శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Devotional - May 25, 2020 , 22:50:58

తం బుధం ప్రణమామ్యహమ్‌!

తం బుధం ప్రణమామ్యహమ్‌!

మూర్తీభవించిన జ్ఞానం వలె ముదురాకుపచ్చ వర్ణంలో కేసరిమొగ్గ వలె ప్రకాశిస్తూ ఉంటాడు బుధుడు. బుధునికి ‘సౌమ్యుడ’ని పేరు. ‘సౌమ్యుడ’ంటే సాధుస్వభావి, మంచివాడని అర్థం. లోకవ్యవహారంలో ‘మంచివాడు’ అన్న పదం రెండర్థాలలో వాడుతుంటారు. ఒకటి: అతనిది మంచి హృదయం. అందరిపట్ల సద్భావన కలిగి ఉంటా డు. అందరికీ మంచి చేస్తాడు. రెండు: తన మంచితనం కారణంగా అందరినీ గుడ్డిగా నమ్ముతాడు. మంచిచెడుల మధ్య తారతమ్యాలను సరిగ్గా గుర్తింపలేక దెబ్బ తింటాడు. ‘మంచివాడు’ అన్న పదంలోని శ్లేష బుధునిపట్ల నిత్యమే. చంద్రునికి ‘సోముడు’ అని పేరు. సోముని కుమారుడు కనుక బుధుడు సౌమ్యుడైనాడు. బుధుని పుట్టుకను గురించి ఆసక్తికరమైన పురాణగాథ ఒకటున్నది.

దేవతల గురువైన బృహస్పతి గురుకులంలో చంద్రుడు చదువుకున్నాడు. అప్పటి పద్ధతిలో ఐదునుండి ఎనిమిదేండ్ల మధ్యవయస్సులో గురుకులంలో చేరిన బాలురు నవయవ్వనులై ఇరవై ఒకటినుంచి ఇరవై నాలుగేండ్ల మధ్య విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేవారు. విద్యైక విషయాలను గురువు చూసుకొంటే, పిల్లల ఆలనాపాలనలను గురుపత్ని చూసుకొనేది. ఈ కారణంగా గురుపత్నికి శిష్యులకు మధ్య సాన్నిహిత్యముండేది. ఇది చంద్రుని పతనానికి హేతువైంది. గురుపత్ని తారకు, శిష్యుడైన చంద్రునికి మధ్య అవాంఛనీయ సంబంధం ఏర్పడింది. దాంతో తార గర్భవతి అయి, బుధునికి జన్మనిచ్చింది. తార నడవడి దేవలోకంలో చర్చనీయాంశమైంది. 

చంద్రుడు ఆమెను ‘తీసుకెళ్లి వివాహమాడతా’నన్నాడు. భార్య తప్పులో భర్తకుకూడా బాధ్యత వుంటుంది కనుక తానుకూడా దోషినేనని చెబుతూ, బృహస్పతి తారను తనతోనే వుండమన్నాడు. తార అందుకు ఒప్పుకొంది. ఇప్పుడు శిశువు గురించిన జగడం మొదలైంది. ‘బుధుడు నా కొడుకంటే, నా కొడుకంటూ’ చంద్రుడు, బృహస్పతి గొడవ పడ్డారు. మధ్యవర్తిగా వచ్చిన బ్రహ్మదేవుడు విషయాన్ని ఎటూ తేల్చలేక ‘బుధుడు ఎవరి కుమారుడో తారనే చెప్ప’మన్నాడు. తార సిగ్గుపడుతూ ‘చంద్రుని కారణంగానే తాను గర్భవతినైనానని’ చెప్పింది. విషయం తేలిపోవడంతో చంద్రుడు కొడుకును తనతోపాటు తీసుకెళ్లాడు. చంద్రుని భార్య రోహిణి ఆ శిశువును పెంచింది. పెరిగి పెద్దయిన బుధుడు సూర్యుని కొలువులో కుదురుకొన్నాడు.

క్లిష్టమైన శాస్త్రీయాంశాలను మానవ సంబంధ గాథలుగా మలచి రుచికరంగా చెప్పడం మన ఋషులకు వెన్నతో పెట్టిన విద్య. సూర్యాస్తమయమైన మూడు గంటలలోపు నైఋతి దిశ ఆకాశంలో ఒక సుందరమైన దృశ్యం కనిపిస్తుంది. ఇది సంవత్సర కాలంలో మూడు, నాలుగు నెలలపాటు మాత్రమే కనిపిస్తుంది. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. బారెడు దూరంలో బృహస్పతి వెలుగుతుంటాడు. ఈ ఇద్దరి మధ్యలో, ఇరువురి వెలుగులకు దీటైన ప్రకాశంతో ఒక నక్షత్రం దర్శనమిస్తుంది. అది గురు చంద్రులకు సమాన దూరంలో కొంతకాలం, చంద్రునికి దగ్గరగా మరికొంత కాలం, బృహస్పతికి సమీపంగా ఇంకొంత కాలం కనిపిస్తుంది. ఈ నక్షత్రాన్నే ‘తార’ అన్నారు మనవాళ్లు.

ఆ ‘తార’కు చెందిన శకలం ఒకటి సౌరమండలంలోకి చొచ్చుకు వచ్చింది. అది సౌరకుటుంబంలో భాగమై, తనకంటూ ఒక కక్ష్యను ఏర్పరచుకొని సూర్యుని చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. తారనుండి వచ్చిన నక్షత్ర శకలం ‘బృహస్పతి కారణంగా సౌరకుటుంబంలో భాగమైందా? లేక చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది సంభవించిందా?’ అన్న చర్చకు పరిష్కారాన్ని సూచించాడు బ్రహ్మదేవుడు. సూర్యుడు ఒక నక్షత్రం. ప్రతి నక్షత్రమూ తన చుట్టూ తాను అమితవేగంతో తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగేటప్పుడు ఏర్పడిన మధ్యస్థల అపకేంద్ర (Centrifugal) శక్తి కారణంగా నక్షత్ర శకలాలు దూరంగా వెళ్లి పడి, చల్లబడి గ్రహాలుగా మారి, నక్షత్రాల చుట్టూ తిరుగుతుంటవి. మన సౌరకుటుంబం కూడా ఈ పద్ధతిలోనే ఏర్పడింది.

ఇటీవలి కాలంలో బుధుడు (Mercury) సూర్యశకలం కాదని, మరొక నక్షత్ర మండలానికి చెందిన వాడని ‘నాసా’ (అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ) వారు ప్రకటించిన దరిమిలా, బుధ జననానికి సంబంధించిన గాథను స్మరించుకొని, ఆ మహానుభావునికి నమస్కరించడం సముచితమే కదా. 

‘ప్రియంకు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్‌’.


logo