శనివారం 06 జూన్ 2020
Devotional - May 23, 2020 , 23:50:12

దానమే దైవమని..

దానమే దైవమని..

సంక్షేమమే పండుగ సందేశం

కరోనా వచ్చి పడిన ఈ విపత్కర పరిస్థితిలో చాలామంది రంజానుకన్నా ముందే జకాత్‌ చెల్లింపులకు సిద్ధపడటం గమనార్హం. చాలావరకు జకాత్‌ పంపకం వ్యక్తిగత స్థాయిలో జరుగుతుంది. కాబట్టి, నగదు రూపంలో జకాత్‌ ఇస్తున్నారు. మన దేశంలో పేదరికాన్నిపారదోలడానికి జకాత్‌ ఎంతైనా ఉపయోగపడుతున్నది. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జకాత్‌ ఫంపిణీ చాలా భారీస్థాయిలో జరుగుతుంది. 

రంజాను నెల ముగిసిన తర్వాత ఈద్‌ పండుగ జరుపుకొంటాం. ఈసారి రంజాన్‌ మాసం అసాధారణ పరిస్థితుల్లో గడిచింది. కరోనా వైరస్‌ విజృంభించడంతో ఈ నెల్లాళ్లూ ఇండ్లలోనే ఉండవలసి వచ్చింది. అంటువ్యాధి వ్యాపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రవక్త ముహమ్మద్‌ (స) స్పష్టంగా నిర్దేశించారు. ఆధునిక వైద్యమూ తగిన జాగ్రత్తలను సూచించింది. అందువల్ల ‘తరావీ నమాజులు’ ఇండ్లలోనే జరుపుకోవలసిన పరిస్థితి. ఈద్‌ పండుగ నమాజు కూడా ఇండ్లలోనే చదువుకోవాలని మతపెద్దలు సూచిస్తున్నారు.

 ఇస్లాంలో ధర్మాచరణ అనేది కఠినం కాదు. అవసరమైన మినహాయింపులు, సడలింపులూ ఉన్నాయి. రంజాన్‌ ఉపవాసాలు ప్రతి ముస్లిం తప్పనిసరిగా పాటించవలసిన ధార్మిక విధి. కానీ, గర్భిణిలు, బాలింతలు, వ్యాధిగ్రస్తులు, బాటసారులకు మినహాయింపు ఉంది. నమాజుకు ముందు నీటితో కాళ్ళు చేతులు, ముఖం, తలవెంట్రుకలు శుభ్రం చేసుకోవడం అంటే ‘వుజు’ తప్పనిసరి. ఎవరికైనా అనారోగ్యం వల్ల నీటి వాడకం సాధ్యపడకపోతే వారు ‘తయమ్ముమ్‌' అంటే ‘మట్టిపై చేతులు చరిచి వుజు’ పూర్తి చేయడానికి అనుమతి ఉంది. ఇలా అనేక మినహాయింపులు ఇస్లాంలో ఉన్నాయి.

నిజానికి ఇస్లాంలో సామూహిక నమాజులు చాలా ముఖ్యమైనవి. కానీ, ఇప్పటి అసాధారణ పరిస్థితులవల్ల వాటికి దూరంగా ఉండటమే మేలు. సౌదీవంటి ముస్లిం దేశాలతోపాటు ప్రపంచవ్యాప్త ముస్లిమ్‌లు మసీదుల్లో సామూహిక నమాజులకు బదులు ఇండ్లలోనే నమాజులు చదువుకోవాలని మత ధర్మవేత్తలు కూడా నిర్దేశాలు జారీ చేయడం గమనార్హం. శుక్రవారం నమాజు, తరావీ నమాజులు అన్నింటికీ ఇవి వర్తిస్తాయి. పండగ నాటికి పరిస్థితులు మెరుగు పడకపోతే ఇవే ఆదేశాలు వర్తిస్తాయనీ వారు అప్పట్లోనే చెప్పారు. ‘అంటువ్యాధి ప్రబలిన ప్రాంతం నుంచి ప్రజలు బయటకు పోరాదు, 

ఆ ప్రాంతంలోకి బయటివారు వెళ్ళరాదు’- ఇది ప్రవక్త మహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లమ్‌ బోధన! అంటే ఆ ప్రదేశాన్ని కంటైన్మెంట్‌ ఏరియాగా ప్రకటించాలి. ఇది లాక్‌డౌన్‌ కన్నా కాస్త కఠినం. అలాగే, కరచాలనం, ఆలింగనం చేయకూడదు. భౌతికదూరం పాటించాలి. సౌదీ అరేబియాకు చెందిన గ్రాండ్‌ ముఫ్తీ షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌ కూడా ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ‘అసాధారణ పరిస్థితుల్లో ఇంటివద్దే ఈద్‌ నమాజు చేసుకోవచ్చు’ అని ఆయన అన్నారు. 

పండుగకన్నా ముందే...

ఈద్‌ పండుగకన్నా ఒకరోజు ముందే జకాత్‌, ఫిత్‌ పంచేయాలనీ చెప్పారు. బెంగాల్‌లోని ఇమాముల సంస్థకూడా దీనిని ప్రకటించింది. దారుల్‌ ఉలూమ్‌ దేవ్‌ బంద్‌ ఈ విషయమై ఫత్వా జారీ చేసింది. ముస్లిమ్‌లు ఈ ఏడాది ఈద్‌ నమాజు ఇంట్లోనే చేసుకోవాలని, మసీదులకు వెళ్ళరాదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ప్రసిధ్ధి చెందిన ఇస్లామియా విశ్వవిద్యాలయం, ఈజిప్టు కైరోలోని అల్‌ అజ్హర్‌ యూనివర్సిటీ కూడా పండుగ ఇంట్లోనే జరుపుకోవాలని సూచించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోనూ అక్కడి ప్రభుత్వం ఇలాగే ప్రకటించింది. ఈ సంవత్సరం సామూహిక నమాజులకు ఎలా ముస్లిమ్‌లు దూరంగా ఉంటున్నారో, అదే విధంగా చాలామంది ముస్లిమ్‌లు ఈద్‌ షాపింగ్‌కుకూడా దూరం కావటం విశేషం. వారు ఆ సొమ్మును దానధర్మాలకు ఉపయోగిస్తున్నారు. అన్నదానాలూ చేస్తున్నారు. కులమత వివక్ష లేకుండా అనేకమందిని ఆదుకుంటున్నారు. ‘ఈ సంవత్సరం షాపింగ్‌ వద్దు, ఆ సొమ్మును పేదసాదల సంక్షేమానికి ఉపయోగించాలి’ అనే పిలుపు ఒక ఉద్యమంలా మన దేశంలో వ్యాపించింది. ముస్లిమ్‌ సమాజమూ ఇందుకు కట్టుబడింది. 

జకాత్‌, ఫిత్రా, సదకా! ఈ పదాలు సాధారణంగా మనం రంజాన్‌ మాసంలో వింటాం. ఈ పండుగ పేదసాదలది. దానధర్మాలను అధికంగా ప్రోత్సహించే పండుగ. సమాజ సంక్షేమం కోసం ప్రజలందరినీ ప్రోత్సహించే పండుగ ఇది. ముస్లిమ్‌లు ప్రతి ఏటా ‘జకాత్‌' చెల్లిస్తుంటారు. జకాత్‌ చెల్లించి పేదలను ఆదుకోవాలనే అప్పీళ్ళు ఈ ఏడాది విచిత్రంగా ప్రభుత్వ వర్గాలనుంచి వినవచ్చాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఈ అప్పీలు చేశారు. ప్రవక్త మహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లమ్‌ బోధనలను ముస్లిమ్‌లు ఆచరించాలని, తమ సంపదలో రెండున్నర శాతం పేదలకోసం ఖర్చు చేయాలని, కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని, ముస్లిమ్‌లు పి.ఎం.కేర్స్‌ లేదా సి.ఎం.రిలీఫ్‌ నిధికి విరాళంగా కూడా ఇవ్వవచ్చని ఆయన అప్పీలు చేశారు.

పేదరిక నిర్మూలనకు ‘జకాత్‌'!

‘జకాత్‌' అంటే ముస్లిమ్‌లు తప్పనిసరిగా ఆచరించవలసిన ధార్మిక విధి. ఇస్లాంకు మూలస్తంభాలుగా పరిగణన పొందిన ఐదు మౌలిక విధుల్లో ఇదొకటి. ఒక ముస్లిం వ్యక్తి వద్ద ఒక సంవత్సర కాలం ఆదాయ వ్యయాలు పోగా, అతనివద్ద యాభై రెండు తులాలు లేదా అంతకన్నా ఎక్కువ వెండి లేదా అంతకు సమానమైన సంపద ఉంటే అతను జకాత్‌ చెల్లించాలి. జకాత్‌ పేదవారికి చెల్లించాలి. సాధారణంగా అత్యంత పవిత్రమైన రంజాను మాసంలో జకాత్‌ చెల్లిస్తుంటారు. కానీ, కరోనా వచ్చి పడిన ఈ విపత్కర పరిస్థితిలో చాలామంది రంజానుకన్నా ముందే జకాత్‌ చెల్లింపులకు సిద్ధపడటం గమనార్హం. చాలావరకు జకాత్‌ పంపకం వ్యక్తిగత స్థాయిలో జరుగుతుంది. కాబట్టి, నగదు రూపంలో జకాత్‌ ఇస్తున్నారు. మన దేశంలో పేదరికాన్ని పారదోలడానికి జకాత్‌ ఎంతైనా ఉపయోగపడుతున్నది. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జకాత్‌ పంపిణీ చాలా భారీస్థాయిలో జరుగుతుంది. 

దివ్య ఖుర్‌ఆన్‌ రూపంలో సాఫల్యమార్గాన్ని ప్రసాదించిన అల్లాహ్‌కు కృతజ్ఞతగా ముస్లిమ్‌లు ఉపవాసాలు ఉంటారు. రంజాను మాసంలోనే దివ్య ఖుర్‌ఆన్‌ అవతరించింది. కాబట్టి, ఆ మాసంలో ఉపవాసాలు ఉంటారు. ‘ఉపవాసాల మాసం’ తర్వాత ఆ సంతోషాన్ని ఈద్‌ పండుగ రూపంలో జరుపుకుంటారు. ఇదే పద్ధతిలో దైవగ్రంథం దివ్య ఖుర్‌ఆన్‌లో బోధించిన మాటలను కూడా మనం ఆచరణలో పెట్టాలి. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఏమన్నాడంటే ‘వారు ఎలాంటి వారంటే, (ప్రపంచంలో) మొక్కుబడి చెల్లించే వారు, నలువైపులనుంచి ఆపదలు కమ్ముకొని వచ్చే దినానికి భయపడే వారు. అల్లాహ్‌మీది ప్రేమతో పేదలకూ, అనాథలకూ, ఖైదీలకూ అన్నం పెట్టేవారు’. ‘తన పొరుగువాడు ఆకలితో నిద్రిస్తుంటే తాను కడుపునిండా భుజించేవాడు మాలోని వాడు కాదు’ అన్నారు ప్రవక్త మహమ్మద్‌ (స). ఇదీ ఇస్లాం గొప్పతనం.

వలస కార్మికులకు అన్నదానాలు


రంజాన్‌కన్నా ముందే కరోనా వచ్చింది. రంజాన్‌ మాసం చాలా పవిత్రమైంది కాబట్టి సాధారణంగా ముస్లిమ్‌లు జకాత్‌ ఈ మాసంలోనే చెల్లిస్తుంటారు. కానీ, కరోనా విపత్తు నేపథ్యంలో వేలాది వలస కార్మికులు రోడ్లపై తమ సొంతూళ్ళకు పిల్లాపాపలతో కాలినడకన బయలుదేరిన విషాదదృశ్యాలు ముందుకు వచ్చిన తర్వాత, అనేకమంది పేదలు లాక్‌డౌన్‌వల్ల తినడానికి తిండి లేక అలమటిస్తున్నారని తెలిసిన క్రమంలో చాలామంది ముస్లిమ్‌లు పేదలకు అన్నదానాల కార్యక్రమాలు ప్రారంభించారు.

దాంతోపాటు జకాత్‌ లెక్కించి పేదలకోసం ఖర్చు పెట్టడానికి రంజాన్‌ వచ్చేవరకు ఆగవలసిన పని లేదని, కరోనా విపత్తు ముంచుకు వచ్చింది కాబట్టి, వెంటనే జకాత్‌ లెక్క కట్టి చెల్లించాలనికూడా చాలామంది ధర్మవేత్తలు ప్రకటించారు. ఈ ప్రకటనల ప్రభావమూ ముస్లిమ్‌లపై పడింది. అనేకమంది తమ జకాత్‌ ఎంత ఉందో లెక్కించి దానధర్మాలకు ఖర్చు చేస్తుండటం అభినందనీయం. 
logo