సోమవారం 25 మే 2020
Devotional - May 23, 2020 , 22:29:19

శాంతి ప్రదాత పరమేశ్వరుడే!

శాంతి ప్రదాత పరమేశ్వరుడే!

దుఃఖం ఎందుకు కలుగుతుందో తెలుసుకోవాలని సంసారాన్ని విడిచిపెట్టి తపస్సు చేశాడు గౌతమ బుద్ధుడు. మన కోరికలే దుఃఖానికి కారణమని, కనుక వాటిని జయించాలని, ఫలాపేక్ష లేని కర్మలు చేస్తూ ధర్మాన్ని, సంఘాన్ని, జ్ఞానాన్ని ఆశ్రయించమని ఆ మహా పురుషుడు ప్రబోధించాడు. కోరుకున్న వస్తువు దూరమైనప్పుడు, అనుకున్నది సాధించలేనప్పుడు, అపజయం కలిగినప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. ఆత్మీయులకు కష్టం కలిగినప్పుడు కూడా దుఃఖం కలుగుతుంది. అయితే, ‘దుఃఖాలనేవి ఎన్నిరకాలు? వాటి అంతరార్థం ఏమిటో’ సామాన్యులకు తెలియదు.

పూర్వం ఇంగ్లండుకు చెందిన ఒక పరిశోధకుడు ‘దుఃఖాలెన్ని’ అనే విషయం మీద ఒక పరిశోధనాలయాన్నే నెలకొల్పాడు. అంతడే అల్బర్ట్‌ రస్సెల్‌. సుమారు నలభై ఏండ్లు పరిశోధించినా అతనికి ‘దుఃఖ విభజన’ ఎలా చేయాలో అర్థం కాలేదు. ఇక, లాభం లేదని భారతదేశం బాటపట్టాడు. దారిలో అతనికి ఒక హిమాలయ సాధవు ఎదురైనాడు. ఆయనకు నమస్కరించిన రస్సెల్‌ మహాశయుడు అతనితో- ‘దుఃఖాలెన్నో తెలుసుకోవాలని పరిశోధన చేస్తే నాకు దుఃఖమే మిగిలింది. ఇప్పుడు మీ దర్శనమైంది. మీవల్ల నాకు దుఃఖ కారణం, దుఃఖాల్లోని రకాలు, దుఃఖశాంతిని గురించి తెలుసుకోవాలని ఉంది. దయచేసి వివరించండి’ అని వేడుకొన్నాడు.

ఆ సాధువు మొదటి ప్రశ్నకు సమాధానంగా, ‘దుఃఖానికి కారణం మన అజ్ఞానం’ అన్నాడు. ఇక ‘దుఃఖాలెన్ని రకాలు’ అనే ప్రశ్నకు జవాబుగా, ‘మూడురకాల దుఃఖాలున్నాయి. అవి: 1.ఆధ్యాత్మిక దుఃఖం 2.ఆధిభౌతిక దుఃఖం 3.ఆధిదైవిక దుఃఖం. మన శరీరం వల్ల కలిగే దుఃఖమే ఆధ్యాత్మిక దుఃఖం, తోటి ప్రాణుల వల్ల కలిగే దుఃఖమే ఆధి భౌతిక దుఃఖం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే దుఃఖమే ఆధిదైవిక దుఃఖం’ అని వివరించాడు. తానెంత పరిశోధించినా కనుగొనని విషయాన్ని ఇంత సూక్ష్మంగా వివరించి చెప్పడం భారతీయ వేదాంతులకే సాధ్యమైందని ఆ పరిశోధకుడు ఆశ్చర్యపోయాడు. అంతటితో ఆగక, ‘దుఃఖ శాంతికి మార్గం చెప్పండని’ అడిగాడు. సాధువు ధీర గంభీర స్వరూపంతో ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని ఉచ్ఛరించాడు. పరిశోధకునికి అర్థం కాక బిక్కమొగం వేశాడు. ‘దయతో వివరించి చెప్పండని’ ప్రార్థించాడు.

‘సృష్టి స్థితి లయకారుడైన పరమేశ్వరునికి ‘ఓం’ అని పేరు. ‘అతడే మనల్ని మూడు దుఃఖాల నుంచి బయటపడేటట్లు చేసి ఆనందాన్ని కలిగిస్తాడు. అందుకే, అతణ్ణి తలచుకొని, వాటి విముక్తి కోసం మూడుసార్లు శాంతి శబ్దాన్ని ఉచ్ఛరించాలి’ అని చెప్పగా, పరిశోధకుడు సాధువు పాదాలకు నమస్కరించి, అతని వల్ల ఎంతో జ్ఙానం పొందినవాడై స్వస్థలానికి వెళ్లిపోయాడు. ఈ సంఘటనను బట్టి మనకు సాధారణంగా కలిగే దుఃఖాల నుంచి పరమేశ్వరుడే రక్షిస్తాడని, అతనినే మనసా వాచా కర్మణా ఉపాసించాలని తెలుస్తున్నది. అందుకే, ప్రతి వైదిక కర్మలో ‘ఓం శాంతిశ్శాంతిశ్శాంతి’ అని చెప్పటం నేటికీ చూస్తాం. ముఖ్యంగా ‘శాంతిపాఠ మంత్రం’ వినిపించి ఏ కార్యక్రమాన్నైనా ముగించడం వైదిక సంప్రదాయమే. ‘ఓం శాంతిశ్శాంతిశ్శాంతి’ అని ఈ మంత్రాన్ని ముగిస్తాం. ‘ఓం ద్యౌఃశాంతి రంతరిక్షగ్‌ం శాంతిః/ పృథివీ శాంతి రోషధయ శ్శాంతిః/ వనస్పత యశ్శాంతి ర్విశ్వేదేవాః శాంతిః/ బ్రహ్మశాంతిః సర్వగ్‌ం శాంతిః/ శాంతిరేవ శాంతిః సామాశాంతిరేథిః’ (యజుర్వేదం: 36-17). నాలుగు వేదాలలో కనిపించే ఈ మంత్రం పరమేశ్వరుని సృష్టి రచనను తెలియజేస్తుంది. సృష్టిలోని అన్ని భాగాలు శాంతినిస్తేనే మనం సుఖంగా ఉండగలుగుతాం. పరమేశ్వరుడు సృష్టికర్త మాత్రమేకాదు, పోషకుడుకూడా. ఆయన వల్లనే విశ్వమంతా శాంతిదాయకం అమవుతుంది. కనుక, శాంతిప్రదాత పరమేశ్వరుడే.

అందరు సుఖంగా ఉంటేనే అందరితోపాటు మనం సుఖంగా ఉండగలం. తోటి వాని సుఖంలో తన సుఖాన్ని చూసుకొనే స్థితికి మనిషి ఎదగాలి. తోటి ప్రాణుల సుఖదుఃఖాలను తనవిగా భావించేవాడే పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ‘విశ్వశాంతి’ అనేది ప్రతి వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ‘విశ్వశాంతి’ ధ్యేయంగా మానవులు నడుచుకోవాలి. పరమేశ్వరునిలో ఈ విశ్వాన్ని చూసినట్లే, ప్రపంచ పదార్థాలలోను పరమేశ్వరుణ్ణి చూడాలి. అలా చూడగలిగిన వారి ప్రార్థనా మంత్రమే శాంతిపాఠం. దీని అనుబంధ మంత్రమే ‘ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః’.


logo