శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Jun 08, 2020 , 00:53:23

విన్నపాలు వినవలె..

విన్నపాలు వినవలె..

తిరుపతి వెంకన్నను కొలుచుకోవచ్చు. యాదాద్రి నర్సన్నను దర్శించుకోవచ్చు. భద్రాద్రి రాముడికి మొక్కులు చెల్లించవచ్చు. వేములవాడ రాజన్నను కండ్లారా తిలకించవచ్చు. శ్రీశైలం మల్లన్నకు బిల్వార్చన చేయవచ్చు. నిత్య దర్శనాల కోసం మూడునెలల ఎదురుచూపు,  భక్తులకు మూడు యుగాల నిరీక్షణను తలపించింది. ఇష్టదైవంతో భక్తుడి బంధాన్ని ఏ చట్రంలోనూ ఇమడ్చలేం. ఏ నిర్వచనాల పరిధిలోకీ తీసుకురాలేం. ఆ పని చేయడానికి, నాలుగు వేదాలకే భాష చాలలేదు. ఉపనిషత్తుల గాఢత కూడా సరిపోలేదు. అష్టకష్టాలూ పడి అష్టాదశ పురాణాలు పట్టుకున్నదీ పిసరంతే. 

భక్తుడు.. బిడ్డ! పరమాత్మ.. తల్లి! 

భక్తుడు.. ఇనుపరజం! పరమాత్మ.. అయస్కాంతం!

భక్తుడు.. నది!  పరమాత్మ.. సముద్రం!

భక్తుడు... ప్రేయసి! పరమాత్మ.. ప్రియుడు!

త్రికరణశుద్ధిగా సేవించడమే భక్తి!

‘మోక్షసాధన మార్గాల్లో భక్తిని మించిన మార్గం లేదు’ అంటాడు నారద

మహర్షి భక్తి సూత్రాల్లో! 

నవవిధ భక్తిమార్గాలు.. పరమాత్మను చేరేందుకు తొమ్మిది సోపానాలు.   

శ్రవణం .. దేవుడి కథలే వింటూ ఉంటాడు. 

కీర్తనం... దేవుడి పేరే  అంటూ ఉంటాడు. 

స్మరణం.. అన్నదీ విన్నదీ స్మరిస్తూ ఉంటాడు.  

పాదసేవనం, అర్చనం ...ఆవాహన, ధ్యాన, ఆసనాది శోడషోపచారాలు చేస్తాడు. మంత్రపుష్పం సమర్పిస్తాడు. నమక చమకాలతో అర్చిస్తాడు. శత, సహస్ర నామాలతో కీర్తిస్తాడు. సుజలాలతో అభిషేకిస్తాడు. సుఫలాలను నివేదిస్తాడు.  

వందనం... అన్యధా శరణం నాస్తి అంటూ సాష్టాంగ పడతాడు.

దాస్యం .. స్వామీ! నీకు మాత్రమే కాదు, నీ దాసులకు దాసుడిని, ఆ దాసులకూ దాసుడిని అంటూ శరణాగతిని ప్రదర్శిస్తాడు. 

ఆత్మనివేదనం.. ‘నేనూ, నువ్వూ వేరు కాదు. నేనే నువ్వు, నువ్వే నేను’ అన్న మహోన్నత స్థితి!

పరమపద సేవనం... ఇక ద్వైతం లేదు. అంతా అద్వైతమే! భక్తుడు లేడు. అంతటా భగవంతుడే. 

ఆ నవవిధ భక్తి యాత్రలో - ఆలయాల పాత్ర అపారం. గుడి.. జిజ్ఞాసికి గ్రంథాలయం లాంటిది. పరిశోధక విద్యార్థికి ల్యాబొరేటరీ లాంటిది. హఠాత్తుగా ఆ పుస్తకాలయం తలుపులు మూసుకుంటే, ఆ పరిశోధనశాలలోకి అనుమతి నిరాకరిస్తే.. భక్తుడు తల్లడిల్లిపోతాడు. ఇంట్లోనే సకల పూజలూ చేసుకున్నా.. ఆలయం ఆలయమే! తల్లి కోసం అలమటిస్తున్న బిడ్డకు... అమ్మ ఫొటో ఇస్తే  ఏడుపు ఆగిపోతుంది. కానీ, కొద్దిసేపే! మళ్లీ మారాం చేస్తుంది. కారణం.. తనకు కావాల్సింది ఛాయాచిత్రం కాదు. సాక్షాత్తూ అమ్మ నిజరూపం. భక్తుడికి సంబంధించినంత వరకూ ఆ మాతృస్థానం.. దేవాలయం! కరోనా కారణంగా ఆలయాల్లో నిత్య దర్శనాలు రద్దు చేయడంతో .. తల్లికి దూరమైన బిడ్డల్లా  తల్లడిల్లిపోయారు ఆస్తికజనం. ఇలాంటి ఎడబాటు మహామహా భక్తులకే తప్పలేదు. 

భద్రగిరి తలుపులు..

అక్కడ రమాదేవి, ఇక్కడ సీతమ్మ! అక్కడ మహర్షులూ దేవతలూ, ఇక్కడ ఆచార్యులూ భక్తజనులూ! అక్కడ విరజానది. ఇక్కడ గౌతమి! వైకుంఠమే భద్రాచలం. భద్రాచలమే వైకుంఠం. 

కంటి నదీతటంబు పొడగంటిని భద్రనగాధివాసమున్‌

గంటినిలాతనూజ మరుకార్ముక మార్గణశంఖచక్రముల్‌

గంటిని మిమ్ములక్ష్మణునిగంటి, కృతార్థ్ధుడనైతి, నోజగ

త్కంటకదైత్య నిర్దళన! దాశరథీ కరుణాపయోనిధీ!!

నీ దర్శనంతో నా జన్మ చరితార్థమైంది తండ్రీ!

- అంటూ ఆనందబాష్పాలు రాల్చాడు కంచర్ల గోపన్న. 

అంతటి మహాభక్తుడికి కూడా.. ఒకానొక దశలో ఆలయ ప్రవేశం లభించలేదు. ఖైదు చేసి, కొరడా దెబ్బలు రుచి చూపించారు గోల్కొండ సుల్తానులు. ఆ రాతిగోడల మీదే రామకోటి రాసుకున్నాడు. ఆ ఊచలకే కీర్తనలు వినిపించాడు. చెర నుంచి విముక్తి కల్పించమని రామచంద్రుడికి మొరపెట్టుకున్నాడు. సీతమ్మ సిఫార్సు అడిగాడు. లక్ష్మణస్వామిని వేడుకున్నాడు. హనుమనూ బతిమాలుకున్నాడు. ఓపిక నశించింది. నిందించాడు. దెబ్బలాడాడు. ప్రతి ఉద్వేగంలోంచీ ఓ అత్యద్భుత కీర్తన! ‘అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా, రామప్ప గొబ్బున నన్నేలుకోరా’ - కాచి కాపాడమని మొరపెట్టుకున్నాడు. ‘అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము’ - వ్యాజ్యస్తుతిని ఆశ్రయించాడు. ‘ఉన్నాడో లేడో భద్రాద్రియందు’ అంటూ మూలమూర్తి ఉనికినే ప్రశ్నించాడు. పన్నెండేండ్ల నిరీక్షణ ఫలించింది. సుల్తానుల ఖజానాకు రామటెంకలు చేరాయి. రామదాసు సంకెళ్లు తెంచుకున్నాయి. పరమభక్తుడి కోసం గుడి ద్వారాలు తెరుచుకున్నాయి. ‘కంటి నేడు మా రాములను కనుగొంటి నేడు..’ అని పరవశంగా పాడుతూ భద్రాచలవాసుడిని దర్శించుకున్నాడు. భక్తుడు ముందుగా.. తల్లికోతిని పిల్లకోతి పట్టుకున్నట్టు దేవుడిని గట్టిగా పట్టేసుకోవాలట. ఆతర్వాత దేవుడే, పిల్లి తన పిల్లల్ని కాపాడుకున్నంత జాగ్రత్తగా భక్తుల్ని సంరక్షించుకుంటాడట.     

ఆనందనిలయ ద్వారాలు..

తిరుపతికి చేరుకోవాలి. ఏడుకొండలూ ఎక్కాలి. 

ఆనందనిలయంలో ప్రవేశించాలి. మహద్వారాన్ని దాటాలి. వెండి తలుపుల గుండా ప్రవేశించాలి. ఆ 

తర్వాత స్వర్ణ ద్వారాలు. దేవదేవుడి ద్వారపాలకులైన జయవిజయుల అనుమతి తీసుకోవాలి. అన్నిటికీ మించి, హృదయ నేత్రాల్ని సువిశాలం చేసుకోవాలి. ఆ పరమోన్నత స్థితిలోనే పరమాత్మను దర్శించుకోగలం. అన్నమయ్యలాంటి కొద్దిమందికే ఆ యోగమూ, భోగమూ దక్కిది. కాబట్టే, ఆ సాలగ్రామస్వరూపంలో సకలవేదాల స్వరూపుడిని చూడగలిగాడు.

కంటి నఖిలాండకర్త నధికుని గంటి

కంటి నఘములు వీడుకొంటి - నిజమూర్తిగంటి!

.. అని ప్రకటించగలిగాడు. 

పెద్దకిరీటమువాడు పీతాంబరమువాడు

వొద్దిక కౌస్తుభమణి వురమువాడు

ముద్దుల మొగమువాడు 

ముత్తేల నామమువాడు

అద్దిగో శంఖచక్రాల హస్తాలవాడు

..అంటూ ఆ దివ్యమోహనమూర్తిని మనకూ దర్శింపజేశాడు. ఓసారి, క్షేత్ర యాత్రలో ఉన్నప్పుడు, ఆ

చార్యులవారు నిత్య పూజాదికాలు నిర్వహించుకునే విగ్రహాన్ని ఏ రాకాసి మూకలో ఎత్తుకెళ్లాయి. భక్తుడి జీవితంలో భగవంతుడికి దూరం కావడమే అతిపెద్ద విపత్తు. అప్పటికే మిట్టమధ్యాహ్నం అయిపోయింది. జన ప్రియుడైన స్వామి భోజన ప్రియుడు కూడా. ‘అక్కాళపాశాలు నప్పాలు వడలు.. పెక్కైనసయిదంపుపేణులును.. సక్కెరరాశులు సధ్యోఘృతములు..  కిక్కిరియ నారగించవో స్వామీ!’ అంటూ వైకుంఠపతిని విందుకు ఆహ్వానించాలి. ఆ తర్వాత తానూ ఎంగిలిపడాలి. 

ఆ ఆర్తిలో నుంచే..

‘ఇందిరారమణు తెచ్చి ఇయ్యరో మాకిటువలె

పొంది పూజించపొద్దాయనిపుడు’ అన్న కీర్తన పుట్టింది. 

త్యాగరాజ స్వామి జీవితంలోనూ ఇలాంటి ఘట్టం ఉంది. ఓసారి, తాను నిత్యం ఆరాధించే రాములవారి విగ్రహాన్ని ఆయన సోదరుడు అసూయతో ఎత్తుకెళ్లిపోతాడు. ఆ బాధనంతా రామచంద్రుడికి విన్నవించుకున్నాడు. 

‘ఎందుదాగినాడో

శ్రీరాముడెందుదాగినాడో’ అంటూ.

శబరిని వెతుక్కుంటూ వెళ్లినవాడు, త్యాగయ్యను మాత్రం కటాక్షించకుండా ఉంటాడా?  కావేరీ తీరంలో కనిపించిందా మూర్తి. త్యాగబ్రహ్మం ఆనందానికి అవధుల్లేవు!

‘కనుగొంటిని శ్రీరాముని నేడు కనులారగ..’

అని పరవశంగా పాడుకున్నాడు. 

యాదాద్రి వైభవం

హిరణ్య కశిపుడు పరమ దుర్మార్గుడు. హరి ద్వేషి. 

ఇదంతా ఒక కోణమే. తను, పూర్వజన్మలో శ్రీమహావిష్ణువు ద్వారపాలకులలో ఒకడు. ఒకానొక సమయంలో సనకసనందనాదులు విష్ణుమూర్తి దర్శనానికి వైకుంఠానికి వెళ్లారు. ఆరు ద్వారాలు దాటారు. ఏడో ద్వారం  వద్ద జయవిజయులు కాపలాదారులు. స్వామి ఏకాంతంలో ఉన్నారు కాబట్టి, ప్రవేశం నిషిద్ధమని అడ్డుకున్నారు. దీంతో మునులకు కోపం వచ్చింది. భూలోకంలో మనుషులుగా పుట్టమని శపించారు. అంతలో విష్ణుమూర్తి వచ్చాడు. తాపసులను శాంతింపజేశాడు. శాపం శాపమే. కానీ, శ్రీహరి ఓ వెసులుబాటు ఇచ్చాడు. ‘నా భక్తులుగా అనేకానేక జన్మలు ఎత్తి.. ఆ తర్వాత వైకుంఠానికి వస్తారా? నా శత్రువులుగా మూడు జన్మలే ఎత్తి మళ్లీ నా సేవలలో తరిస్తారా?’ అని అడిగారు. దేవుడి ఎడబాటును ఏ భక్తుడూ భరించలేడు. ‘శత్రువులుగానే పుడతాం. మూడు జన్మల తర్వాత వైకుంఠ ద్వారాల ముందు వచ్చి నిలబడతాం. మూడుసార్లు నీ చేతిలో చచ్చి బతకడానికి మించిన మహద్భాగ్యం ఏం ఉంటుందీ స్వామీ’ అని సంతోషంగా అంగీకరించారు.  అందులో ఒకజన్మ.. హిరణ్యాక్ష హిరణ్య కశిపులది.  హిరణ్య

కశిప సంహారంతో ముడిపడిన క్షేత్రం యాదాద్రి. 

శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠంలో అయితే ఏడు ద్వారాలు దాటాలి. అనుమతులూ సిఫార్సులూ అనేకం. అయినా, బ్రహ్మాది దేవతల తర్వాతే అవకాశం. కానీ యాదాద్రిలో ఆ బాధే లేదు. కాబట్టే, బ్రాహ్మీ ముహూర్తంలో మహర్షులు ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసి నారసింహుడిని దర్శించుకుంటారని  ఐతిహ్యం.  కాబట్టే, యాదాద్రి క్షేత్ర సంకీర్తన కవి.. ఈగ బుచ్చిదాసు ‘కోటి సూర్యకాంతిగల యాదగిరీంద్రా... నీ సాటి వేల్పులెవరయ్యా యాదగిరీంద్రా’ అని కొనియాడతాడు.                                                

దేవుడు గర్భాలయంలో ఉన్నప్పుడే ఈ కష్టాలన్నీ! ఆయన్ని కట్టిచుట్టి మనతో తెచ్చుకుంటే.. తలుపులు మూసుకున్నాయన్న బాధ ఉండదు. ఆలయానికి వెళ్లలేకపోయామన్న వెలితీ ఉండదు. ‘కట్టివేయగదరే శ్రీరాముల గట్టిగ మదిలోనను.. కట్టి వేయరె మీరు దిట్టముగా యోగ.. పట్టాభిషిక్తుని పట్టు వదలకుండ’ అని సలహా ఇస్తాడు తూము నరసింహదాసు ఓ కీర్తనలో. పరమాత్మను బంధించడానికి ఒకతాడు సరిపోదు. నవవిధ భక్తి అనే తొమ్మిది బలమైన తాళ్లు కావాలి. అప్పుడిక.. చిక్కిపోతాడు మనకు - యశోదమ్మకు చిక్కినట్టే! భాగవతంలో పోతనామాత్యుడు ఎంత గొప్పగా వర్ణించాడు ఆ ఘట్టాన్ని!

చిక్కడు సిరికౌగిటిలోజిక్కడు సనకాదియోగి చిత్తాబ్దములన్‌

జిక్కడు శ్రుతిలతికావళి

జిక్కెనతడు లీల దల్లి చేతన్‌ రోలన్‌. 

మనుషుల కోసం.. దేవాలయం!

కొన్నితరాల క్రితం వరకూ.. దేవాలయ వ్యవస్థ సమాజానికి చుక్కానిలా ఉండేది! ఉత్పాతాలు, వైపరీత్యాలు సంభవించినపుడు సామాన్య జనులు గుళ్లను ఆశ్రయించేవారు, ఓప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్లేవారు సైతం దారి మజిలీలుగా ఆలయాలనే ఎంచుకునేవారు. నిత్యాన్నదానాలతో గుడులు బాటసారుల ఆకలి తీర్చేవి! ఆపై దేవుడి దర్శనంతో అలౌకికానందం కలిగేది! సాయంవేళల్లో సాంస్కృతిక సంబురాలు ప్రజలను మైమరపించేవి! ప్రజోపయోగకరమైన ఈ వ్యవస్థ నిర్విఘ్నంగా నడవటానికి రాజుల మాన్యాలు, ఈనాములు ఇచ్చేవారు. ఆలయానికి అనుబంధంగా చెరువులు ఉండేవి! ఇవి తెప్పోత్సవాలకో, అభిషేక జలాలకో పరిమితం కాదు. ఆ జలాలు తాగునీరుగా, సాగునీరుగా ఉపయోగపడేది! పూజారులు ప్రజలకు మంచిచెడులు చెప్పి ధర్మమార్గంలో నడిపించేవారు. ఆలయ వ్యవస్థ గొప్పదనాన్ని గుర్తించే రామదాసు ప్రభుత్వ సొమ్ముతో భద్రాచల ఆలయాన్ని నిర్మించాడు. ఈ గొప్పదనాన్ని కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి ఇలా కొనియాడారు..

గుడులుకట్టించె కంచర్ల గోపరాజు

రాగములు కూర్చె కాకర ్లత్యాగరాజు

పుణ్యకృతిచెప్పె బమ్మెర పోతరాజు

..రాజులీమువ్వురును భక్తి రాజ్యమునకు.

తాజావార్తలు


logo