శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jun 08, 2020 , 00:53:38

సర్వసిద్ధి ప్రదం ‘శ్రీమాత్రే నమః’

సర్వసిద్ధి ప్రదం ‘శ్రీమాత్రే నమః’

భారతీయ సంప్రదాయంలో ఉపాసనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది.  ‘ఉప+ఆసన’ అంటే ‘సమీపంలో కూర్చోవడం’.  నిజంగానే మనం ఎప్పుడూ భగవంతుని సమీపంలోనే ఉంటాం. ఈ విషయం అర్థంకాక అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంటాం. మన చుట్టూ ఉండే పంచభూతాలలోనూ; వృక్షాలు, జంతువులు అన్నింటిలోనూ శక్తిరూపంలో భగవంతుడు కనిపిస్తూనే ఉంటాడు. ఆ విషయం అర్థం అయ్యేంత వరకు కంటికి కనిపించే ఓ ప్రత్యక్ష దైవం అవసరం. మన ఆలోచనలు పక్కకు పోకుండా పూజ, స్తోత్రం, జపాదులు అవసరమవుతాయి. భగవంతుని దర్శనం నిరంతరం మనకు కలిగించే శక్తి  జపానికి ఉంటుంది. జపం జరుగుతున్న ప్రతిసారీ  భగవంతున్ని ఒక రూపంలో దర్శించుకునే అవకాశం ఉంటుంది. ప్రతిమాటకూడా భగవంతుడిని పిలిచేదే. అసలు అక్షరాలన్నీ భగవంతునికి సంబంధించినవే అయినప్పుడు, ఏ పిలుపు అయినా ఆయనకే చెందుతుంది. 

ప్రకృతిలో పిలుపు గొప్పదనం చాలా విశేషమైంది. మనసా, వాచా మనం ఏది పిలిస్తే అది మనకు వస్తుంది. నోరులేని ప్రాణులు సైతం మన పిలుపునకు, సైగలకు స్పందించి వచ్చినట్టే.. ప్రకృతిలోని శక్తి కూడా మనతో అనుసంధానం అవుతుంది. ఆ పిలుపునే మనం ‘జపం’ అంటున్నాం. జపంలో ప్రతిసారీ దైవదర్శనం లభిస్తుంది. దైవ దర్శనం కలగని జపాలు వ్యర్థం. అటువంటి జపాలలో విశేషమైంది, పాంచభౌతిక శక్తిని పిలిచేది అయిన మంత్రరాజం... ‘శ్రీమాత్రే నమః’.

శ్రీ శబ్దం.. లక్ష్మి, సరస్వతి, పార్వతి, సంపత్తి, బుద్ధి, వేషరచన, శోభ, సరలవృక్షం, లవంగం, విషం, బిల్వవృక్షం, విభూతి, ఆదిత్యప్రభ, త్రివర్గం, ఉపకరణం, కీర్తి, వృద్ధి, సిద్ధి, కమలం, వృద్ధినామ ఔషధం తదితరాలకు సంకేతంగా ఉంటుంది. శ్రీ విశేషం కావడం వల్లనే భారతీయ జీవనంలో భాగంగా చూడటం సంప్రదాయమైంది. దైవాల పేర్లముందు, పరివ్రాజకుల పేర్లముందు, పెద్దల పేర్లముందు ‘శ్రీ’ చేర్చి ఉచ్చరించడం గమనిస్తుంటాం. శ్రీవారు, శ్రీమతి, శ్రీయుత.. మొదలైన అంశాలతోపాటు పేర్లలోనూ శ్రీని జోడించే సంప్రదాయం ఉంది. పురుషులకు, స్త్రీలకు కూడా ఇదే వర్తిస్తుంది. శ్రీనివాస్‌, శ్రీకరి, కావ్యశ్రీ, తేజశ్రీ వంటి నామాలు ఉదాహరణలు. 

భారతీయ జీవనంలో తల్లికి నమస్కరించడం సంప్రదాయం. మనని కన్నతల్లి, కన్న భూమాత ...ఇందరినీ పోషించే పాంచభౌతిక శక్తి శ్రీమాత. ఆమెకు నమస్కరించడం ద్వారా అన్ని సిద్ధులూ మనకు లభిస్తాయి. అమ్మ బిడ్డకు అన్నీ సమకూర్చినట్టుగానే,  ‘శ్రీమాత్రే నమః’ జపం కూడా సాధకులకు సకల సౌఖ్యాలూ అందిస్తుంది.  సంపద, శక్తి, జ్ఞానం, సంపద, సిద్ధి, బుద్ధి, కీర్తి, మేధ, ధృతి, తేజస్సు, ఓజస్సు మొదలైనవాటికి శ్రీ అధినాయకురాలు.  జపం నిరంతరం చేయాలి. చేసిన ప్రతి నమస్కారంలోనూ అమ్మ రూపాన్ని దర్శించగలగాలి. పాంచభౌతిక శక్తిని నిరంతరం ఉపాసించే విధానమే ఐదు అక్షరాలతో కూడుకున్న ‘శ్రీమాత్రే నమః’. 

- సాగి కమలాకరశర్మ, 97042 27744


logo