సోమవారం 10 ఆగస్టు 2020
Devotional - Jun 08, 2020 , 00:53:50

పాంచాలి- పంచ భర్తృక!

పాంచాలి- పంచ భర్తృక!

ప్రశ్న: ద్రౌపదికి అయిదుగురు భర్తలు సమంజసమేనా? -అర్చనాకుమారి, హైదరాబాద్‌

జవాబు: ‘మహాభారతం’లో ద్రౌపది పుట్టుకయే యజ్ఞ వేదిక నుండి. జ్వలించడమే ఆమె లక్షణం. ఆమె జ్వలన.. కర్తవ్య నిర్వహణ, ధర్మ పరాయణత వైపు నడుస్తుంది. ఆమె వివాహ ప్రసక్తికి వస్తే, ద్రుపదుడు ఏర్పాటుచేసిన స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించి అర్జునుడు ద్రౌపదిని తోడ్కొని తల్లి వద్దకు వస్తాడు. ‘అమ్మా! మేమొక భిక్ష తెచ్చాం’  అంటాడు. ‘అందరూ సమంగా పంచుకోండి నాయనా!...’ అంటుంది కుంతి వెంటనే. అంతే! ద్రౌపది బిత్తరపోతుంది. ఆమెలో ఒకటే సందేహం. 

‘తనను గెలుచుకున్నది అర్జునుడని తెలిసి సంతోషించాలా? అత్తగారి మాటలకు కలత చెందాలా?’ అని.ఈ వృత్తాంతం గురించి ద్రుపదునితో వ్యాసుడు ఇలా చెపుతాడు.. ‘పూర్వజన్మలో ఆమె (ద్రౌపది) పేరు ఇంద్రసేన.  మౌద్గల్యుడు అనే ముని భార్య. ఆ మౌని ఆమెతో ఐదు శరీరాలు ధరించి విహరించాడు. అలాగే, రెండవ జన్మలో ఆమె కాశీరాజుకు కూతురిగా జన్మించింది. తనకు నచ్చిన వాడిని వివాహమాడాలనే సంకల్పంతో శివుని గురించి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షం కాగానే ‘పతి పతి‘ అంటూ కంగారులో ఐదుమార్లు కోరడంతో, శివుడు ‘తథాస్తు’ అన్నాడు. దాంతో తప్పు తెలుసుకున్న ఆమె ‘అసహజమైన ఆ బంధాల్ని భరించలేననీ, ఏదైనా ఉపాయం చెప్పమని’ శివుడిని వేడుకొంటుంది. శివుడు ఇంద్రుడిని పిలిచి, అయిదు రూపాలలో ఆమెను వివాహ మాడమంటూ శసిస్తాడు. అప్పుడు ఇంద్రుడు పంచేంద్రియాల తత్త్వంలో ధర్మువు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలుగా .. తనను తాను విభజించుకుంటాడు. ఆయా అంశలతో జన్మించిన వారే ధర్మజ, భీమార్జున నకుల సహదేవులు. ‘కాబట్టి, అయిదుగురికీ ఇచ్చి వివాహం చేయమని’ చెపుతాడు వ్యాసుడు. ద్రుపదుడూ ఒప్పుకుంటాడు. అసలు, వివాహానికి కావలసిందేమిటి? యువతీ యువకుల్లో ఒకరిపట్ల ఒకరికి అంకితభావం, అనుబంధం, సహచర్యం, సంతృప్తి. వీటికి ప్రాతిపదిక... ఒకరిపట్ల మరొకరికి సాన్నిహిత్యంతో కూడిన అవగాహన. ఈ విజ్ఞత తనలో వెలుగు చూడటం వల్ల, వ్యాసుడు ద్రుపదునికి ఆమె పూర్వ చరిత్ర చెప్పి ఒప్పిస్తాడు. అలా... ద్రౌపది పంచపాండవులతో వివాహానికి సమ్మతిస్తుంది.


logo