైన విధానం. ఎలాంటి యోగ సాధన చేయని వారుకూడా దీనిని ఆచరించవచ్చు. ఇది మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంపొందించడమేకాక రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. 6 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసుగల వారెవరైనా దీనిని చేయవచ్చు. 6 కంటే తక్కువ వయసున్న వారు లేదా 70 ఏండ్లు పైబడిన వారుకూడా ఈ క్రియను స్వల్పమార్పులతో చేయవచ్చు. దీనిని 4 గంటల వ్యవధితో రోజుకు 1, 2 లేదా 3 సార్లు చేయవచ్చు. 

‘సింహా’ యోగక్రియను 

నేర్చుకోవడానికి ఆన్‌లైన్‌లో చిరునామ: http://bit.ly/simhakriya-telugu ...ప్రేమాశీస్సులతో!


logo