బుధవారం 27 మే 2020
Devotional - May 23, 2020 , 00:09:13

స్థిర సంకల్పం సిద్ధించాలంటే?

స్థిర సంకల్పం సిద్ధించాలంటే?

వ్యవసాయిత్మికా బుద్ధిరేకేహ కురునందన/ బహు శాఖా హ్యనం తాశ్చ బుద్ధయో వ్యవసాయినామ్‌. ‘అర్జునా! నిశ్చయాత్మక బుద్ధి ఒకే రూపంలో ఉంటుంది. అందుకే, స్థిరబుద్ధి కావాలి. స్థిరబుద్ధి లేని అజ్ఞానులు, కోరికలు ఎన్నో ఉన్నవారి బుద్ధులు పలువిధాలుగా లెక్కకు మించి ఉంటాయి’ అంటూ శ్రీమద్భగవద్గీతలోని రెండో అధ్యాయమైన సాంఖ్యయోగంలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి బోధించిన మాటలు ‘మనిషికి స్థిరబుద్ధి విధిగా ఉండాలి’ అని లోకానికి కూడా బోధించినట్లయింది. ‘వ్యవసాయాత్మిక బుద్ధి’ అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి. అదెప్పుడూ ఒకే రూపంలో ఉంటుంది, ఉండాలి. అలా ఉంటేనే దాన్ని ‘స్థిరబుద్ధి’ అంటాం. అంటే, ‘కరాఖండిగా ఉండే బుద్ధి’ అన్నమాట. దాన్నే వేదాంతం ‘జ్ఙానం’గా గుర్తించింది. అనిశ్చయాత్మక బుద్ధి (అజ్ఞాన బుద్ధి)కి అనేక రూపాలు ఉంటాయి. అందుకే, ‘అనిశ్చయాత్మక బుద్ధులైన’వారు చపలచిత్తులై ఏ కార్యక్రమాన్నీ సక్రమంగా నిర్వర్తించలేరు.

స్థిరబుద్ధి కలిగిన ఆత్మజ్ఞానులైన వారు సకల కార్యాల్లోనూ విజయాలు సాధిస్తుంటారు. నిర్ణయం తీసుకునే ముందే తాము నిర్వహించబోయే కార్యానికి చెందిన దేశ, కాల, పాత్రలను తమ దృష్టిలో ఉంచుకొనే కార్యం ప్రారంభిస్తారు. బాగా ఆలోచించిన తర్వాతే ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. ఒకసారి వారు స్థిర నిర్ణయం తీసుకున్నాక ఇక ఎవరు.. ఎన్నిచెప్పినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని మార్చుకొనరు. అందుకే, అలాంటివారికి ఎవరైనా సలహాలు ఇవ్వడానికి కూడా భయపడుతుంటారు. స్థిరచిత్తం, నిశ్చయాత్మక బుద్ధి లేనివారు పలు మార్గాల్లోకి వెళ్లి చివరికి దేన్నీ సాధించలేరు. అంటే, నిశ్చయాత్మక బుద్ధి విధిగా విజయం సాధిస్తుందన్నది కఠోర సత్యం. లెక్కకు మించిన ఆలోచనలు, పలు మార్గాల పోకడలు ఏనాటికీ సత్ఫలితాలను సాధించలేవన్నది దీనిద్వారా స్పష్టమవుతున్నది. అలాంటి ఏ పనీ విజయవంతం కాదు. ‘శ్రీమద్భాగవతం’లోని వామనావతార ఘట్టం ఇందుకు ఒక ఉదాహరణ. బలి చక్రవర్తిని ఈ స్థిరబుద్ధికి ప్రతీకగా చెప్పవచ్చు. తనను యాచించడానికి వచ్చిన వటుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడని అతనికి తెలుసు. ఎందుకొచ్చాడో కూడా తెలుసు. అయినా, ‘అడిగింది ఇవ్వాలన్న’ నిశ్చయాత్మక బుద్ధిమేరకు బలి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ‘ప్రాణ మాన విత్త భంగమందు బొంక వచ్చు’ అని గురువు శుక్రాచార్యుడు చెప్పిచూసినా వినని ఆయన ‘తిరుగన్‌ నేరదు నాదు జిహ్వ’ అంటూ, దృఢ నిశ్చయంతో దానినే ఆచరించి చూపడం అతని నిశ్చయాత్మక బుద్ధికి నిదర్శనం.

ఈ నిశ్చయాత్మక బుద్ధి కలుగడానికి, మనిషి మనసుకు అవినాభావ సంబంధం ఉంటుంది. మనసు మనం చెప్పినట్లు వినేస్థాయికి మనం చేరాలి. అప్పుడే తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మనలనే వరిస్తుంది. అంతేకానీ, మన మనసు మన అధీనంలో లేని పక్షంలో కార్యవిఘ్నత కలిగి అది దుఃఖకారణమవుతుంది. అయితే, మనసు మన అధీనంలోకి రావడం అంత తేలికైన విషయం కాదు. దానికి చాలా అభ్యాసం కావాలి. దాన్ని సాధనతో సమకూర్చుకోవచ్చు. అలా కాని పక్షంలో మనసు సంక్షోభానికి గురై తీవ్ర దుఃఖానికి కారణమవుతుంది. దాంతో తలపెట్టిన కార్యాల్లో అపజయం ఎదురవుతుంది. స్థిరబుద్ధిని సాధించడానికి ముందు సుఖదుఃఖాలకు అతీతులం కావాలి. మంచైనా, చెడైనా వాటి ప్రభావం మనపై పడకుండా చూసుకోవాలి. మనసును అధీనంలో ఉంచుకోవాలని అనుకున్నా ఒక్కోసారి మన ఇంద్రియాలు దానికి సహకరించవు. కారణం, మనషికి ఇంద్రియ లోలత్వం అధికం కనుక.

ఇంద్రియాలు శబ్ద, రూప, రస, గంధ, స్పర్శలనే భౌతిక విషయాలకు సులభంగా లొంగే తత్తం ఉంటుంది. మనసు వాటికి దాసోహం అనకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనదే మరి. ఈ విషయాన్నే భగవానుడు చెబుతూ, ‘యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వశః’ అన్నాడు. ‘తాబేలు తన డిప్పలోకి తానే ముడుచుకొని పోయినట్లు’ మనం ఇంద్రియాలను పైన చెప్పిన అయిదు విషయాలకు లొంగకుండా చూసుకోవాలి. అప్పుడే స్థిరబుద్ధి ఏర్పడుతుంది. ఇంద్రియాలను నియంత్రించకుండా మనోనిగ్రహం సాధ్యం కాదు, మన ప్రయత్నం సఫలం కాదు. మరి, ఇంద్రియ జయానికి ఎంతో సాధన అవసరం. తద్వారానే ‘నిశ్చయాత్మక బుద్ధి’ సాధ్యమవుతుంది. అదే మనలను విజయపథంలో నడిపిస్తుంది.

-గన్నమరాజు గిరిజా మనోహరబాబు


logo