శనివారం 08 ఆగస్టు 2020
Devotional - May 30, 2020 , 22:41:32

రామపాలన లోకానికే ఆదర్శం!

రామపాలన లోకానికే ఆదర్శం!

‘రమంతే యోగినః అస్మిన్నితి రామః’. సుజనులను రమింపజేసే శక్తి రామునిలో ఉన్నది. దశావతారాలలో రామావతారానికి ఉన్న ప్రత్యేకత ఎంతో గొప్పది. రామునిది పూర్ణావతారం. ధర్మం దారిలోనే నడుస్తూ సమస్త మానవాళికీ మార్గదర్శకుడైనాడు. అందుకే, ఒక్కమాటలో ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అన్నారు. రాముడే ధర్మం, ధర్మమే రాముడు! ధర్మాన్ని పరిరక్షించి, సమస్త భూ మండలాన్ని పరవశింపజేసిన ఘనుడాయన.

రాముడిని ‘కౌసల్యానంద వర్ధనః’ అన్నారు. కౌసల్యా దేవికి పుత్రానందాన్ని కలిగించినవాడు. తండ్రి దశరథుని మాట నిలబెట్టడానికి 14 సంవత్సరాలు కారడవులలో తిరిగి, రాక్షస నిర్మూలనంతో శిష్టరక్షణ చేశాడు. రాముడు పెద్ద కుమారునిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. భార్యా సమేతుడై, అడవికి బయలుదేరిన వేళ లక్ష్మణస్వామి అన్నా వదినలను వెన్నంటి వచ్చాడు. అప్పుడు లక్ష్మణ కుమారునకు ఆయన తల్లి సుమిత్ర చెప్పిన ఒక గొప్పమాట- ‘లక్ష్మణ కుమారా! నీ అన్నను తండ్రిలా భావించు, మహావిష్ణువుగా స్మరించు. వదినమ్మను నన్నుగా భావించు, లక్ష్మీదేవిగా ధ్యానించు. అడవే అయోధ్యగా విశ్వసించి నడుచుకో. తండ్రీ.. నీకు శుభమగుగాక’. ఇదీ ఆ తల్లి దీవించి పంపిన పద్ధతి.

రామాయణం కుటుంబ విలువలకు, సామాజిక ధర్మానికి ఒక తిరుగులేని ఆలంబన. నలుగురు అన్నదమ్ములతో సహా ఇతరేతర పాత్రలన్నీ నేటి మానవ మనుగడకు మార్గదర్శకాలే. కిష్కింధలో కాలిడిన రామలక్ష్మణులను వానరులు చూస్తారు. భార్యా వియోగ వేదనతో కుమిలిపోతున్న రాముడితోపాటు ఓదారుస్తున్న తమ్ముడు లక్ష్మణస్వామి కనిపించారు. ‘స్వాములూ! విమానం నుంచి కిందపడిన ఆభరణాల మూట మాకు లభించింది. అవి మీ సీతాదేవియేనేమో.. గుర్తు పట్టగలరేమో చూడండి’ అని ఆ దానిని వారి ముందుంచి, ముడి విప్పారు వానరులు. ఆ సమయంలో రామునకు ఏమీ తోచక, ‘తమ్ముడా లక్ష్మణా! నీకేమైనా నీ వదిన నగలుగా ఇవి గుర్తుకువస్తున్నవా?’ అన్నపుడు, లక్ష్మణుడు ఇలా అంటాడు. ‘అన్నా! నాకు ఆ కేయూరాలు, కుండలాలను గురించి తెలియదు. నిత్యం ఆమె పాదాలకు నమస్కరిస్తాను కనుక, ఈ అందెలు మాత్రం మా వదినమ్మవే’. వదినను మాతృమూర్తిగా భావించిన ఉత్కృష్టమైన సంస్కృతి ఇది.

సీతారాముల తనువులు వేరైనా మనసులు ఒక్కటే. కనుకే, వారు జగానికే ఆదర్శదంపతులైనారు. ‘రామో విరాజతే రామో భూమండల మపాలయత్‌'. రాముడు సమస్త భూమండలాన్నీ పరిపాలించాడు. ఆయన ధర్మ పరిపాలన వల్ల నాడు మేఘాలు సకాలంలో వర్షాలు కురిపించాయి.

పులకించిపోయిన భూ మాత ప్రజలకు సస్య సంపదలను సమృద్ధిగా ప్రసాదించింది. అప్పటి ప్రజలకు వృద్ధాప్య, మృత్యుభయాలు లేవు. స్త్రీలకు వైధవ్యం రాలేదు. నిత్య సువాసినులుగా విలసిల్లేవారు. తల్లిదండ్రులకు పుత్రశోకమే లేదు. 11,000 సంవత్సరాల పాటు ఒక కల్పవృక్షం నీడలో ప్రజలంతా సకలసుఖాలూ అనుభవించారు. ‘ఇది స్వర్ణలంకగు మదరావణుల్లేని/ వైభీషణాకృత పాలనగుచొ/ ఇదియు కిష్కింధగు రొదవాలి లేనట్టి/ సుగ్రీవ సామ్రాజ్య సూచనగుచొ/ ఇదియు నయోధ్యగు సొదమందరల్లేని/ భ్రాతృ వాత్సల్య సంబంధమగుచొ/ పదకొండు వేల సంవత్సరాల్‌ పాలించు/ ప్రజలకు సుఖసౌఖ్య భాగ్యమొసగు/ అన్నలందరు తండ్రులై యలరినపుడు/ తమ్ములందరు తనయులై తనరగలరు/ హనుమ సద్బుద్ధి మనలోన నావరించ/ రామరాజ్యము వసుధలో రంజిలునొకొ’. యుగయుగాలుగా ఎల్లజగాలు ప్రశంసించే రామరాజ్య గొప్పతనాన్ని, రామనామ మహిమను పైన చెప్పిన ధర్మ లక్షణాలు అద్భుతంగా చాటిచెప్పాయి. వాటిని నేటి సమాజం తు.చ. తప్పకుండా పాటిస్తే నిజంగా రాముని అనుగ్రహం వల్ల రామరాజ్యం ఆవిర్భవిస్తుంది.

‘చరితం రఘనాథస్య శతకోటి ప్రవిస్తరం/ ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం’. శతకోటి ప్రవిస్తరం రామచరిత. అందులోని ఒక అక్షరం పఠించినా సరే, వారి పాతక మహా పాతకాలన్నీ తొలిగిపోయి శుభ పరిణామాలు కలుగుతాయన్నది శాస్త్ర వచనం. దైవచింతనతో రామనామ స్మరణ చేయడమన్నది ధర్మ పరిరక్షణలో భాగమే. మానవాళికి ధర్మమే మూలం. ధర్మం వల్లే సుఖం, ధనం లభిస్తాయి. ఈ జగత్తులో ధర్మమే సారభూతమైంది. అందుకే, ఆ రామున్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఆయురారోగ్య భోగభాగ్యాలను పొందుదాం. సకల వ్యాధిరహిత జీవనం గడుపుదాం.


logo