బుధవారం 08 జూలై 2020
Devotional - May 29, 2020 , 23:08:16

ప్రకృతిని ఎందుకు ఆరాధించాలి?

ప్రకృతిని ఎందుకు ఆరాధించాలి?

‘అనాది నిధనే, చండీ, భుక్తి ముక్తి ప్రదేశివే’. సర్వ బ్రహ్మాండంలోని సృష్టి, స్థితి, లయ కారణమైన ఆ జగదాంబ సృష్టి చేసేటప్పుడు శ్రీదేవి, స్థితి చేసేటప్పుడు మహారాజ్ఞి, లయ చేసేటప్పుడు శ్రీ సింహాసనేశ్వరిగా పిలువబడే శివశక్తి. జగతి నిర్వహణ వేళ సృష్టికి అతీతంగా ప్రపంచం మీద ప్రసరింపజేసే ఆ శక్తి పేరే ప్రకృతి. ఏకరూపమైన ఆ శక్తి అనేక రూపాలుగా మారినప్పుడు అదే ప్రకృతి.

‘ప్రకృష్ట వాచకః ప్రశ్చకృతిశ్చ సృష్టివాచకః

స్పష్టౌ ప్రకృష్టాయా దేవీ ప్రకృతిఃసా ప్రకీర్తితా’॥

‘ప్రకృతి’ అనే పదంలో ‘కృతి’ అంటే చేయబడిందని అర్థం. ‘ప్ర’ అంటే ‘ప్రథమం, ప్రధానం, ప్రకృష్టం’ అనే మూడు అర్థాలు. ‘ప్రథమమైంది’ అంటే మొదటిది. ‘ప్రధానమైంది’ అంటే ముఖ్యమైంది. ‘ప్రకృష్టమైంది’ అంటే గొప్పనైంది. ఇక్కడ ‘కృతి’ అంటే సృష్టి. ఆ సృష్టికి ప్రథమం, ప్రధానం, ప్రకృష్టం ఆ జగన్మాతయే. ప్రకృతి స్వరూపిణి సృష్టి ఆరంభంలో తననుతాను రెండుగా విభజించుకున్నది. కుడిభాగం పురుషుడిగా, ఎడమభాగం స్త్రీగా రూపుదాల్చింది. అందుకే, యోగీంద్రుల దృష్టిలో స్త్రీ పురుష భేదం ఉండదు. అంతా పరాశక్తి మయమే.

ఆకాశం, దిక్కులు ఎలాగో ప్రకృతి కూడా అలాగే. అది శివలీల. సనాతనం. పద్మానికి శోభ, దీపానికి కాంతి విడదీయలేనట్టు ‘శక్తి-ప్రకృతి’ కూడా విడదీయలేనివి. బంగారం లేనిదే కంసాలి ఆభరణాలు చేయలేడు. మట్టి లేకుండా కుమ్మరి కుండలు చేయలేడు. అదేవిధంగా ప్రకృతి లేనిదే శక్తి సృష్టి చేయలేదు. ‘శక్తి’ అనే పదంలో ‘శ’ అంటే ‘ఈశ్వరత్వం’. ‘క్తి’ అంటే విస్తరింపజేయడం. భూమిలో గొప్ప శక్తి ఉన్నది. అందుకే, అన్నీ మోయగలగుతుంది. ఆ శక్తి లేకుంటే భూమి పరమాణువును కూడా మోయలేదు. ఆదిశేషుడు, కూర్మం, దిక్కులు.. శక్తి వల్లనే భారాన్ని మోస్తూ ఉన్నాయి.

‘రుద్రహీనం విష్ణుహీనం న వదంతి జనాస్తదా

శక్తి హీనం యథా సర్వే ప్రవదంతి నరాధమం’.

బలహీనమైన వానిని చూసి శక్తిహీనుడంటామే కానీ రుద్రహీనుడు, విష్ణుహీనుడు అని అనం. అందుకే, లోకాలన్నింటినీ నడిపే శక్తి అమ్మవారే. ప్రకృతి అంటే ఎత్తయిన కొండలు, చెట్లు, నదులు, జల ప్రవాహాలు, అడవులు. వీటి సౌందర్యాన్ని చూసినప్పుడు ‘ఎంత బాగున్నాయో’ అంటాడు సామాన్యుడు. ‘వీటిని సృష్టించిన కర్త ఎంత గొప్పవాడో’ అంటాడు భక్తుడు. పండ్లు తింటూ తీయదనాన్ని అనుభవిస్తాం. కానీ, దానిని ప్రసాదించిన వృక్షాన్ని గురించి ఆలోచించం. అందుకే, ప్రకృతిని ఆరాధించడం అంటే అమ్మవారిని ఆరాధించినట్లే.

మనచుట్టూ కనపడే ప్రకృతి మానవుని లోపలి ప్రకృతికి ప్రతీక. ప్రకృతిలో ఉన్నవన్నీ పరస్పర సహాయకారకాలే. ఉదాహరణకు గుట్టలూ, కొండలు వాతావరణ సమతుల్యానికి ఉపకరిస్తూ వాటిమీద పడిన ప్రతీ వర్షపు బొట్టును భూమిపైకి చేర్చి వాగులు, నదుల రూపంలోకి మారుస్తున్నాయి. జంతువులకు, పశుపక్షులకు ఆవాసాన్నిస్తున్నాయి. నదులు తమ నీటితో సమస్త జీవుల ప్రాణాలను నిలుపుతున్నాయి. పెద్దపెద్ద వృక్షాలతో కూడిన అడవులు మబ్బులను ఆకర్షించి సకాలానికి వర్షాలు కురిసేందుకు ఉపకరిస్తున్నాయి. వాటి పచ్చదనంతో ‘కార్బన్‌ డయాక్సైడ్‌'ను తీసుకొని, మిగిలిన ప్రాణుల కోసం ప్రాణవాయువును అందిస్తున్నాయి. ఇలాంటి అడవులను రక్షించేందుకే క్రూరమృగాల సృష్టి జరిగింది.

ఇలా ప్రాణం లేని కొండలు, గుట్టలు, నదులతో పాటు జ్ఞానం లేని వృక్షాలు, జంతువులు, పశుపక్షాదులు అన్నీ మనిషి మనుగడకు తోడ్పడుతుంటే, జ్ఞానం గల మనిషి మాత్రం ‘ఉపకారికి అపకారం’ చేస్తున్నాడు. కొండలు-గుట్టలను తొలిగిస్తూ, అడవులను నిర్మూలిస్తూ, పక్షులకు మనుగడ లేకుండా చేస్తూ, ప్రకృతిని వికృతీకరిస్తున్నాడు. అందువల్ల, చెడు ఫలితాలను అనుభవించవలసి వస్తున్నది. ప్రకృతిలో భాగమైన మనిషికి తన బలాబలాలను చూసుకొని అహంకారంతో దాన్ని శాసించే సామర్థ్యం లేదు. ప్రకృతిని వికృతిగా మారిస్తే దాని పర్యవసానం వినాశనమే. అందుకే, సమస్త ప్రాణి కోటిలో జ్ఞానవంతుడైన మనిషి ప్రకృతిని ఆరాధిస్తూ, ఉపాసన చేస్తూ ప్రకృతిని సురక్షితంగా ఉంచడానికి దోహదపడాలి. లేకుంటే, సృష్టి సంహారకారిణి కన్ను తెరవక తప్పదు.

- వేముగంటి శుక్తిమతి, 99081 10937


logo