శుక్రవారం 10 జూలై 2020
Devotional - Jun 03, 2020 , 23:14:04

సకలమూ వాసుదేవ మయమే!

సకలమూ వాసుదేవ మయమే!

‘వాసుదేవ పరా వేదా వాసుదేవ పరా మఖాః

వాసుదేవ పరా యోగా వాసుదేవ పరాఃక్రియాః॥

వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః

వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరా గతిః॥

శ్రీమద్భాగవతం ‘వాసుదేవ’ పదాన్ని అత్యంత మహిమాస్పదమని, మంగళప్రదమని ప్రతిపాదించింది. పైన పేర్కొన్న భాగవత శ్లోకాల ఆధారంగా, వేదాలన్నీ వాసుదేవ తత్తాన్ని వివరించేవే, సమస్త యాగాలు వాసుదేవునికి చెందినవే. అందుకే, ‘యజ్ఞో వై విష్ణుః’ అన్నది వేదం. ‘సకల యోగాలు కూడా వాసుదేవునికి సంబంధించినవే. అలాగే, సమస్త క్రియలు (పనులు) వాసుదేవ పరములే. జ్ఞానం వల్లనే యోగులు కైవల్యాన్ని కైవసం చేసుకుంటారు (జ్ఞానా దేవతు కైవల్యం). కాబట్టి, సకల జ్ఞానం వాసుదేవుణ్ణి గురించి వివరించేదే. ఇంకా దానవ్రతాదులను తెలిపే ధర్మశాస్త్రమంతా వాసుదేవపరమే. ధర్మాచరణ వల్ల లభించే స్వర్గాది ఫలరూపమంతా వాసుదేవునికి సంబంధించిందే. ‘వాసుదేవ పరం కాని అంశం ఈ విశ్వంలో ఎక్కడా లేదనేది’ పై శ్లోక వాక్యాల సారాంశం.

వాసుదేవుడు అనే పదానికి ‘వసుదేవుని కొడుకు’ (వసుదేవస్య అయం) అని సామాన్యార్థం. ‘దేవః’ అన్న శబ్దానికి స్వయంగా ప్రకాశించేవాడు (దీవ్యత ఇతి దేవః) అని అర్థం. వసువులంటే పుణ్యాలు. ధర్మసంస్థాపన కోసం చేసే పుణ్యకార్యాల వల్ల ప్రకాశించేవాడు కాబట్టి, ఆయన వసుదేవుడు. ఆ వసుదేవుడే వాసుదేవుడయ్యాడు (వసుదేవ ఏవ వాసుదేవః అని). ఇంకా విశేషించి విశ్వంలో అంతటా వ్యాపించి ఉండేవాడు (వసత్యస్మి న్జగతి ఇతి వాసుః). విశ్వమంతా తనలో కలవాడు (వసంతి జగంత్యస్మిన్నితి వాసుః) వాసుః అవుతాడు. అలా ప్రకాశించే దేవుడే వాసుదేవుడుగా కీర్తనలు అందుకుంటున్నాడు. ఇదే భావాన్ని అనుసరిస్తూ తెలుగుల పుణ్యపేటి పోతన మహాకవి ఇలా అన్నాడు.

‘హరి మయము విశ్వమంతయు

హరి విశ్వ మయుండు సంశయము పని లేదా

హరి మయము గాని ద్రవ్యము

పరమాణువు లేదు వంశపావన! వింటే.

అనిచిన్న పద్యం ద్వారా ఉన్నతమైన వాసుదేవ తత్తాన్ని కండ్లకు కట్టినట్లుగా విశదీకరించాడు పోతన. మనలోని మనోబుద్ధి చిత్తాహంకారాలకు వరుసగా అధిష్ఠాన దైవాలున్నారు. అందులో చిత్తానికి వాసుదేవుడు అధిష్ఠాన దైవం అని చెబుతున్నది శ్రీమద్భాగవతం.

శ్రీమద్భాగవతం వసుదేవ శబ్దానికి ‘శుద్ధ సత్త గుణంతో సంపన్నమైన అంతఃకరణం’ (సత్తం విశుద్ధం వసుదేవ శబ్దితం) అని నిర్వచనం ఇచ్చింది. అలాంటి శుద్ధ సత్త గుణంతో నిండిన అంతఃకరణం వాసుదేవునికి వరణీయమైన గుడి అవుతుంది. బాలభక్తుడైన ధ్రువునికి దేవముని అయిన నారదుడు ఉపదేశించిన మంత్రం కూడా పన్నెండు అక్షరాలతో కూడిన ఓంకార యుక్తమైన వాసుదేవ మంత్రమే కావడం ఒక విశేషం. ఈ మంత్రాన్ని మనోనిష్ఠతో స్మరిస్తే ఏడు వారాలలో దైవ దర్శనం కలుగుతుందని నారదుడు ధ్రువునితో చెప్పిన మాట ఇక్కడ గమనార్హం. ఈ వాసుదేవ మంత్రాన్ని అలుపెరుగని ఆత్మనిష్ఠతో ఉపాసించిన ధ్రువుడు అచిరకాలంలోనే అచ్యుత సాక్షాత్కారాన్ని పొందిన విషయం అందరికీ తెలిసిందే. అందరికీ ఆరాధ్యనీయమైన భగవద్గీత కూడా వాసుదేవ శబ్దాన్ని ఇలా ప్రస్తావించింది.

‘బహూనాం జన్మనామంతే జ్ఙానవాన్మాం ప్రపద్యతే  వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదర్లభః॥

‘జ్ఞానం కోసం అవసరాలైన సంస్కారాలను సంపాదించడానికై అనేక జన్మలనెత్తిన మనిషి, చివరికి జ్ఞాన పరిపక్వత కలిగి ఆ జ్ఞానం వల్ల ‘సకలమూ వాసుదేవ మయమే’ అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలిసి సర్వాత్మ అయిన వాసుదేవుణ్ణి పొందుతున్నాడు. అయితే, అలా ‘సర్వమూ వాసుదేవుడే అనే వాస్తవాన్ని తెలుసుకునే జ్ఞానవంతుడైన మహాత్ముడు చాలా అరుదు’ అని పై శ్లోకభావం. వాసుదేవ శబ్దం ఇంత మహత్తపూర్ణమైంది కనుకనే, నేటికీ ఎక్కడైనా భాగవత ప్రవచనాలు జరిగేచోట ప్రవచనకర్తలు వాసుదేవ స్మరణ/ భజనలను భక్తులతో తప్పక చేయిస్తారు. అలాంటి వాసుదేవ నామాన్ని అనుక్షణం మనం కూడా స్మరిద్దాం, తరిద్దాం!


logo