మంగళవారం 26 మే 2020
Devotional - May 19, 2020 , 23:30:04

‘మంచి మనసు’ ఎలా సాధ్యం?

‘మంచి మనసు’ ఎలా సాధ్యం?

మనసులోని వృత్తులైన మనసు, బుద్ధి, చిత్తములన్నీ కలసి ఒక విభాగమైతే.. వీటన్నింటినీ తనలో ఇముడ్చుకొని ముందుండి పలికేది ‘అహంకారం’. మనసులోని ప్రధాన భూమికను వెలుపలి ప్రపంచానికి విస్తరింపజేసేది ఇదే. ‘అహం’ అంటే ‘నేను’. ఈ ‘నేను’ చాలా రకాలుగా కనిపించి, అసలును మరుగు పరుస్తుంది. ‘నేను’ అంటే సాధారణంగా వ్యక్తి బుద్ధితో చూస్తే ‘వ్యక్తి’గా, గుణబుద్ధితో చూస్తే ‘గర్వం’గా, జ్ఞానబుద్ధితో పరికిస్తే అన్నింటికీ ఆధారభూతమైన ‘తత్త్వం’గా వర్తిస్తుంది. ఇలానేకాక మనసులోని భూమికా భాగమైన అహంకారం, సత్వరజస్తమో గుణాలతో కలిసి వేర్వేరుగా ఉన్నప్పుడు ఒకరకంగా, ఒకదానితో మరొకటి కలిస్తే మరొకరకంగా వ్యక్తమవుతుంది.

వ్యక్తి తత్త్వం: మేను ‘నేననే’ నేను-మూడు గుణాలతో కలిసిన అహంకారం. గుణ తత్త్వం: నేను ‘నేననే’ నేను-సాత్వికమైన అహంకారం, నేను ‘నేనే’ననే నేను-రాజసికమైన అహంకారం, నేనే అనే ‘నేను’ తామసికమైన అహంకారం. జ్ఞాన తత్త్వం: నేనని అనని నేనైన ‘నేను’-‘సాక్షి’గా ఉండే అహంకారం. అతీతత్త్వం: ఏమీ అనని అన్నీ తానైన ‘నేను’-అవ్యక్తమైన, అనిర్వచనీయమైన తత్త్వరూపం. ఇందులో మొదటి నాలుగు మాత్ర మే మనసులో కనపడే అహంకార స్వరూపాలు. ఈ అహంకారం బుద్ధిని, చిత్తాన్ని స్వయంగా పలుకనివ్వదు. మనసును కూడా తన గుప్పిట్లో ఉంచుకొని, తానే పలికి మనసు మీదికి తోస్తుంది. ఏ పని చేసినా తాను మాత్రమే చేయాలని కట్టడి చేస్తుంది. ఆధిపత్యాన్ని అంగీకరించదు.

ఒక ఉదాహరణ చూద్దాం. ఒక అత్తగారు పక్కింటికి వెళ్లినప్పుడు ఓ భిక్షగాడు వచ్చి ‘బిక్ష ఇవ్వమని’ అడుగుతాడు. కోడలు ఆలోచించి ‘మా అత్తలేదు కదా!’ అని భర్తకు విషయం చెబుతుంది. ‘అమ్మ ఇంట్లో ఉన్నా ‘లేదు, వెళ్లమని’ పంపిస్తుంది కదా! నువ్వూ అలానే చెప్పి పంపించు’ అన్నాడు. ఆమె ‘ఏం లేదు పో’ అని పంపిస్తుంది. భిక్షగాడు వెళ్లిపోతుండగా, మార్గంలో ఆ అత్త ఎదురైంది. ‘ఎక్కడ్నించి వస్తున్నావు?’ అని అడిగి, కోడలు చెప్పిన సమాధానం తెలుసుకొని, ‘నువ్విలా మా ఇంటి ముందుకు రా’ అని తీసుకెళ్తుంది. అప్పుడు అతణ్ణి ‘ఇప్పుడు భిక్షం అడుగవయ్యా’ అని చెప్పి, అతడు అడగ్గానే ‘లేదు పో’ అని జవాబిస్తుంది. ‘అమ్మా! మీ కోడలు కూడా ఇదేమాట చెప్పిందిగా’ అంటాడతను బాధగా. దానికామె ‘ఉన్నదన్నా, లేదన్నా నేనే చెప్పాలి. నా కోడలు ఎలా చెపుతుంది? ఆమెకేం అధికారం ఉంది?’ అని అరిచి పంపించేస్తుంది. కోడలు ‘మీ కుమారున్ని అడిగి ఆయన చెప్పిందే చెప్పాను’ అన్నది. ‘వానికేం తెలుసు. వాడుకూడా నన్నే అడిగి చెప్పాలి. మీరిద్దరూ కలసి నా అధికారం బదలాయిచుకుంటారా’ అని అత్త హూంకరించింది. ఇంతలో ఇంటి యజమాని (భర్త) వచ్చాడు. అతని రాకతో అత్త మౌనం వహించి, సణుగుతూ తన పనిలో నిమగ్నమైపోయింది.

ఇందులో అత్త పాత్ర ‘త్రిగుణ మిశ్రితమైన అహంకార స్వరూపం’. ఈ అహంకారం తన ఆధిపత్యాన్ని వదలదు. తప్పులను సహజంగా ఒప్పుకోదు. పై పెచ్చు వాదించి, గెలిచేలా ప్రవర్తిస్తుంది. మరి, అంతటి ఆమె కూడా ‘యజమాని’ (భర్త) ముందు నిశ్శబ్దమైపోయింది కదా!’. అహంకారం పరిమితిలో ఉంటే సత్త్వగుణం భాసిస్తుంది. మనం మనలాగే ఉంటాం. కొంచెం అవధి దాటితే గుర్రు ఉంటుంది. అప్పుడు రజోగుణంతో, కోరికలతో నలిగిపోతుంది. ఇది సవరించుకునే స్థాయిలోనిదే. విపరీతమైన ప్రవర్తనలో పడి కన్ను మిన్ను కానక విర్రవీగే స్థితికి ఎగబాకితే తమోగుణంతో చిందులేస్తుంది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. అహంకారం బాగా పెరిగినప్పుడు తన స్థితిని తాను అంచనా వేసి చూపించాలి. అసలు దాని విలువేమిటో తెలియజేయాలి. ప్రమాణ బుద్ధిని ప్రవర్తింపజేయాలి. చిత్తాన్ని పలుకనివ్వాలి. ఇలాంటప్పుడు చుక్కలతో ప్రకాశించే ఆకాశాన్ని చూడండి. ‘విశాలమైన ఆకాశంలో నీవెంత? నీ విలువెంత?’ అని బుద్ధి విమర్శించి చెబితే, తనకన్నా విస్తరణ గల, విలువ గలవెన్నో ఉన్నాయని చిత్తంతో తెలుసుకొని కాస్త నెమ్మదిస్తుంది.

అహం తత్త్వం గర్వంగా పరిణమించకూడదంటే అది బుద్ధి, చిత్తాలను, మనసును సంప్రదిస్తూ నడువాలి. నిర్మలమైన చిత్తం నిశ్చయమైన బుద్ధి, వికాసమైన మనసుల ద్వారా అహం తత్త్వం కలిస్తే ‘మంచి మనసు’ బయటపడుతుంది. లేదంటే, అహంకారం వల్ల అవినయం వస్తుంది. అందుకే, పరమాత్ముని పరవశంతో స్మరించి అణువు నుంచి మహత్తువరకు విస్తరించి అవ్యక్తంగా వ్యక్తమయ్యే తత్త్వాన్ని అందుకోవడానికి ఎప్పటికప్పుడు సాధన చేస్తుండాలి.


logo