బుధవారం 12 ఆగస్టు 2020
Devotional - May 26, 2020 , 23:11:41

భరతుని ధర్మ నిరతి

భరతుని ధర్మ నిరతి

రాముడు, భరతుడు చైత్రశుద్ధ నవమి నాడు, కవలలైన లక్ష్మణ-శత్రుఘ్నులు దశమి రోజు జన్మించారు. అందుకేనేమో, లక్ష్మణుడు ఆసాంతం శ్రీ రాముణ్ణి అనుసరిస్తే, శత్రుఘ్నుడు రామాయణం మొత్తంలో భరతునినే అంటిపెట్టుకొని కనిపిస్తాడు. లక్షణంలో శత్రుఘ్నుడు, లక్ష్మణుని అంత ఆవేశం ప్రదర్శించకున్నా రాముని వనవాస వార్త విన్నప్పుడు మాత్రం చాలా తీవ్రంగానే స్పందిస్తాడు. ఇక, భరతుని విషయానికి వస్తే, ధర్మ ప్రదర్శన విషయంలో రామునికి తగ్గ సోదరునిగా ఆద్యంతం తన చిత్తశుద్ధిని, సోదర ప్రేమను, రామభక్తిని ప్రదర్శించి అకుంఠిత నిబద్ధతను చాటుకున్నాడు.

తల్లి కైకేయి దశరథునికి ప్రియమైన భార్య. తనను యువరాజుగా చూడాలని ఉబలాటపడింది. దాని గురించి తండ్రిని మూడు వరాలు తీర్చమని ఒప్పించి, రామునితో ఎలాంటి సమస్య లేకుండా వనవాసానికి పంపించి, తనకు మార్గం సుగమం చేసుకున్నది. తాను ఎక్కువగా మాతామహుల వద్ద గడపడం వల్ల బహుశా కైకను పరిణయమాడే సమయంలో, దశరథుడు ‘ఆమెకు కలిగే సంతానాన్ని యువరాజును చేస్తానన్న వాగ్దానం’ కూడా తాతగారి ద్వారా తెలిసే ఉంటుంది. అయినా, ధర్మబద్ధంగా ‘దశరథ సంతానంలో కేవలం కొన్ని గంటలు ముందు పుట్టి, జ్యేష్ఠుడైన శ్రీ రాముడే అయోధ్యకు యువరాజు, మహారాజు’ అని ఆద్యంతం నమ్ముతాడు. ఈ వ్యక్తిత్వం కారణంగానే భరతుని పాత్ర మనకు ఉన్నతునిగా కనిపిస్తుంది.

తండ్రి మరణవార్త తెలిసి అయోధ్యకు వచ్చిన భరతునికి రాముని వనవాసపు వార్త కూడా తెలుస్తుంది. దానికి కారణమైన తల్లి మీద విపరీతమైన అసహనం ప్రదర్శిస్తాడు. మళ్లీ వెంటనే ‘తనకు రాజ్యకాంక్ష లేదని, ఆ అధికారం, అర్హత రామునిదేనని’ సపరివారంగా వెళ్లి శ్రీ రాముని ఒప్పించి వెనక్కి తీసురావడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. చివరికి రాముని పాదుకలకు పట్టాభిషేకం జరిపించి, తాను సేవకునిగా రాజ్యభారాన్ని మోయడానికి అంగీకరిస్తాడు. ‘సరిగ్గా పధ్నాలుగేండ్లు దాటి ఒక్కరోజు కూడా శ్రీరాముడి రాక ఆలస్యమైతే తాను భరించలేననీ ఆత్మాహుతి జరువుకుంటానని’ ప్రతిజ్ఞ చేస్తాడు. నందిగ్రామంలో బ్రహ్మచర్య దీక్షబూని, అక్కడి నుంచి పరిపాలన సాగించిన ధర్మశీలుడు భరతుడు.

తండ్రి మరణానంతరం, పెద తల్లి కౌసల్యను చూడపోయినప్పుడు, దుఃఖంలో పరుష వాక్యాలతో నిందించునట్లు మాట్లాడినప్పుడు కూడా ‘తనకు రాజ్య కాంక్ష లేదని, రాముని వనవాసం వంటి దుర్బుద్ధి తనకు లేదనీ’ చెప్పాడు. ‘ఒకవేళ అటువంటి దురుద్దేశమే ఉంటే తాను ఎన్నిరకాల పాపాలున్నవో, అన్ని పాపాల బారిన పడి శిక్షను అనుభవిస్తానని’ శపథం చేయడం కూడా భరతుని త్యాగనిరతిని, ధర్మం పట్ల ఉన్న అభినివేశాన్ని తెలియచేస్తుంది.

ఇంత జరిగినా రావణవధ అనంతరం వనవాసం ముగిసిన తర్వాత, ‘భరతుడు రాజ్యం అప్పగించే స్థితిలోనే ఉన్నాడా? లేదా’ అని తెలుసుకుని రమ్మని హనుమంతుని మారువేషంలో పంపిస్తాడు రాముడు. రాముని రాక చివరిరోజు వరకు తెలియక ఆత్మాహుతికి సిద్ధపడుతూ కనిపిస్తాడు భరతుడు. అటు పిమ్మట రామునికి రాజ్యాన్ని అప్పగించే సమయంలో, తాను రాజ్య బాధ్యత తీసుకున్నా అప్పటికి జరిగిన రాజ్య విస్తరణ, సంపదల పెంపు, ప్రజల జీవనంలో పెరిగిన ప్రమాణాలు అన్నీ ఒక్కొక్కటిగా లెక్క చెప్పి మరీ రాజ్యాన్ని అప్పగించి తన రామభక్తిని, ధర్మం పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి ప్రదర్శిస్తాడు.

ఇంతటి ఉత్తమమైన, శ్రీరామునికి అత్యంత ప్రియమైన సోదరుడిగా భరతుడి పాత్ర వాల్మీకి మహర్షి రమణీయంగానే చిత్రీకరించినా, ధర్మం విషయంలో రామునికి ప్రతిరూపంగా నిలిచి రాజ్యభారంలో మునిగిన భరతుని కన్నా, నిత్యం రామ సన్నిధిలో ఉన్న లక్ష్మణుని గురించి తెలిసినంతగా మనకు భరతుని పాత్ర గుర్తుండకపోవడం కేవలం యాదృచ్ఛికమే.


logo