శనివారం 06 జూన్ 2020
Devotional - May 19, 2020 , 00:05:42

జ్ఞాన స్వరూపుడు ఈశ్వరుడు!

జ్ఞాన స్వరూపుడు ఈశ్వరుడు!

‘ఓం నమః శంభవేచ మయోభవేచ

నమః శంకరాయచ

మయస్కరాయచ నమఃశివాయచ

శివతరాయచ॥’

ఇది శివుని మంత్రం. ఆద్యమూ, అనంతమూ, అంతటా వ్యాపించిన శక్తి స్వరూపమైన శివతత్త్వాన్ని తెలిపే మంత్రమిది. ప్రాపంచిక భోగభాగ్యాలతో కూడిన విభూతులూ, ఆనందాలు, మోక్షానికి సంబంధించిన ఆనందమూ శంకరుని స్వరూపమే. ఈ లోకంలో భోగభాగ్యాలు ఇచ్చేవాడు, పరలోకంలో మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించేవాడు, మంగళస్వరూపుడు అయిన శంకరునికి నమస్కారం. ‘శం’ అంటేనే మంగళం. అనంతమైన ఈ సృష్టి అంతటినీ ఆనందమయం కావించేవాడు శివుడే. ‘ఆ పరమ శివునికి నమస్కారం’ అంటుందీ మంత్రం.

శివారాధన వల్ల ‘సత్‌ అసత్‌"ల మధ్య భేదాన్ని అవగాహన చేసుకునే వివేకం కలుగుతుంది. ‘అజ్ఞానం నుంచి జ్ఞాన’ మార్గాన్ని చేరుకోగలం. ‘మరణం నుంచి అమరత్వం’ వైపు నడువగలుగుతాం. ‘శ‘కార ‘ఇ‘కార ‘వ‘కారాల సమ్మేళనం ‘శివ’ శబ్దం. ‘శ’కారం బ్రహ్మానందానికి, ‘ఇ‘కారం పరమ పురుషతత్త్వానికి, ‘వ’కారం ఆదిశక్తి తత్త్వానికి ప్రతీకలుగా ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు. పరమ పురుషుడు ఆదిశక్తితో కలువడంతో సంపూర్ణతను, సమగ్రతను సంతరించుకుంటాడు. ‘స్త్రీ పురుష శక్తులకు ప్రతీకగా, సచ్చిదానందమూర్తిగా విశ్వమంతటా ఈశ్వరుడు ఉన్నాడనే’ సత్యాన్ని ‘ఈశ్వరః సర్వభూతానాం’ అనడం ద్వారా ఋషులు తెలిపారు. ఏ పరిమితులకూ లోబడక విశ్వమంతా పరివ్యాప్తమైన శంకరుడిని ‘ఆదియోగి’గా యోగులు గుర్తిస్తారు. మనందరిలోని ఆలోచనాపూర్వకమైన శక్తితరంగాలు కళ్లకు కనిపించకున్నా సృష్టి అంతటా వ్యాపించి ఉంటాయి. అయితే, ఆ ఆలోచనాతరంగాల ఆవిర్భావానికి మూలమైన మహాశక్తియే శివం. శంకరుడు నిరంతర తపఃస్సమాధిలో ఉంటాడు. ఆ తపస్సులో అతనిచుట్టూ ఆవరించి ఉండి, అతడిని రమింపచేసే తపఃశ్శక్తియే ఉమాదేవి. ఆ శక్తియే ఆయన నుంచి వేరుచేయలేని చిచ్ఛక్తి. అందుకే, శంకరుని ‘అర్ధ నారీశ్వరుని’గానూ పేర్కొంటారు.

సత్వరజస్తమో గుణాల్లో శంకరుడు తమోగుణానికి ప్రతీక. ‘తమస్సు’ అంటే చీకటి. నిజానికి రూపం, భావం లేనట్టిది, ఆది-మధ్య-అంతములు లేనిది, శాశ్వతమైంది, అఖండమైంది, అనాదిగా ఉన్నది చీకటే. వెలుగు సృష్టితమైందే. సృష్టితమైంది శాశ్వతం కాదు. పోతన చెప్పినట్లుగా ‘లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది’ అలోకమైంది పెంజీకటి. పెంజీకటే సర్వవ్యాపితం. అదే శివస్వరూపం. ‘లోకంబులు’ అంటే సృష్టి, ‘లోకేశులు’ అంటే స్థితి, లోకస్థులు లయ. ఈ మూడింటికీ ఆధారమైన త్రిభువనుడూ శంకరుడే. ఈ పెంజీకటి కవతల జ్ఞాన రూపంలో వెలిగే ఈశానుడూ శంకరుడే.

‘అ’కార ‘ఉ’కార ‘మ’కార సంయోజనంతో ‘ఓం’కారంగా లేదా ప్రణవనాదంగా భాసిల్లే శివుడిని ఉపాసిస్తే ముక్తి లభిస్తుందని భారతీయ సనాతన ధర్మం చెబుతున్నది. ‘అ’కారం శివునికి, ‘ఉ’కారం అమ్మవారికి, ‘మ’కారం ఈ రెండింటి సమైక్య రూపానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అంతేకాదు, ‘అ’కారం సృష్టికర్తకు, ‘ఉ’కారం స్థితికారునికి, ‘మ’కారం లయకారునికి ప్రతీకలు. ఈ మూడూ తానే అయిన శివుడిని ఆరాధించడం వల్ల ఐహిక జీవితంలో ప్రగతి, ఆధ్యాత్మిక జీవితంలో సుగతి కలుగుతాయి. శివుడు ప్రమథగణాలకు అధినాయకుడు. ‘ప్రమథగణాలు’ అంటే ప్రకృతిలోని శక్తులు. ఇవి చాంచల్యత స్వభావమైన ఇంద్రియాల ఆకర్షణ వల్ల చెడు మార్గంలో నడిచే అవకాశం ఉన్నది. కాబట్టి, వాటిని అదుపుచేసేవాడు శంకరుడు.

భక్త సులభుడైన శంకరుడు శరణన్న వారి భయాలను తొలిగించి ఆహ్లాదాన్ని ప్రసాదిస్తాడు. ఈనాడు మహమ్మారియై ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా లాంటి వ్యాధి నుంచి మానవజాతిని రక్షించి శుభాలను అనుగ్రహించాలని, భారతదేశానికి సౌభాగ్యాన్ని, సకల జనులకు క్షేమ ైస్థెర్యాలను ప్రసాదించమని ప్రసన్నమూర్తి అయిన ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం.

-పాలకుర్తి రామమూర్తి, 94416 66943


logo