శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jun 05, 2020 , 00:47:51

క్రిమినాశక శక్తి చండీమాత!

క్రిమినాశక శక్తి చండీమాత!

చండీ సప్తశతి లేదా దుర్గా సప్తశతి పేరుతో పారాయణాలు, పూజలు, అర్చనలు చేయడం భారతీయ సంప్రదాయం. చండీహోమాలు కూడా అనేక రూపాల్లో నిర్వర్తిస్తుంటాం. ఎంతోమంది అసురులను చంపిన ఒక దివ్యశక్తిగా చండీమాతను కొలుస్తాం. ‘అసుర’ శబ్దార్థమే అధికంగా ఇబ్బంది పెట్టేది. లోకానికి ఇబ్బంది పెట్టేవారు రాక్షసులు. తమకోసం తాము ఆలోచించుకోవడం స్వార్థ లక్షణం. లోకక్షేమం కోసం ఆలోచించడం దివ్య లక్షణం. ఇటువంటి తత్త్వం కలిగినవారే ‘దైవాలు’. అగ్ని, వాయువు, ఆకాశం, చెట్లు, వర్షం అన్నీ దివ్యత్వ లక్షణాలను ఆపాదించుకున్నవే. వీటన్నింటి ద్వారా కలిగే సంతోషాన్ని, సంతృప్తినీ, ప్రశాంతతనూ, ఆరోగ్యాన్నీ మనకు కలుగకుండా అడ్డు పడేదంతా ‘అసుర’తత్త్వం. దీనిది ఎన్నో రూపాలు. దైవత్వాన్ని లోకానికి అందకుండా చేసే ఈ ఆసురీతత్త్వాన్ని ఎప్పటికప్పుడు నిర్మూలించే శక్తులలో ప్రత్యేకమైందే చండీమాత.

మానవ శరీరాలు, ప్రకృతి, పశుపక్ష్యాదులు అనేకవిధాలుగా నాశనమవుతుంటాయి. మళ్లీ పుడుతుంటాయి. ప్రత్యక్షంగా ఒక బలవంతుడు వచ్చి చేసే యుద్ధం కంటే పరోక్షంగా అతి సూక్ష్మజీవుల రూపనాశన విధానమే అధికం. భూమి, జలం, వాయువు అంతా సూక్ష్మజీవి మయమే. మనకు ఉపకరించే సూక్ష్మజీవులతో పాటు ప్రస్తుత ‘కరోనా’, ‘ఎబోలా’ లాగా ప్రాణాలు తీసేవి కూడా అనేక రూపాల్లో ఉద్భవిస్తుంటాయి. ప్రకృతిలో, శరీరంలో బలం తగ్గి, మలినాలు పెరిగినప్పుడు వానిని ఆవాసం చేసుకొని ఇలాంటివి బయటకు వస్తుంటాయి. చాలాసార్లు ఇవి కొద్దిమేరకే పరిమితమైతే, ప్రకృతి మొత్తం పెద్దస్థాయిలోనూ వ్యాపించే సందర్భాలూ అరుదుగా తలెత్తుతై. ఇవే పూర్వకాలంలో కథలుగా రూపొందిన ప్రాకృతిక ఆసురీశక్తులు. చాలా పురాణాల్లో ఇవి ప్రతీకాత్మక కథలుగానూ ఉన్నాయి. మన శక్తిని మనం పెంచుకోవడం, ప్రకృతి శక్తిని పెంచడం, సమతుల్యతను కాపాడటం వంటివి నిరంతరం చేయడం ద్వారా ఈ తరహా ప్రకృతి వ్యతిరేక శక్తులను మనం అధిగమించవచ్చు. యోగ, ప్రాణాయామం, ధ్యానం వంటివి వ్యక్తిగతంగా, వృక్షస్థాపన, హోమాల నిర్వహణ వంటివి సామాజికంగా, ప్రాకృతికంగా ఉపయోగపడుతాయి. ఈ క్రమంలో చండీహోమం సూక్ష్మజీవి నాశక ప్రక్రియనే.

మనలోని, ప్రకృతిలోని మలినాలు, కాలుష్యాల నుంచి పుట్టిన మధుకైటభులు, మహిషాసురుడు, ధూమ్రలోచనుడు, చండముండులు, రక్తబీజుడు, శుంభ నిశుంభులు మొదలైనవారిని అమ్మవారి రూపంలో ప్రకృతి శక్తి పారదోలిన విధానమే చండీహోమంలో ఉంటుంది. ఇంకా చిక్షురుడు, తామ్రుడు, అసిలోముడు, ఉదర్కుడు, బిడాలుడు, బాష్కలుడు, త్రినేత్రుడు, కాలబంధకుడనే అనుచరుల పేర్లలోనూ ఈ సూక్ష్మక్రిమి ఏయే జీవుల ద్వారా విస్తరిస్తుందో అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయంపై ఆధునిక పరిశోధనలు భారతీయ సాంస్కృతిక, వైజ్ఞానిక ఔన్నత్యాన్ని వెలికితీసేవిగా ఉంటాయి. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన వానిలోనూ ఈ విషయాల వర్ణన మనకు కనిపిస్తుంది.

రసాతల, పాతాళాలలో ఉన్న ఆయా రాక్షసులు భూమిపై వ్యాపనంలోకి వచ్చి, దైవాలను (పంచభూతాలను) సరైనవిధంగా పనిచేయకుండా అడ్డుపడుతున్న సందర్భంలో దేవీ (ప్రకృతి) శక్తిని ప్రార్థన చేసే విధానమే ఈ హోమాలు, చండీ అర్చనలు. అప్పుడు ప్రకృతి శక్తి ఉద్దీపనమై లోకాన్ని రక్షించే విధానమే ఈ పూజల్లో కనిపిస్తుంది. భూమిపై జీవసృష్టి ప్రారంభం నుంచీ ఉన్న ఈ సూక్ష్మజీవులు చాలావరకు రసాతల, పాతాళాది లోకాల్లో ఉండవలసివి. అవి బయటికి రాకుండా ప్రకృతి బలంగా ఉండాలి. వాటికి అక్కడ కాకుండా ఇక్కడ జీవనానికి అనుకూలమైన మలిన, కాలుష్య వాతావరణం ఉండకూడదు. బోనాలను అమ్మవారికి సమర్పించేటప్పుడు ఏ రకమైన పరిశుద్ధత (మనసా, వాచా, కర్మనా) ఏర్పర్చుకుంటారో అదే విధమైన స్వచ్ఛతను ప్రస్తుతం ప్రజలంతా తమ శరీరానికి, గృహానికీ ఏర్పర్చుకోవాలి. సూక్ష్మక్రిమిని మన చైతన్యశక్తితో పారదోలే విధానాన్ని మనవైన భారతీయ సనాతన సంప్రదాయం నుంచి అలవర్చుకోవడం మంచిది. ఆధునిక రసాయన క్రిమి నాశకాల కన్నా ప్రకృతి ఇచ్చిన శక్తివంతమైన వానిని ఉపయోగిస్తూ విజయులం కావాలి. చండీమాత అనుగ్రహంతో ఆ క్రిమినాశక శక్తిని పెంచుకోవడానికి అందరం ప్రయత్నిద్దాం.


logo