సోమవారం 10 ఆగస్టు 2020
Devotional - May 24, 2020 , 23:40:08

అవి ప్రాణశక్తి వాహకాలు!

అవి ప్రాణశక్తి వాహకాలు!

ప్రతీచోట ‘చక్రాల’ గురించి విపరీతమైన చర్చ జరుగుతున్నది. ప్రత్యేకంగా పశ్చిమ దేశాలలో, ఎక్కడికి వెళ్లినా, ‘మీ ఏడు చక్రాలను తిన్నగా అమర్చుతాం’ అంటూ చక్రాల తీరును సవరించే కేంద్రాలు తయారయ్యాయి. ఈ రోజుల్లో యోగ విద్యాలయాల నుండి నాడీ శాస్త్రకారుల వరకు వాటి గురించే మాట్లాడుతున్నారు. అది ఒక వేలంవెర్రిగా తయారయ్యింది. అయితే, అందరూ కేవలం ఏడు చక్రాల గురించే ప్రస్తావిస్తున్నప్పటికీ మానవ శరీరంలో 114 ఉంటాయి. వీటిని ‘నాడీ కేంద్రాలు’ లేదా ‘కూడళ్లు’గానూ గమనించవచ్చు. ఇవి శరీరంలోని ప్రాణశక్తికి వాహకాలు. 

ఈ నాడీ కేంద్రాలు ఎప్పుడూ త్రిభుజకారంగా ఉంటాయి. చక్రాల్లాగ అంటే గుండ్రని లేదా వృత్తాకారంలో కదులుతున్నట్లుగా, అవి ఒక పరిమాణం నుండి మరొక పరిమాణంలోకి చలనం తీసుకువస్తాయి కాబట్టి, గుండ్రనివైన చక్రాలు కదలికకు ప్రతీక కాబట్టి, వీటిని ‘చక్రాలని’ అంటున్నా వాస్తవానికి అవి త్రిభుజాలు. శరీరంలోని ఏడు ‘పార్శ్వాలు’ లేదా ‘పరిమాణాల’ను ఏడు చక్రాలుగా ప్రస్తావిస్తారు. ఇదే ఏడు విధాలైన యోగాలకు ఆధారమైంది. ఈ 114 చక్రాలలో రెండు చక్రాలు భౌతిక శరీరానికి బయట ఉంటాయి. మిగిలిన 112 చక్రాలలో కేవలం 108 చక్రాలు మాత్రమే సాధనకు అనువుగా ఉంటాయి. మిగిలిన నాలుగు, సాధనకు పర్యవసానంగా వికసిస్తాయి, అంతే. 

సూర్యగ్రహ మండల వ్యవస్థ నిర్మాణంలో ప్రధానమైంది 108 సంఖ్య. కనుక, అదే సంఖ్య మానవ శారీరక నిర్మాణ వ్యవస్థలో ఆవిర్భావమైంది. సూర్యుని వ్యాసానికి, సూర్యునికి భూమికి మధ్య ఉండే దూరం 108 రెట్లు. చంద్రుని వ్యాసానికి, చంద్రునికి భూమికి మధ్య ఉండే దూరం 108 రెట్లు. భూమి వ్యాసానికి సూర్యుని వ్యాసం 108 రెట్లు. అందువల్లనే 108 సంఖ్య పలు రకాలగా ఆధ్యాత్మిక సాధనలలో ప్రాధాన్యాన్ని పొందింది. ఈ 114 చక్రాలలో రెండు చక్రాలు భౌతిక శరీరానికి బయట ఉంటాయి. ఈ 112 చక్రాలను పదహారు అంశాలు కలిగి ఉన్న ఏడు పార్శ్వాలుగా విభాగించవచ్చు. 112 గురించి ప్రస్తావన అనేకమందికి ఎంతో ఎక్కువగా అనిపించవచ్చు. కనుక, అన్నిటి బదులు పరిమాణాలు, వర్గాలనుబట్టి ఏడింటి గురించే మాట్లాడటం సాధారణం. ఈ 7 పార్శ్వాలు లేదా పరిమాణాలను 7 చక్రాలుగా ప్రస్తావిస్తారు. 

ఒక మనిషి భౌతికంగా, సామాజికంగా పూర్తి సామర్థ్యంతో జీవించాలంటే అతని శరీరంలోని 21 చక్రాలు ఉత్తేజితమైతే చాలు. ఈ 21 చక్రాలకు కూడా 7 సంఖ్యతో సంబంధం ఉంటుంది. పింగళ, ఇడ, సుషుమ్న అనే మూడు విధాలైన శక్తులు, ఒక్కొక్క దానిలో మూడేసి చక్రాల సముదాయంగా, ఏడు సముదాయాలుగా క్రియాశీలమవుతాయి. అ విధంగా 21 చక్రాలు భౌతికంగా, మానసికంగా, భావనాత్మకంగా క్రియాశీలమైనప్పుడు మీరు పూర్ణతతో ఉండవచ్చు. కానీ, శక్తి దృష్ట్యా కాదు. ఒకవేళ సరైన జీవన సామర్థ్యానికి ఎదగాలంటే మిగిలిన చక్రాలు ఉత్తేజితం అవ్వాలి. బుద్ధికుశలత శక్తివంతం అవ్వాలి. అలా కాకుండా బుద్ధి నిద్రాణమైతే, అది బుద్ధి అసలు లేకపోవడంతో సమానం. 

వినియోగంలోకి తీసుకురాలేని కంప్యూటర్‌ ఒక రాయి పలకతో సమానం. అలాగే, మానవ శరీర వ్యవస్థ కూడా. ఇది ఒక సూపర్‌ కంప్యూటర్‌, అయినప్పటికీ చాలామంది కేవలం మనుగడ లేదా బతుకు తెరువే ప్రధానంగా దాని క్రియాశీలతను వినియోగిస్తుంటారు. మానవ శారీరక వ్యవస్థకు కలిగిన సమర్థతను వెలికి తీసుకు రావాలంటే, దానిని ఉత్తేజ పరచవలసిన అవసరముంటుంది. ‘హఠయోగం’ అనేది యావత్‌ శారీరక వ్యవస్థను ఉత్తేజితం చేసే ఒక క్రమసాధన. దురదృష్టవశాత్తు కొందరు ‘హఠయోగ’ అంటే ఒక వ్యాయమం లేదా అదో రకమైన ‘ఆరోగ్య నియమం’ అనుకుంటున్నారు. ఎప్పుడైనా సరే యోగా అనేది దేనికీ చికిత్స నిమిత్తం కాదు. శారీరక వ్యవస్థను పూర్తి సామర్ధ్యంతో పనిచేయించడం ఎలా అన్నదే ఇందులో ప్రధానం. అది పూర్తి సామర్థ్యానికి చేరితే అంతా బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది. 


logo