సోమవారం 10 ఆగస్టు 2020
Devotional - Jun 07, 2020 , 00:42:10

విజయఫలాలతో సరికొత్త శక్తి!

విజయఫలాలతో సరికొత్త శక్తి!

అద్య ప్రభృత్యవన తాంగి! తవాస్మి దాసః

క్రీతస్త పోభిరితి వాదిని చంద్రమౌళౌ

అహ్నాయ సా నియమజం క్లమ ముత్ససర్జ

క్లేశః ఫలేన హిపునర్నవతాం విధత్తే॥

కాళిదాసు మహాకవి ‘కుమార సంభవ’ కావ్యం పంచమసర్గలోని మనోహరమైన శ్లోకాలలో ఇదొకటి. బ్రహ్మచారి రూపంలో వచ్చిన శివుని పరీక్షలో పార్వతీదేవి విజయం సాధించింది. పరమేశ్వరుడు ప్రసన్నుడై నిజరూపం ధరించి పార్వతితో పలికిన సందర్భంలోనిదీ శ్లోకం. శంకరుని నిజరూపం చూసి, సిగ్గుల మొగ్గగా మారింది పార్వతి. అప్పుడు శివుడు ఆమెతో ‘పార్వతీ! నీ తపస్సుతో నన్ను గెలుచుకొన్నావు. కనుక, నేనిప్పుడు నీ ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించవలసిన వాడను’ అంటాడు. ఆ మాటలకు పార్వతి తాను తపస్సులో అనుభవించిన కష్టమంతా మరిచి ఆనందపరవశురాలైంది.

కార్యసాధన కోసం ఎంత కష్టపడ్డా ఆ కార్యం సఫలం కాగానే, పడిన కష్టం మాయమైపోతుంది. ఆ ఉత్సాహంతో మళ్లీ ముందుకు సాగే శక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని వివరించే లోకోక్తినే పై శ్లోకం అందించింది. ఒక విద్యార్థి రేయింబవళ్లు ఏకాగ్రతతో ఎంతో శ్రమపడి పరీక్ష రాస్తాడు. అందులో తాను మంచి ఫలితాన్ని పొందినట్లుగా తెలిసినప్పుడు అతని మనస్సులో ఎంత ఉత్సాహం ఉప్పొంగి ఉంటుందో అతని ముఖం చూస్తే తెలుస్తుంది. అది తాను అంతకు పూర్వం పడిన శ్రమనంతటినీ మరిచిపోయేటట్లు చేస్తుంది. ఒక రైతు భూమిని సిద్ధం చేసి, ఎరువులు వేసి, తొలి వర్షం పడగానే దుక్కి దున్ని, విత్తనాలు చల్లుతాడు. అవి మొలకెత్తిన దగ్గర్నుంచీ అహరహం శ్రమిస్తూ అతి శ్రద్ధగా పైరును సాకుతూ ఫలసాయం పొందుతాడు. అప్పుడా రైతు తాను పడ్డ కష్టాన్నంతా మరిచిపోయి ఆనందపరవశుడౌతాడు. ఆ ఉత్సాహం అతనికి వేయి యేనుగుల బలాన్నిస్తుంది. మళ్లీ వ్యవసాయ కార్యక్రమంలో నిమగ్నమవుతాడు. తల్లి తొమ్మిది మాసాలు గర్భస్థ శిశువును సంరక్షించడానికి అష్టకష్టాలూ భరిస్తుంది. పురుటి నొప్పులతో అల్లల్లాడిపోతుంది. ఆఖరున పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. అప్పుడు తాను పడ్డ శ్రమనంతా మరిచిపోతుంది. అప్పట్నుంచీ తన బిడ్డ రక్షణను గురించే ఆరాటపడుతుంటుంది. 

ఒక ప్రజానాయకుడు మందుచూపుతో ఒక బృహత్‌ ప్రణాళికను రచించి, దానిని కార్యాచరణలోకి తెచ్చేందుకు తగిన వనరులను, కార్యకర్తలను తయారు చేసుకొని, శ్రమిస్తూ ముందుకు సాగుతాడు. మొదట ‘ఆ పని సాధ్యమా?’ అన్న అనుమానం వస్తుంది. నాయకుడు విమర్శను లెక్కపెట్టకుండా ధైర్యంతో ముందుకెళుతూ, ఎంతో శ్రమ ప్రయాసలతో చివరకు విజయం సాధిస్తాడు. ఆ ఫలితం అందుబాటులోకి వచ్చినప్పుడు అతణ్ణి ప్రపంచం అభినందిస్తుంది. అప్పుడు ఆ నాయకుడు పొందే ఆనందం తాను అంతకు ముందు పడ్డ కష్టాలను మరిచేటట్లు చేస్తుంది. ద్విగుణీకృతమైన ఉత్సాహంతో మున్ముందుకు సాగుతాడు. ఇలా సమాజంలోని వ్యక్తులు, వర్గం, జాతి క్లేశాలను అనుభవిస్తూ కార్యాలను సాధిస్తూ ముందుకు సాగుతారు. జంతువులూ ఆహారం కోసం శ్రమిస్తూ తమ వేట ఫలించినప్పుడు సుఖాన్ని పొందుతవి. కనుక, పై సూక్తిని యావత్‌ ప్రాణికోటికీ వర్తించే లోకోక్తిగా గుర్తించాలి. 

ఒక సాధువు లేదా వేదాంతి ఏ సుఖాలనూ అపేక్షించక మోక్షార్థిగా క్లేశపడుతూ సాధన సాగిస్తాడు. అది ఫలవంతమైనప్పుడు అంతదాకా పొందిన క్లేశాన్నంతా మరిచిపోతాడు. కనుక, వారికీ ఈ లోకోక్తి వర్తిస్తుంది. ఇలా అందరికీ అన్ని కాలాల్లోనూ వర్తించే సూక్తులు అందరి అనుభవంలోకి వచ్చే లోకోక్తులుగా ప్రసిద్ధి పొందుతూ ప్రగతికి మార్గదర్శకాలుగా నిలుస్తవి. జనులకు శ్రమ లేకుండా జ్ఞానాన్ని ప్రసాదించేవి ఇలాంటి లోకోక్తులు, సూక్తులే. అందుకే, కాళిదాసు మహాకవి గొప్ప లోకజ్ఞుడు. మానవ మనస్తత్వాన్ని మథించిన మహామనీషి, గొప్ప తత్తవేత్త. ఆయన రచనలు చిరస్థాయిగా నిలిచే జ్ఞానభాండాగారాలు.


logo