శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Jun 02, 2020 , 22:36:54

భగవంతుడే స్వతంత్రుడు!

భగవంతుడే స్వతంత్రుడు!

ఈ జగత్తు విచిత్రమైంది. ఇదొక రోజు సృష్టింపబడుతుంది. ఒకరోజు లయమవుతుంది. మధ్యన పోషింపబడుతుంది. మరి, ‘ఈ సృష్టి స్థితి లయలకు కారణం ఎవరు? ఎవరిద్వారా ఈ మూడు మహాకార్యాలు జరుగుతున్నాయి?’ అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవలసి ఉన్నది. వేదం మూడు పదార్థాలను అనాది తత్తాలుగా గుర్తించింది. అవి: భగవతత్తం, ప్రకృతితత్తం, జీవతత్తం. ఈ మూడింటిలో భగవంతుడు సర్వజ్ఞుడు. ప్రకృతి జడం. అది జ్ఞానం లేనిది. జీవుడు భగవంతుని వలె సర్వజ్ఞుడు కాడు. ప్రకృతి వలె జడపదార్థం కాడు. తక్కువ జ్ఞానం కలిగినవాడు, అల్పజ్ఞుడు. సర్వజ్ఞుడైన భగవంతునికే జగత్తును నిర్మించే సామర్థ్యం ఉన్నది. జీవునికి ఆ సామర్థ్యం లేదు. నిజానికి జీవుల కోసమే భగవంతుడు సృష్టిరచన చేశాడు.

‘భగవంతుడు తన కోసమే జగత్తును నిర్మించుకొన్నాడని’ కొందరు వాదించవచ్చు. కానీ, అది సత్యం కాదు. జీవులు కర్మలు చేస్తారు. కర్మఫలాలు అనుభవిస్తారు. అందుకు జగత్తు అవసరం. అందువల్ల జగత్తు భగవంతుని కోసం కాక, జీవుల కోసమే నిర్మితమైందన్న విషయం వివాదానికి తావులేనిది. భగవంతుడు మనకోసం జగత్తును సృష్టించాడు. అంతేకాదు, జగత్తులో మనల్ని భాగస్వాములను చేశాడు. దీన్నిబట్టి భగవంతుడు సృష్టి రచనలో ‘స్వతంత్రుడని’ తెలుస్తున్నది. అంతేకానీ, ఈ జగత్తు దానంతట అదే సృష్టింపబడిందని చెప్పడం సరికాదు. ‘జగత్తుకు మూలకారణం ప్రకృతి అని, అదే స్వతంత్ర కారణమని’ చెప్పడం హేతుబద్ధం కాదు.

ప్రకృతి జడం (తెలివి లేనిది). దానికి జగత్తును నిర్మించే శక్తి ఎట్లా సంభవం? కనుక, ప్రకృతి ఈ అద్భుతమైన ప్రపంచానికి స్వతంత్ర కారణం కాజాలదు. జగత్తు రచన, నిర్మాణం అనే అంశాలు జ్ఞానంతో కూడినవి. అవి చేతనధర్మాలే కాని, జడపదార్థాల ధర్మాలు కావు. ప్రకృతి జగత్తుగా మారాలన్నా, పోషింపబడాలన్నా, చివరికి లయం కావాలన్నా, ఈ పనులు అపారమైన జ్ఞానంతో, సామర్థ్యంతో చేయదగినవే కాని, వాటంతట అవే అయ్యే పనులు కావు. ఐతే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడైన భగవంతుని అధీనంలో ప్రకృతి ఉంటుంది. అందువల్ల జగత్తుకు కారణమవుతుంది. అంతేకానీ, భగవంతుని ప్రమేయం లేకుండా ప్రకృతి జగత్తుగా పరిణామం చెందదు.

ఈ తాత్విక విషయం అర్థం కావాలంటే, లోకంలోని ఒక విషయాన్ని ఉదాహరణగా చూపవచ్చు. మనకు కుండ కావాలి. దానికి కావలసిన మట్టి లభ్యమైనప్పటికీ కుమ్మరి లేకపోతే కుండ తయారు కాదు. అలాగే, ప్రకృతి అనే ద్రవ్యం ఉన్నప్పటికీ భగవంతుడు (చైతన్య స్వరూపుడు) లేకపోతే జగత్తు అనేది నిర్మాణం కాదు. అందువల్ల ‘జగన్నిర్మాణంలో ప్రకృతి మూల కారణమైనప్పటికీ భగవంతుడే స్వతంత్ర కారణమని’ వేద విద్వాంసుల సిద్ధాంతం. ప్రకృతి కారణమని, దానికి ప్రపంచం కార్యరూపమని, కార్యకారణ సంబంధం వల్లే జగద్రచన జరుగుతుందని వారు లెక్కిస్తారు. ఈ కార్యకారణ సంబంధానికే ‘అన్వయం’ అని పేరు.

ఈ అన్వయమూ నిత్యమైందని దార్శనికులు భావిస్తారు. మరి, ‘కార్యరూప జగత్తుకు స్వతంత్రంగా జీవులకు సుఖదుఃఖాలను కలిగించే అవకాశం ఉందా?’ అంటే, ‘లేదనే’ చెప్పాలి. ఎవరే కర్మ చేశారో, దానికెంత ఫలమివ్వాలో జడ ప్రకృతికి తెలియదు. అది సర్వజ్ఞుడైన భగవంతునికి మాత్రమే తెలుసు. అందువల్ల జీవుల పుణ్యపాప కర్మలను బట్టి, జగద్రచన చేయడంలో భగవంతుడు స్వతంత్రుడని చెప్పవచ్చు.


logo