మంగళవారం 11 ఆగస్టు 2020
Devotional - May 31, 2020 , 23:04:54

జ్ఞానమే ఆత్మ, ఆత్మే జ్ఞానం!

జ్ఞానమే ఆత్మ, ఆత్మే జ్ఞానం!

జీవి చేష్ట, నడత మొదలైనవన్నీ మెదడు నియంత్రణలో జరిగే చర్యలు. జీవుల జీవితంలో ఆలోచన మొదలుకొని ఆచరణ వరకూ మెదడు తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. వృక్షాలు, మొక్కలు, సూక్ష్మజీవులకు పరిసరాలను గమనించగలిగే శక్తి తమ శరీరమంతా నిభిడీకృతమై ఉండటం వల్ల అవి తమ ఆహార సముపార్జన, పునరుత్పత్తులను సాధ్యం చేసుకుంటూ ఉంటాయన్నది నిరూపిత శాస్త్రం. అంటే, ప్రతి జీవికి ఎలా మనుగడ సాగించాలో చెప్పేందుకు ఒక ‘నియంత్రిత వ్యవస్థ’ ఉన్నదనేది సుస్పష్టం. ఇది జైవిక ప్రకృతి.

ఇక, ఖగోళ పదార్థాల విషయానికి వద్దాం. మన సౌరకుటుంబంలోని గ్రహాలు సూర్యుని చుట్టూ నియమిత కక్ష్యలో, నిర్ణీత వేగంతో తిరుగుతున్నాయి. సూర్యుడు ‘పాలపుంత’గా పిలిచే మన గెలాక్సీలోని ఒకానొక నక్షత్రం. ఈ నక్షత్ర మండలంలో దాదాపు పది వేల కోట్ల నుంచి నలభై వేల కోట్ల వరకు నక్షత్రాలు ఉన్నట్లు అంచనా. ఇలాంటి నక్షత్ర గుంపులు ఈ విశ్వంలో పరిశీలించగలిగే పరిధిలో దాదాపు నలభై వేల కోట్ల వరకు ఉంటాయని మరొక అంచనా. ఇంకా పరిశీలించలేని విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయన్నది శాస్త్రవేత్తల ఊహకందని విషయం. ఇవన్నీ ఏక కాలంలో తమకుతాము వివిధ నిర్ణీత వేగాలతో తిరుగుతూ ఎంతో సమతుల్యత, సమన్వయాలతో విశ్వగమనం చేస్తుండటం గమనార్హం. అత్యంత పరిణతి చెందిన మెదడున్న మానవుడు మాత్రం ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నాడు. అలాంటిది ఇన్ని కోట్ల నక్షత్రాలూ, గ్రహాలూ ఎలాంటి ప్రమాదం జరుగకుండా, నిశ్చింతగా, స్థిరవేగంతో భ్రమణ పరిభ్రమణాలను కొనసాగిస్తున్నాయంటే ఆ అనంతశక్తి నియంత్రణ ఎంతటి సమర్థవంతమో అర్థం చేసుకోవచ్చు.

జీవి జీవనవిధానాన్ని నియంత్రించేందుకు మేధస్సు అనేదొకటి మెదడు రూపంలో ఉందని అనుకున్నాం కదా. మరైతే ఈ గ్రహాలు, నక్షత్రాలను కోటానుకోట్లుగా సృష్టించిన అనంతశక్తి అయిన ఆత్మకు మేధస్సు ఎక్కడ! ఈ గతితప్పని అంతరిక్షం ఇంతటి క్రమశిక్షణను ఎలా కలిగి ఉన్నది? ఏమిటీ సమతుల్యత? వాటిని ‘ఇలా తిరగమని’ చెబుతున్నదేమిటి? ఎక్కడున్న మేధస్సు ఈ అన్నింటినీ నియంత్రిస్తున్నది? అది విశ్వంలో ఎక్కడ ఉన్నట్టు? ఇవన్నీ తేల్చుకోవాల్సిన ప్రశ్నలు. జీవి శారీరక నిర్మాణం సంక్లిష్టమైనకొద్దీ జీవి నియంత్రణ వ్యవస్థ ప్రత్యేకంగా ఏర్పడి ఉంటుంది. అదే జీవి సూక్ష్మమైన కొద్దీ నాడీమండల వ్యవస్థనో లేక జీవి మొత్తంగానో మెదడుగా పనిచేస్తుంది. అనంతమైన శక్తి స్వరూపమే ఆత్మ. దానికి రూపమే లేదు. దాని మేధస్సు దానినిండా వ్యాప్తిచెంది ఉంటుంది. సూక్ష్మాతిసూక్ష్మమై, రూపరహితమై, స్పర్శకు చిక్కని ఆత్మ అంతా జ్ఞానమే. ఈ విశ్వమంతా తనకుతాను ప్రోగ్రాం చేసుకున్న జ్ఞానం. ‘ఈశా వాస్యం’ చెప్పినట్టుగా ఇదంతా ఒకే పూర్ణవ్యవస్థ. కాబట్టి, అంతా ఒక్కటై, ఒక్కటిగానే పనిచేస్తూ ఉంటుంది.

కనుక, జ్ఞానమే ఆత్మ, ఆత్మే జ్ఞానం. ‘ఐతరేయోపనిషత్తు’ ప్రకారం ఈ ఆత్మే బుద్ధిగాను, మనసుగాను ఉంది. ఎరుక, పాలక నైజం, లౌకిక జ్ఞానం, వివేకం, మేధస్సు, అంతర్దృష్టి, స్థిరత్వం, చింతనాశక్తి, మానసిక స్పష్టత, మనస్తాపం, జ్ఞాపకశక్తి, నిశ్చయ బుద్ధి, తీర్మానం, ప్రాణశక్తి, విషయ సుఖవాంఛ అనేవే ఆత్మజ్ఞానంలోని అంశాలు’ అని ఆ ఉపనిషత్తు వివరించింది.

‘సర్వం తత్‌ ప్రజ్ఞా నేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం
ప్రజ్ఞా నేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠా ప్రజ్ఞానం బ్రహ్మ’.

‘ఆ సకలమూ జ్ఞానం నేతృత్వంలోనివి, జ్ఞానమే లోకానికి మార్గనిర్దేశం చేస్తున్నది. జ్ఞానమే ఆధారం’ అంటూ ఆత్మను ‘ప్రజ్ఞానం బ్రహ్మ’గా ఐతరేయోపనిషత్తు ప్రకటించింది. ఐతే, ఈ ఆత్మ మొత్తం బ్రహ్మీస్థితిలో ఉంటుంది. అంటే, బ్రహ్మజ్ఞానంలో నిష్ఠ కలిగి ఉంటుంది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే జ్ఞానం, ఆత్మ రెండూ సమ్మిళితమై ఉంటాయి. ఇది నిత్యం. ఇదే సత్యం!


logo