శుక్రవారం 07 ఆగస్టు 2020
Devotional - May 21, 2020 , 23:09:52

సూర్యకాంతి స్వరూపమే ‘సరస్వతి’

సూర్యకాంతి స్వరూపమే ‘సరస్వతి’

సకలవిద్యలకు అధిదేవతగా, జ్ఞానరూ పిణిగా కొలవబడే దైవీరూపిణి సరస్వతి. హంసవా హనగా, వాగీశ్వరిగా, బుద్ధిధాత్రిగా, భువనేశ్వరిగా వేర్వేరు నామాలతో పూజలందుకునే సరస్వతి మనలోని తేజోరూపమే. సరస్వతి పూజతోనే అక్షరాభ్యాసం జరుగుతుంది. వాణి ఆరాధనతోనే సకల రచనలూ వెలుగులోకి వస్తాయి. వాక్కులకు అధిదేవత ఆమె. వాఙ్మయమంతా ఆమె స్వరూపమే. సరస్వతీదేవి రూపాన్ని గమనిస్తే ఒక ప్రత్యేకమైన వైజ్ఞానికత కనిపిస్తుంది. అమ్మవారికి తెలుపు వస్ర్తాలు మాత్రమే కట్టి ఉంటాయి. చేతిలో వీణ, పుస్తకం, అక్షరమాల ధరించి ఉంటుంది.

‘హంసవాహన’గా సుప్రసిద్ధమైన దేవత ఆమె. సూర్యకాంతి భూమిని చేరుతుంది. ఆకాశంలోని సూర్యుడు మనకు ఉదయకాలంలో ఎరుపు, నారింజ, పసుపు వర్ణాలలో కనిపించినా, భూమిపైకి మాత్రం తెలుపు వర్ణమే చేరుతుంది. దీనినే మనం ‘వెలుగు’ అంటున్నాం. సూర్యుడు వెలుగును, వేడిమిని రెండిటినీ మనకు అందిస్తూ వాటిద్వారా అనంత శక్తులను ప్రవహింపజేస్తున్నాడు. వస్తువు తాలూకు జ్ఞానం మనకు తెలియాలంటే దానిపై వెలుగు ప్రసరించాలి. చీకటిలో ఉన్నప్పుడు ఆ ‘వస్తు దర్శనం’ కాదు. కాంతి ప్రసరితమైన వెలుగువల్లే ఆ వస్తుజ్ఞానం బోధపడుతుంది. అదేలా ప్రకృతి విశేషాలను గురువుద్వారానో, పెద్దల ద్వారానో తెలుసుకుంటాం. కనుక, జ్ఞాన సాధకులు కాంతిని ఆశ్రయించకతప్పదు.

‘తెలుపు’ రంగు అన్నింటినీ విపులంగా ‘తెలుపు’తుంది. అందుకే, ‘శ్వేత వస్త్ర ధారిణి’గా సరస్వతిని కొలుస్తాం. సూర్యకాంతిని అంతా ఒకేచోట ఊహించడం సాధ్యం కానప్పుడు ఒకసారి సరస్వతిని స్మరిస్తే చాలు ‘కాంతి స్వరూపం’ అర్థమవుతుంది. తత్‌ ప్రభావమైన జ్ఞాన స్వరూపమూ సాక్షాత్కరిస్తుంది. అలా మనకు జ్ఞానం సిద్ధిస్తుంది. ‘సరతి’ అంటే ‘కదిలేది’. మనలో చైతన్యాన్ని కలిగించి, మనల్ని కదిలించేది సరస్వతి. జ్ఞానమే కదలికలకు మూలం. సరస్వతి చేతిలోని వీణ లోకంలోని సంగీతాది విద్యలకే కాక ఈ భూమి కదలికల వల్ల కలిగే శబ్దానికి, సృష్టిలోని ఆకాశ తత్వానికి అనుబంధమైన శబ్దగుణకానికీ సంకేతంగానూ ఉంటుంది. అందుకే, సంగీతాది కళాత్మక విద్యలకన్నింటికీ మూలరూపం సరస్వతి.

ఇదేలా పుస్తకం అన్నిరకాలైన లౌకిక విద్యలకూ సంకేతం. వాటిలోకి కళలు, సామాజిక, వ్యాపార, ప్రాకృతిక శాస్ర్తాలన్నీ వస్తాయి. అసలు, విద్య అంటేనే జ్ఞానం. అమ్మవారి మరో చేతిలోని అక్షమాల ఆధ్యాత్మిక విద్యలకు సంకేతం. వ్యక్తమైన రూపంలో మనిషి లోకాన్ని పరిశీలించి, తమ బాహ్య కదలికలకు మూలాన్ని అన్వేషిస్తాడు. తనలోని చైతన్యమే తనను నడిపిస్తుందనే జ్ఞానాన్ని అందించేది కూడా ఈ సరస్వతీ స్వరూపమే. ఆ చైతన్యం వైపు మన దృష్టిని కేంద్రీకరించాలంటే బాహ్యమైన, కనిపించే అంశాలపై ఆసక్తిని తగ్గించుకొని, ‘అంతర్ముఖులం’ కావాలి. దానికి దీక్ష, తపస్సు అవసరం. ఈ భావాన్ని మనకు తెలియజేసేదే అమ్మవారి చేతిలోని ‘అక్షమాల’. అలాగే, హంస వాహనం మనకు మంచి చెడుల మధ్య విచక్షణను తెలుపుతుంది. జ్ఞానానికి, ప్రాణానికి ప్రతీక అది. అందుకే, పరమహంసలైన వారు అంతటి మహానుభావులుగా ప్రసిద్ధి పొందుతారు.

ఈ దృష్ట్యా మన చదువుల తల్లి ‘సూర్యకాంతి ప్రభావ స్వరూపిణి’. మన కోరికలన్నీ ఆమె జ్ఞానం వల్లనే సిద్ధిస్తాయి కనుక ఆమెను ‘కామరూపిణి’గానూ అభివర్ణిస్తారు. మనలోని అంతర్గత జ్ఞానమే ఈ కాంతి స్వరూపం. బుద్ధిని ఎప్పటికప్పుడు ప్రచోదనం చేస్తూ, మనలను రక్షించే సరస్వతీ ప్రార్థనల వల్ల మనలోని జడత్వం తగ్గి, మనమూ ‘సరస్వతీ స్వరూపులమే’ అవుతాం. జ్ఞానసిద్ధితో లోకానికి, ప్రకృతికి, మనకూ వినియోగపడుతాం. ‘సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.

-సాగి కమలాకర శర్మ, 97042 27744


logo