మంగళవారం 11 ఆగస్టు 2020
Devotional - Jun 05, 2020 , 23:06:04

సర్వం దైవమయం జగత్‌!

సర్వం దైవమయం జగత్‌!

పరంబ్రహ్మ పరంధామ, పవిత్రం పరమం భవాన్‌

పురుషం శాశ్వతం దివ్యమ్‌, ఆదిదేవమజం విభుమ్‌

శ్రీమద్భగవద్గీతలోని 10వ అధ్యాయమైన ‘విభూతియోగం’లో అర్జునుడు పలికిన మాటలివి. దీనితో శ్రీకృష్ణ పరమాత్మ సర్వవ్యాపకత్వం అద్భుతంగా తెలుస్తున్నది. ‘నీవే పరబ్రహ్మం, నీవే పరంధామం. నువు పరమ పవిత్రం, పరమపావన రూపం. లోకంలోని సకల ఋషులు కూడా ‘నీవు సనాతనుడివనీ, దివ్య పురుషుడివనీ, దేవతలకూ నీవే ఆదిదేవుడవని, ఇంకా.. జన్మరహితుడవనీ, సర్వవ్యాపివనీ చెబుతున్నారు’ అన్న పాండవ మధ్యముని పలుకులలోని సత్యాన్ని ఆవిష్కరించిన ‘విభూతి యోగం’ ఈ విశ్వమంతా స్వామిమయమనే తెలుపుతున్నది.

‘విభూతి’ అంటే ‘ఐశ్వర్యం’. సర్వ చరాచర ప్రపంచం. ఈ సర్వసృష్టి కూడా ఆ పరమాత్ముని ఐశ్వర్యమే కదా! ఈ విషయాన్నే అర్జునునికి చెప్పే నెపంతో భగవానుడు లోకానికి వెల్లడించాడు. ఈ సృష్టిలోని సర్వజీవులలో, సర్వ ప్రకృతిలోనూ భగవంతుడే ఉన్నాడని చెప్పి, ఈ అధ్యాయంలో ప్రధానంగా దైవశక్తి అధికంగా కనిపించే 72 స్థానాలను గురించి ప్రత్యేకంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. అవన్నీ తన స్వరూపాలుగానే స్థిరీకరించాడు. ‘లోకంలోని శక్తివంతమైన వస్తువులన్నీ ఒక మహాశక్తి నుంచి ఆవిర్భవించినవే’ అన్న సత్యాన్ని ఆవిష్కరించాడు. వస్తువులు వేర్వేరుగా ఉండవచ్చు కానీ, అన్నింటిలోని పరమాత్మ ఒక్కటేనన్నది ఇక్కడ స్పష్టం. ఈ అధ్యాయానికి ముందు అధ్యాయాల్లో కొన్ని విభూతులను ప్రస్తావించి, వాటికి మూలం ‘నేనే’ అని స్పష్టపరిచాడు. కొన్నింటిని పరిశీలిస్తే అపురూపమైన విశేషాలు అర్థమై, దైవతత్త ప్రాశస్త్యం ఎంత మహత్తరమైందో మనకు బోధపడుతుంది.

మొదట చెప్పిన స్థానం ‘జీవాత్మ’. అంటే, పరమాత్మ నిత్యం వసించే జీవాత్మ పరమాత్మ స్వరూపమే. ఇది తెలుసుకున్న వారెవరైనా ‘మానవ సమాజంలోని ప్రతి జీవి కూడా పరమాత్మ స్వరూపమే’నన్న జ్ఞానం పొంది సర్వసమభావానికి పునాది వేసే దిశగా తన జీవితాన్ని దిద్దుకుంటాడు. ఇది సమసమాజ ఆవిర్భావానికి మొదటి మెట్టు అవుతుంది. అదేవిధంగా, ‘వేదాలలో నేను సామవేదాన్ని, యక్ష రాక్షసులలో కుబేరుడిని, పర్వతాలలో మేరు పర్వతాన్ని, సరస్సులలో సముద్రాన్ని’ అని చెబుతూ ‘పురోహితులలో బృహస్పతిగా’ తనను తాను చెప్పుకొన్నాడు. ‘బృహస్పతి’ జ్ఞానశక్తికి ప్రతీక.

యావద్విశ్వంలో జ్ఞానానికే ప్రాముఖ్యం ఉంటుంది. అందుకే, జ్ఞానం భగవత్సరూపంగా భావించాలన్నది దీనివల్ల బోధపడే సత్యం. మరో శ్లోకంలో తాను ప్రాణులలోని ధర్మబద్ధమైన ‘కామ (మన్మథ) స్వరూపుని’గా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం ఆలోచించదగ్గది. సృష్టి విస్తృతికి ‘కామం’ ముఖ్యమే. అయినా, సనాతనధర్మం కామానికి కొన్ని హద్దులు విధించింది. చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో దీన్ని చేర్చి, దీనికొక గౌరవాన్ని కలిగించారు. మానవ జీవన విధానాలైన పురుషార్థాలలో స్థానం కలిగించినా ‘అది ధర్మబద్ధమైన కామం’ కావాలనీ నిర్దేశించారు. విశృంఖల కామం ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది. ధర్మబద్ధమైన కామం ప్రపంచాన్ని సక్రమ మార్గంలో ముందుకునడిపిస్తుంది. కనుకనే, దానిని భగవత్‌ స్వరూపంగా భగవద్గీత చెప్పింది. ధేనువులలో కామధేనువు విశిష్ఠమైంది. కోరిన కోర్కెలు తీర్చగల ధేనువు సర్వశ్రేష్ఠమైంది. గోజాతి విశిష్టతను లోకానికి తెలియజేసిన విభూతిగా దీన్ని గుర్తించవచ్చు. ప్రపంచానికి అవసరమైన జలధారనిచ్చే గంగానదిని కూడా తన విభూతిగానే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పడం.. ‘లోకంలోని ప్రయోజనాత్మకమైన ప్రతి వస్తువూ భగవత్సరూపంగానే భావించాలన్నదీ’ అందులోని తాత్పర్యం.

మరో విచిత్ర విభూతి ‘మృత్యువు’. ‘మృత్యుః సర్వహరశ్చాహం’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే, ‘మృత్యువుకు ప్రతిరూపాన్నీ నేనే’ అని చెప్పడం. సాధారణంగా మృత్యువు లేని జీవితం ప్రపంచంలో లేదు. కాని, ప్రతి ప్రాణికీ ఇంకా జీవించాలన్న ఆశ చావదు. బతికినన్నాళ్లు బాధలు తప్పవు. బాధలు తీరేది మృత్యువుతోనే. అయినా, మనం మృత్యువుకు భయపడుతుంటాం. దీన్ని కూడా ‘దైవ విభూతి’గా భావించినప్పుడు మనకు మృత్యుభయం ఉండదు. మృత్యుభయం లేనప్పుడు ఎన్ని కష్టాలకైనా భయపడం. కష్టాలను ఎదిరించి విజయాలను సాధిస్తాం. ‘మృత్యువు ఉండకూడదు’ అనే అజ్ఞానం నుంచి దూరమై ఆనందాన్ని పొందుతాం. మొత్తంగా శ్రీకృష్ణ భగవానుడు ‘యావద్విశ్వం దైవమయమే’ అన్న మహత్తర సత్యాన్ని మానవలోకానికి ప్రసాదించి మనలను తరింపజేశాడు.


logo