గురువారం 28 మే 2020
Devotional - May 20, 2020 , 23:04:36

మానవజాతికి మహా సందేశం!

మానవజాతికి మహా సందేశం!

పరమ భాగవతుడు పరీక్షిత్తు మహారాజు ఉత్తమ పాలన సాగిస్తున్న రోజులవి. ఆయన ఒకనాడు మృగాల వేట కోసం అడవికి వెళ్లాడు. అలసి సొలసి దాహం వేయగా, దగ్గరలోనే తనువును మరిచి తపోనిష్ఠలో లీనమైన ఒక మహర్షి కనిపించడంతో ఆయనను సమీపించి, ‘తాగడానికి నీళ్లిమ్మ’ని వేడాడు. ఆ ముని పలుక లేదు. పరీక్షిత్తుకు కోపం ముంచుకొచ్చింది. అవమానభారంతో కృంగిపోయాడు. చచ్చిపడున్న ఒక పామును ముని మెడలో వేసి వెళ్లిపోయాడు. అయితే,   ముని ఎవరో కాదు, శమీకుడు. పేరుకు తగ్గ మహర్షి. కామక్రోధాలు, రాగద్వేషాలు లేని శాంతగుణానికే ‘శమం’ అని పేరు. ‘శమం’ కలవాడు కాబట్టి, ఆయన శమీకుడు. చచ్చిన పామును మెడలో వేసినా చలించలేదంటే ఆ ముని నిష్ఠ ఎంత నిశ్చలమో ఊహించవచ్చు.

మునుల తపఃఫలంలో కొంత రాజులకూ సంక్రమిస్తుంది. కనుక, ‘శమీకుని నుంచి మంచినీళ్ల ఆతిథ్యం కోరుకోవడం’ పరీక్షిత్తు పరంగా తప్పేమీ కాదు. ‘ఆతిథ్యం ఇవ్వడం అటుంచి శమీకుడు అసలే చలించకపోవడం’ అనేది ఆ ముని తపోధర్మం కాబట్టి, ఆయన తప్పేమీ లేదు. ఎంత కలిని కట్టడి చేసినా మహారాజైన పరీక్షిత్తు విధి పరీక్షలకు బలై, యుగ(కలి) ధర్మ వికృతి ప్రభావంతోనే యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి, ముని మెడలో పామును వేసే పాపానికి పాల్పడ్డాడు. శమీక ముని కొడుకు శృంగి తన తండ్రి మెడలో మృతసర్పాన్ని చూసి మండిపడ్డాడు. ‘ఆ నాటికి ఏడవనాడు పరీక్షిత్తు తక్షక సర్పం కాటువల్ల మరణించాలని’ శపించాడు. ఇంతలో శమీకుడు కళ్లుతెరిచి, శృంగి శాపానికి కృంగిపోయాడు. పరీక్షిత్తు మరణాన్ని గురించి పరితపించాడు. ‘చిన్న నేరానికి ఇంత పెద్ద శాపమా’ అన్నది ఆయన ఆలోచన. ‘రాజు మరణిస్తే ప్రజలకు దిక్కెవరు?’ అన్నది ఆయన ఆవేదన.

శాప వార్తను పరీక్షిత్తుకు చేరవేసి ముక్తికై సాధన చేసుకోవడానికి ఒకరకంగా కారకుడైందీ శమీకుడే. తన మరణవార్త విన్న పరీక్షిత్తు చాలా ధైర్యంగా, ఉదాత్తంగా ‘తన నేరానికి శృంగి శాపం సరైన శిక్ష’గానే భావించాడు. మరణ భయాన్ని జయించి, మనస్సును మాధవ స్మరణం వైపు మరలించి గంగాతీరంలో ప్రాయోపవేశానికి (ఆమరణ నిరాహార వ్రతం) సిద్ధమయ్యాడు. ఆ ఏడురోజులు హరినామ సంకీర్తనతో సద్వినియోగం చేసుకొని ముక్తిని సాధించాలన్నది పరీక్షిత్తు ప్రణాళి ‘మృత్యువు అనివార్యమైనప్పుడు చిత్తాన్ని శ్రీహరి పదాయత్తం చేయాలన్న’ ఆలోచన రావడం ఒక విశేషం. ఇది మానవజాతికి ఒక మహాసందేశం. పరీక్షిత్తు మరణవార్త విని సాధు లోకమంతా కదలివచ్చి ఆయనకు అండగా నిలిచింది. గంగా తీరమంతా సందడిగా నాదవేదంతో మార్మోగింది. అంతలో తలవని తలంపుగా శుకయోగి అక్కడికి వచ్చాడు.

శుకుడు అయోనిజుడు. అతనికి భేద దృష్టి లేదు. ఓసారి ఒక సరస్సులో వివస్త్రలుగా స్నానం కొందరు దేవతా స్త్రీలు చేస్తున్నారు. అప్పుడే అనుకోకుండా అటుగా వచ్చిన వృద్ధుడైన వ్యాసమునిని చూసివారంతా సిగ్గుపడి గబగబా తమ వస్ర్తాలను చుట్టుకొన్నారట. కానీ, అంతకు కొద్దిముందే అటు నుంచి వెళ్లిన శుకుణ్ణి చూసి మాత్రం వారు ఆ వికారానికి లోనుకాలేదట. శుక్రుని నిర్వికారతకు ఇదొక నిదర్శనం. అతనిని చూడగానే పరీక్షిత్తు మనసు పులకించింది. తనను తరింపజేయమని వేడుకొన్నాడు. అప్పుడు శుకుడు పరీక్షిత్తుకు ఖట్వాంగుని కథ చెప్పాడు. ఖట్వాంగుడనే రాజు దేవతలకు యుద్ధంలో సహాయపడటంతో వారు రాక్షసులను జయించగలిగారు. అందుకు దేవతలు ఖట్వాంగుని వరం కోరుకొమ్మనగా, ఆయన ‘తానెంత కాలం బతుకుతానో చెప్ప’ మన్నాడట. ‘రెండు ఘడియలు (48 నిమిషాలు)’ అని దేవతలు చెప్పగానే హుటాహుటిన ఆయన ఈ కర్మభూమికి వచ్చి, ఆ రెండు ఘడియలు తపస్సు చేసి మోక్షాన్ని పొందాడట. ‘పరీక్షిత్తు మరణానికిగల ఏడు రోజుల వ్యవధి ముక్తి సాధనకు పుష్కలం’ అని సూచించడానికే శుకదేవుడు ఈ వృత్తాంతం చెప్పాడు. కానీ, పరీక్షిత్తుకు అదొక ‘శాపరూప వరం’. భక్తిరస భాగవతాన్ని వినిపించి తన ముక్తికి మూలమయ్యాడు శుకయోగి.


logo