మంగళవారం 07 జూలై 2020
Devotional - May 29, 2020 , 22:17:49

సుజలాలకు.. సుదర్శనయాగం

సుజలాలకు.. సుదర్శనయాగం

శ్రీ సుదర్శన చక్రం.. మహావిష్ణువు పంచాయుధాలలో ప్రధానమైంది. సుదర్శనుడు స్వామిభక్త పరాయణుడు. రామావతారంలో కోదండంగా, నృసింహావతారంలో గోళ్లుగా, వరాహావతారంలో కోరలుగా.. కృష్ణావతారంలో తన రూపంలోనే చక్రాయుధంగా దర్శనమిచ్చాడు. దుష్టశిక్షణలో, సాధు సజ్జన సంరక్షణలో, భక్తులు కోరిన వరాలనివ్వడంలో, పాడిపంటలను అనుగ్రహించడంలో సుదర్శనుడు శ్రీహరికి అండగా ఉంటాడు.

మేఘాలు ఏర్పడటంలో ప్రచండభానుడి వాడివేడి కిరణాల సహకారం ఎంతగానో ఉంటుంది. అలాగే ‘సుదర్శనం భాస్కరకోటితుల్యం’ అన్నట్టు, కోటి సూర్యులకు సమానమైన తేజంతో విరాజిల్లే సుదర్శనస్వామి అనుగ్రహం వర్షాలు కురిసి, జలాశయాన్నీ జలకళతో ప్రకాశించేట్టు చేస్తుంది. సకాలంలో వర్షాలు పడేందుకు, నదులలో చెరువులలో జలసమృద్ధి ఏర్పడేందుకు, పంటలు బాగా పండేందుకు, పండిన పంటలకు నష్టం వాటిల్లకుండా... నిత్య కృషీవలుడైన రైతన్నకు ధాన్యరాశులూ ధనరాశులూ అందేందుకూ స్వామి చల్లనిచూపు ఉండాలని పెద్దల నమ్మకం. వ్యవసాయదారులకు అతివృష్టి, అనావృష్టి, అప్పుల బాధ, శత్రు బాధ, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు, అన్నదాతలు ఆరోగ్యవంతులై దీర్ఘాయుష్మంతులై జీవించేందుకు  సుదర్శనుని అనుగ్రహం చాలా అవసరమని ప్రాచీన గ్రంథాలు ఘోషిస్తున్నాయి.

అజ్ఞానాన్ని, సందేహాలను, నిరాశానిస్పృహలను తొలగించి.. స్థిరమైన, శాశ్వతమైన జ్ఞానసంపదను, ఆరోగ్య భాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, దీర్ఘాయుష్షును... సుదర్శనుడు అనుగ్రహిస్తాడని..

‘ఆరోగ్యం భూతిమాయుః కృతమిహబహునా యద్యదాస్థా పదం వః

తత్తత్సద్యః సమస్తం దిశతు సపురుషో దివ్యహేత్యక్షవర్తీ॥’ 

...అనే సూక్తిరత్నం వెల్లడిస్తున్నది. సుదర్శన స్వామిని స్తుతించడం, అర్చించడం, ధ్యానించడం యాగప్రక్రియలో ఆరాధించడం ..అనే వివిధ పద్ధతులు ఉన్నా, అన్నింటిలోకెల్లా యాగరూపంలో ఆరాధించే విధానమే సర్వశ్రేష్ఠమైందని పాంచరాత్ర ఆగమశాస్త్రం తెలుపుతున్నది.

“సువృష్టిః చేత్‌ సుభిక్షం స్యాత్‌” అన్న ప్రకారం మంచి వర్షం పడితేనే పంటలు బాగా పండుతాయనీ, ఆ వర్ష సమృద్ధికి యజ్ఞ-యాగాదుల నిర్వహణ అత్యావశ్యకమనీ పురాణాలు స్పష్టపరుస్తున్నాయి.

పరిపాలకులలో ధార్మిక, ప్రజాహిత భావనలు పెంపొందుటకు, ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించుటకు... ఉపద్రవాలు, ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు లేకుండా ఉండేందుకు... లోకకళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం యజ్ఞయాగాదులను నిర్వహించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. సాగునీటికి, తాగునీటికి ఏ లోటూ లేకుండా, ప్రజలు ఎలాంటి లోటుపాట్లకు ఒడిదుడుకులకు లోను కాకుండా సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి, ‘అన్నపూర్ణ’లాంటి  వ్యవ

సాయ దేశానికి అంతటికీ వెన్నెముకగా నిలిచేందుకు, ప్రాజెక్టులు జలసమృద్ధితో కళకళలాడేందుకు అవసరమైన పరిపూర్ణానుగ్రహాన్ని సుదర్శనస్వామి సమకూరుస్తాడని ‘త్రికరణ

శుద్ధి’తో భక్తి విశ్వాసాలతో ఆశిద్దాం.

-సముద్రాల శఠగోపాచార్యులు, 98483 73067


logo