సోమవారం 13 జూలై 2020
Devotional - May 28, 2020 , 00:16:14

జీవన స్ఫూర్తి వాల్మీకి...

జీవన స్ఫూర్తి వాల్మీకి...

మోటు మనిషినైనా సరే పరివర్తనతో జ్ఞానిగా, మహర్షిగా మార్చవచ్చునని చెప్పటానికి సాక్ష్యం ఆదికవి వాల్మీకి జీవితం. రామాయణంలోని పలు సందర్భాలను గమనిస్తే ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని’ కూడా అర్థమవుతుంది. జీవన పరిణామంలో మత్స్యావతారం దగ్గర్నుంచి బుద్ధావతారం వరకు విష్ణుమూర్తి అవతారాలలో క్రమగతి మార్పు కనిపిస్తుంది. పరశురాముని తర్వాత మానవావతారం శ్రీరాముడు. పురుషోత్తముడిగా సహజమైన మనిషి వికాసాన్ని అందులో మనం దర్శిస్తాం.

సాధారణంగా మార్పులు చోటుచేసుకోవడానికి దోహదపడే వాటిలో ఒకటి: దైవసంకల్పం, రెండవది: గురువుల బోధన. స్పందన రూపంలో స్థిరమైన మార్పు చేయగల శక్తి మానవ హృదయంలో ఉంటుంది. 

గురువులంటే ప్రత్యక్షంగా ఉండనవసరం లేదు. ‘గురుచరిత్ర’, ‘భాగవతం’, ‘పద్మ పురాణం’ ప్రకృతితో పాటు 24 మంది గురువులని చెప్పాయి. వేదాల విభజన, పంచమ వేదం భారతం, అష్టాదశ పురాణాలు రాసిన వ్యాసమహర్షి ఒక వ్యక్తి కాదని, ఓ శక్తి పీఠమని పలు కథనాలు వివరిస్తాయి. అందుకే, 24వ యుగంలో భాగమైన త్రేతాయుగంలో వాల్మీకియే వ్యాసుడని ‘విష్ణు పురాణం’ కథనం. ‘కూర్మ పురాణం’, ‘హరిదర్పణం’ గ్రంథాలు కూడా దీనినే సమర్థిస్తున్నాయి. రామాయణంలోని గొప్పదనాన్ని నరనరాన జీర్ణించుకోవటం వల్లనే భారత భాగవతాల్లోనూ మనకు రామాయణం కనిపిస్తుంది. ‘విష్ణు ధర్మోత్తర కావ్యం’ ప్రకారం మార్కండేయుడు వజ్రుడనే రాజుకు చెప్పినట్లు వాల్మీకి వృద్ధాప్యంలో శ్రీరాముడు రావణ కుంభకర్ణులను వధించాడు. వాల్మీకి తన ఆశ్రమంలో సీతమ్మకు ఆశ్రయమిచ్చాడు. కుశలవులకు రామాయణం నేర్పించి గానం చేయించాడు. రామాయణ గాథలో వాల్మీకి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు చిలకూరు వెంకటేశ్వర్లు గారి ‘వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ వచన సంకలనం’ చెబుతున్నది.

ఆది కవి వాల్మీకి మహర్షి జీవితం గమనిస్తే ఎన్నో పరిణామాలు. జనశ్రుతి గాథ ప్రకారం రత్నాకరుడు అనే బ్రాహ్మణుడు ఉపాధి కోసం కిరాతకులతో స్నేహం చేశాడు. నారద మహర్షి ఎదురై ‘మరా’ అనే మంత్రం ఉపదేశించాడు. అతను నిష్ఠతో సుదీర్ఘకాలం మంత్రజప ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ప్రకృతి సహజ సిద్ధంగానే అతనిచుట్టూ పుట్టలు పెరిగాయి. తిరుగు ప్రయాణంలో నారదుని దృష్టి అతనిపై పడింది. రత్నాకరునిపై జాలి కలిగింది. ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిసేట్టు చేస్తాడు. ఆ రత్నాకరునికి అందుకే ‘వాల్మీకి’ అని పేరు పెట్టాడు.

మరోవైపు ‘స్కాంద పురాణం’ పరిశీలిస్తే, భృగువంశంలో సుమతి అనే బ్రాహ్మణుడు, అతని భార్య కౌశికి సంతానమే అగ్ని శర్మ. దుష్టసాంగత్యంతో దారి దోపిడీని వృత్తిగా చేసుకుంటాడు. ఒకరోజు సప్తఋషులు ఆ దారి వెంట వెళుతుండగా, అగ్నిశర్మ వారిని అడ్డగిస్తాడు. అతని ముఖం చూడగానే ఏదో ‘కొత్త వెలుగు’ అత్రి మహర్షికి కనిస్తుంది. అంతే! అతనిని మార్చాలనుకుంటాడు. ‘మా దగ్గరి వస్తువులు ఇస్తాము, ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని’ అత్రి కోరుతాడు. ‘దోపిడీ, హింస సొమ్ముతో నీ భార్యాపిల్లలను పోషిస్తున్నావు కదా! నీ పాపంలో వారు పాలుపంచుకొంటారో లేదో కనుక్కో’మని పంపిస్తాడు. అగ్ని శర్మ ఇంటికి వెళ్లి, కుటుంబసభ్యులను అడుగుతాడు. ‘మా పోషణ నీ బాధ్యత. నీ పాపం మాకెందుకు?’ అని భార్యాపిల్లలు ఎదురుతిరుగుతారు. దాంతో అతనిలో పరివర్తనకు బీజం పడుతుంది. వైరాగ్యం ఆరంభమవుతుంది. తిరిగి అత్రి ముని దగ్గరికి వచ్చి, విషయం చెప్తాడు.

అత్రి మంచి మాటలతో సహా ‘ధ్యాన మంత్రం’ ఉపదేశిస్తాడు. అగ్నిశర్మ ధ్యానదీక్షలో కూర్చుంటాడు. కొంతకాలం తర్వాత మునులు తిరుగు ప్రయాణంలో ఓ పుట్టలో నుంచి ‘ఓం’ ధ్వని వినిపిస్తుంటుంది. పుట్టను తవ్విస్తారు. ఎముకల గూడులా ఉన్న దేహాన్ని అత్రి మహర్శి స్పర్శిస్తాడు. అంతే! సర్వాంగాలతో దిగ్గున లేచిన అగ్నిశర్మ ఋషులకు నమస్కరిస్తాడు. అప్పటినుండి అతనే ‘వాల్మీకి’ మహర్షిగా గుర్తింపు పొందుతాడన్నది ఈ కథనం. మామూలు మనిషిని వాల్మీకిగా మార్చిన గొప్పతనం అత్రి, నారద మహర్షులదైతే, ఎంతోమంది జీవితాల్లో క్రూరత్వం నశించి, క్రమశిక్షణ, కుటుంబ విలువలతో బతుకటానికి ‘వాల్మీకి రామాయణం’ కారణమవుతున్నది. ‘నానృషి కురుతే కావ్యం’ అన్న శ్లోకం అక్షరాల నిజం.


logo