శనివారం 11 జూలై 2020
Devotional - May 29, 2020 , 22:17:54

జలపథం.. చండీ సమర్చనం

జలపథం.. చండీ సమర్చనం

‘కలౌ చండీ వినాయకః’ - కలియుగంలో వినాయకుడినీ, చండీదేవినీ ఉపాసిస్తే అనుకున్నది నెరవేరుతుంది. చండీ.. ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తుల మేళవింపు. చండీ అంటే తీవ్రమైన అనే అర్థమూ ఉంది. సంపూర్ణమైన శక్తి ప్రకటనే చండీ! ఆ తీవ్రతే సంపూర్ణ సమగ్ర పరబ్రహ్మ తేజస్సు. తనే ఆదిశక్తి.. సర్వసంపద ప్రదాయిని, సర్వమంగళకారిణి, సర్వరక్షా స్వరూపిణి, సర్వవ్యాధి వినాశిని. చండీని ఉపాసించడం వల్ల జగత్కల్యాణం జరుగుతుంది. మహోగ్రరూపం దాల్చి రాక్షసులను అంతం చేసింది తనే. అమితమైన కరుణామూర్తిగా భక్తులను పాలించిందీ ఆ తల్లే. ఉప్పొంగే నదులుగా భువనాలను సస్యశ్యామలం చేసిందీ ఆమే. చండీ ఆరాధన జరిగిన ఇరవై ఐదు క్రోశుల దూరం వరకూ దుర్బిక్షం ఉండదు. కరువు కాటకాలు తొలగిపోతాయి. దుఃఖం రాదు. ఆ జగన్మాత సకల సంపత్తులనూ అనుగ్రహిస్తుంది. ఆమె చల్లని చూపుతో శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు. వేదమంత్ర పూర్వకంగా చండీ యాగం నిర్వహిస్తూ అమ్మకు హవిస్సును సమర్పిస్తే సకాలంలో వర్షాలు కురుస్తాయి. ప్రజలకు శ్రేయస్సు కలుగుతుంది.

కరువు కాటకాలకు కారణం... నీటి కొరతే. పంచభూతాలలో అతి ప్రధానమైంది నీరే. నీటిని ప్రాణకోటి మనుగడకు జీవనాధారంగా గుర్తించడం వల్లే, పూర్వం నదులను దేవతలుగా ఆరాధించారు. 

పాడిపంటలు సంపదలను ఇస్తాయి. పాడిపంటలకు ఆధారం వర్షం. యజ్ఞం వల్ల వర్షం కరుస్తుంది. చండీ హోమాదుల వల్ల వర్షం కలగడమే కాకుండా శత్రుబాధలూ నశిస్తాయి. రోగాలు, దుఃఖాలు పరిహరింపబడతాయి. మానవ ప్రయత్నానికి  దైవానుగ్రహం అవసరం. మానవ ప్రయత్నంగా తాను చేపట్టిన వివిధ ప్రాజెక్టుల ద్వారా తాగునీటినీ, సాగునీటినీ రాష్ట్ర ప్రజలకు అందించే సంకల్పంలో దైవానుగ్రహం కోసం ముఖ్యమంత్రి ఎన్నో చండీయాగాలు నిర్వహించడం చూస్తున్నాం.

భగీరథుడు గంగావతరణానికి శ్రమించాడు. మన ముఖ్యమంత్రి కూడా ఆ మార్గంలోనే జలవనరుల సమీకరణకై అహరహం శ్రమిస్తున్నారు. ఇదంతా అమ్మవారిని నీటి రూపంలో ఆరాధించడమే. జీవనాధారమైన నీరు వృథాగా సముద్రాలలో కలవకుండా ఒక చోట నిలువ చేయడం అంటే, అమితమైన ఆధ్యాత్మిక శక్తిని కేంద్రీకృతం చేసి సద్వినియోగం చేసుకోవడమే. ఆది శక్తియే చండీ. ఆ శక్తిని యజ్ఞరూపంలో ఆరాధిస్తూ ఒక చోట నిలిపి ప్రజల అవసరాలకు వినియోగించడం పాలకుని ప్రథమ బాధ్యత. అదే యజ్ఞ నిర్వహణ. ‘అగ్ని ముఖైవా దేవా’ అంటే దేవతలకు అగ్నిముఖంగా హవిస్సులు సమర్పించాలి. మంత్రాత్మకంగా స్వాహా అంటూ మనం సమర్పించే హవిస్సును స్వాహా దేవత గ్రహించి, ఏ దేవతను ఉద్దేశించి సమర్పిస్తున్నామో ఆ దేవతకు అవసరమైన పరిమాణంలో అందిస్తుంది. ప్రకృతి వినాశనానికి రాక్షసులు ప్రయత్నించిన ప్రతిసారీ... ఆదిశక్తి వివిధ రూపాలలో అసురులను సంహరించింది. అలాంటి అసాంఘిక శక్తులను సమర్థంగా అణచివేస్తూ.. ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా జలాశయాలను పెంచుకుంటూ, వ్యవసాయ విద్యుత్‌ రంగాల అభివృద్ధి ద్వారా ప్రజల జీవనస్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి కంకణబద్ధులై ఉన్నారు. ఆశయ సిద్ధి కోసం పాలకుడు నిర్వహించే హోమాదులచే తృప్తయై ఆ  పరమేశ్వరి వారిని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ...

-పాలకుర్తి రామమూర్తి, 94416 66943


logo