శనివారం 08 ఆగస్టు 2020
Devotional - May 30, 2020 , 22:56:21

సతీ సావిత్రి సాహసం !

సతీ సావిత్రి సాహసం !

భర్త ప్రాణాల కోసం యముడిని ఎదిరించిన వైనం

‘సావిత్రి’ అంటే ఎవరోకాదు, సాక్షాత్తు ‘పార్వతీదేవి’ అవతారమే. ఏమైనా సరే, ప్రేమించిన వ్యక్తినే భర్తగా పొందడంలోను, మనసులోని తొలివలపు భావనను మించిన నిజమైన పెండ్లిమరేమిటని చాటి చెప్పడంలోను ఉన్నత ఉదాత్త వ్యక్తిత్వాన్ని కనబరిచిన పతివ్రతా శిరోమణి సతీ సావిత్రి. భర్తపట్ల అవ్యాజమైన ప్రేమభక్తికి, ప్రాణాలకు ఎదురొడ్డి యముడంతటి వాడినే ఎదిరించగల సాహసానికి ప్రతీక ఆమె. మహిళలకు సావిత్రీదేవి ఆరాధన ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, గొప్ప ధైర్యాన్ని ప్రసాదిస్తాయని మన శాస్ర్తాలు చెబుతున్నాయి. ‘వటసావిత్రి గౌరీవ్రతం’ మహిమను తెలియజేసే స్ఫూర్తిదాయకమైన ఆ దంపతుల ఇతివృత్తం చదువండి.

ప్రత్యేక వ్యాసం

జూన్‌ 5న వట సావిత్రి గౌరీవ్రతం

సనత్కుమారుడు ఒకసారి ఈశ్వరునితో ‘మహాభాగ్యవంతమైన, వైధవ్యం కలుగకుండా, సౌభాగ్యాన్ని, పుత్రపౌత్రాభివృద్ధిని కలిగి, కులస్త్రీలకు ఆదర్శవంతమైన స్త్రీ గురించి తెలుపాలని’ ప్రార్థించాడు. అప్పుడు ఈశ్వరుడు సతీ సావిత్రి ఇతివృత్తం చెప్పాడు. ‘ధర్మాత్ముడు, జ్ఞాని, పరమ ధార్మికుడు, వీరుడు, వేదవేదాంగ పారంగతుడైన అశ్వపతి అనే రాజు మద్ర దేశాన్ని పాలించేవాడు. కానీ, అతనికి సంతానం కలుగలేదు. సావిత్రిదేవిని గురించి గొప్ప యాగం చేశాడు. ఆమె సంతుష్టయై ‘తానే కూతురుగా జన్మిస్తానని’ వరమిచ్చింది.

కొద్ది కాలానికి అశ్వపతి భార్యకొక పుత్రిక జన్మించింది. సావిత్రిదేవి అనుగ్రహంతో పుట్టిన ఆ శిశువుకు ‘సావిత్రి’ అనే పేరు పెట్టి, అల్లారు ముద్దుగా పెంచసాగారు. రూపలావణ్యంతో దినదిన ప్రవర్ధమానంగా సావిత్రి యుక్తవయస్కురాలైంది. అశ్వపతి తన కుమార్తెతో ‘హృదయాహ్లాదకరుడు, గుణవంతుడు, మనోరంజకుడైన వానిని నీవే స్వయంగా ఏరి కోరుకొమ్మని’ వరాన్వేషణ కోసం సావిత్రిని వృద్ధామాత్యులతో పంపాడు. ఆమె వెళ్లిన కొన్నాళ్లకు త్రిలోకసంచారి నారదమహర్షి రాజు వద్దకు వచ్చాడు. సరిగ్గా అప్పుడే సావిత్రి వృద్ధామాత్యులతో వచ్చింది. ‘నాయనా! రుక్మియనే శత్రువుతో ద్యుమత్సేనుని రాజ్యం అపహరణకు గురైంది. అతడు అంధుడై పత్నీ సహితుడై సత్యవంతుడను పుత్రుని సహాయంతో అడవిలో నివసిస్తున్నాడు. నేను మనస్ఫూర్తిగా ఆ సత్యవంతునే భర్తగా వరించాను’ అంటుంది సావిత్రి. 

అది విన్న నారదుడు అసలు విషయం చెప్పాడు. ‘ఆ తల్లిదండ్రులిద్దరూ సత్యభాషులు. వారి కుమారుడు సత్యవంతుడు. కానీ, అసలు వాస్తవం తెలియక కీర్తివంతుడని విని నీ కూతురు కష్టాలను కొని తెచ్చుకొంటున్నది. వివాహమైన సంవత్సర కాలంలో అతడు మరణిస్తాడు’. తండ్రి భయంతో ‘అమ్మా! పూర్ణాయుష్కుడైన మరెవరినైనా వరించు’ అని ప్రాధేయపడ్తాడు. కానీ, ఆమె ససేమిరా వినలేదు. రాజు చేసేది లేక అంగరంగ వైభవంగా వారికి వివాహం చేసి పంపిస్తాడు. ప్రతి రోజు సత్యవంతుడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి తల్లికి ఇచ్చేవాడు. వృక్షమూలంలో కుటీరం వేసుకొని కాలం గడుపసాగారు. ఇలా సంవత్సర కాలం కావచ్చింది. ఒకనాడు సావిత్రి ‘నాకు అడవిలో నీతో తిరుగాలని ఉంది. నేనూ నీ వెంట వస్తానని’ పట్టుబట్టి వెళ్లింది. కట్టెలు కొడ్తున్న సత్యవంతుడు గొడ్డలి పడేసి తలనొప్పి భరించలేక పడిపోయాడు. సావిత్రి తన తొడమీద అతని తల పెట్టుకొని నిమురసాగింది. 

ఆమె సంవత్సర కాలం నుండి వటవృక్షాన్ని పూజిస్తూ, ఒంటిపూట భోజనంతో కఠిన దీక్షలో ఉన్నది. తన భర్తకు మరణ కాలం ఆసన్నమైందని ఆమెకు అర్థమైంది. అప్పుడే నల్లని పురుషుడొకడు రావడం చూసింది. ‘నీవెవరు?’ అడిగింది సావిత్రి. ‘లోకభయంకరుడైన యముడను. అల్పాయుష్కుడైన నీ భర్తను తీసుకెళ్లడానికి వచ్చాను’ అన్నాడు. సావిత్రి అతనితో, ‘నీకు దూతలుంటారని విన్నాను. శతాయుష్కులను వారు తీసుకొని వెళతారు. స్వయంగా మీరే వచ్చారు ఎందుకు స్వామీ?’ అనడిగింది. ‘ఈతడు ధర్మసహితుడు, సత్యవంతుడు, గుణసముద్రుడు. ఇలాంటి వానిని నా భటులు తీసుకొని రావడం సముచితం కాదని నేనే వచ్చాను’ అని, సత్యవంతుని శరీరం నుండి అంగుష్టమాత్రుడైన పురుషుని పాశంతో బంధించి దక్షిణాభిముఖంగా బయల్దేరాడు. సావిత్రి దుఃఖాన్ని గొంతులోనే దాచుకొని, ‘ఎలాగైనా భర్తను కాపాడుకోవాలన్న’ తపనతో వదలకుండా ఆయన్నే వెంబడించింది. 

‘నా వెంట ఎందుకొస్తున్నావు? మరలి వెళ్లి పిండప్రదానాది కర్మలు ఆచరించు’మంటాడు యముడు. ఆమె వినకపోయేసరికి, ‘ఇక్కడినుండి దారి కారడవి. కంటికి కానరాని భయంకర చీకటి మార్గం. తక్షణం ఆగిపొమ్మ’ంటాడు. ‘తన ప్రాణాలు పోయినా ఫరవాలేదు. భర్త లేకుండా వెనుతిరిగేది లేదనే’ సావిత్రి మళ్లీ వెంబడిస్తుంది. ఆమె పట్టుదలకు, పాతివ్రత్యానికి మెచ్చిన యముడు ‘మూడు వరాలిస్తా, అదీ భర్త ప్రాణం తప్ప! వెనక్కి వెళ్ల’మంటాడు. మొదటి వరంగా ‘అంధులైన అత్తామామలకు కళ్లు ప్రసాదించు’మని, రెండవ వరంగా ‘పుత్ర సంతానం లేని తన తల్లిదండ్రులకు పుత్రభిక్ష పెట్టమని’ కోరుతుంది. ‘సరే’ అంటాడు యుమడు. ముచ్చటగా మూడవ వరంగా ‘నాకు సంతానప్రాప్తి కలిగేట్టు దీవించ’మంటుంది. యముడు మరేమీ ఆలోచించక ‘తథాస్తు’ అంటాడు. ఇంకేముంది, ‘భూలోకంలో భర్త లేకుండా సంతానవతిని ఎట్లా అవుతానని’ యమధర్మరాజునే సావిత్రి ఎదురు ప్రశ్నిస్తుంది. యముడాశ్చర్య పోతాడు. ఆమె పతిభక్తికి మెచ్చి సత్యవంతుని పునరుజ్జీవుణ్ణి చేస్తాడు. ఇదీ సనత్కుమారునికి ఈశ్వరుడు చెప్పిన మహాసాధ్వి సావిత్రి వృత్తాంతం.

సావిత్య్రై నమః

వట సావిత్రీ వ్రతాన్ని ప్రత్యేకించి జ్యేష్ఠశుద్ధ పున్నమి నాడు వివాహమైన స్త్రీలేకాక కన్యలు కూడా నోచుకోవచ్చు. కుజాది దోషాలు, గ్రహపీడలున్న వారికి ‘వైధవ్య దోషం’ తొలగి, సౌభాగ్యం, సంతానం కలుగుతాయని పరమేశ్వరుడు సనత్కుమారునికి వివరించినట్లు కథనం. ఈ వ్రతం చేసేవారు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి, పట్టు (నూతన) వస్ర్తాలు ధరించి, శుభ్రమైన ప్రదేశంలోని మర్రిచెట్టు దగ్గరకు వెళ్లాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, పండ్లు, తాంబూలం, దక్షిణ, పంచామృతం, వస్త్రం, ధూపం, దీపం మొదలైన పూజా సామగ్రి, ద్రవ్యాలతో పౌరోహితుడి సహితంగా పూజ చేయాలి. చెట్టుకు చెంబులోని నీళ్లు చల్లి, తెల్లని దారాన్ని దానికి చుట్టి, చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. 

వట మూలే స్థితో బ్రహ్మా వట మధ్యే జనార్దనః

వటాగ్రేతు శివం వింద్యాత్‌ సావిత్రీ వట సంయుతా

వటం సించామి తేమూలం- సలిలై రమృతోసమైః

సూత్రేణ వేష్టయే ద్భక్త్యా గంధపుష్పాక్షతైన్ముభైః

నమో వటసావిత్రీభ్యాం భ్రామయంతీం ప్రదక్షిణాం

సావిత్రీంచ వటం సమ్య గేభి మర్మంత్రైః ప్రపూజితయే ॥

సువాసినులకు దక్షిణ తాంబూలాదులతోపాటు మంగళసూత్రాలు, నల్లపూసలు, మట్టెలు, అద్దం, దువ్వెన, కాటుక, గాజులు, పూలు, పండ్లు, రవికె బట్టలు వీలైతే 16 మందికి దానం ఇవ్వాలి. మర్నాటి తెల్లవారి దంపతులకు భోజనం పెట్టాలి. నాన పెట్టిన శనగలు అందరికీ పంచాలి. చెట్టు దగ్గర వ్రతం చేయించిన పూజారికి పండ్లు, వస్ర్తాలు, దక్షిణ, తాంబూలాలు ఇచ్చి నమస్కరించి, ఆశీర్వాదం తీసుకోవాలి. 16 సంవత్సరాల తరువాత సావిత్రీ సత్యవంతుల విగ్రహాలు, వెదురు బుట్ట, వెండి గొడ్డలి (చిన్నది), గోధుమలు, బియ్యం, శనగలు బ్రాహ్మణునికి సదక్షిణా పూర్వకంగా దానమివ్వాలి. ఈ వ్రతం ఉభయ వంశాలను ఉద్ధరించటమేకాక ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని ఇస్తుందన్నది శాస్త్రవచనం.
logo