గురువారం 28 మే 2020
Devotional - May 17, 2020 , 22:26:57

ఆ అనంతశక్తియే ఆత్మ!

ఆ అనంతశక్తియే ఆత్మ!

అంగిరసుడు అమావాస్య చీకటిలో నల్లగా ఉన్న ఆకాశాన్ని, అక్కడ మినుకు మినుకుమంటున్న నక్షత్రాల గుంపులను పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు. తన మేథను ఈ అనంతమైన ఆత్మ తొలుస్తూ ఉండడంతో నిద్ర పట్టక నివాసగృహం నుండి బయటకు వచ్చి నిలబడ్డాడు. నట్టడవి నుండి నిశీధిలోకి కనులు సారించి ఉండగా, ఆ కనులమీదుగా అంగిరసుని జ్ఞానదృష్టి వినీలాకాశాన్ని ఆవరించి ఉన్న కారు చీకట్లలో సత్యాన్వేషణ ప్రారంభించింది. 

తన మేధస్సులో ఆత్మపట్ల ఆలోచనలు తీవ్రమైన ఒత్తిడితో చెలరేగుతున్నాయి. కళ్ళల్లో నక్షత్రాల పుంత నిశ్చలంగా ఉండగా, ఆలోచనల్లో అదృశ్యశక్తి అలజడి సృష్టిస్తున్నది. అనంతమైన ఆత్మ విస్తృతి ఎనలేనిదని తనకేనాడో అర్థమైనా, తనకు తానుగానే పుట్టి ఉన్న ఆత్మ ఏ విధంగా ఖగోళాన్ని సృష్టిస్తుందో ఆలోచిస్తున్నాడు. ఆత్మరూపంలోని అనంత శక్తి నిశ్చలంగా, నిశ్శబ్దంగా, ఎలాంటి అలజడి లేకుండా కోట్లాది నక్షత్ర సమూహాలను, వాటి నక్షత్ర కుటుంబాలను, వాటిద్వారా గ్రహాలను, వాటిద్వారా జీవులనూ సృష్టిస్తూ పోతుంది. 

అప్పుడు అంగిరసుడు ఈ విశ్వం ఎలా పుడుతుందో ఆశువుగా చెప్పాడు. ‘యథోర్ణ నాభి: సృజతే గృహ్ణతే చ/ యథా ఫృథివ్యామ్‌ ఓషధయ: సంభవంతి/ యథా సత: పురుషాత్‌ కేశలోమాని/ తథా క్షరాత్‌ సంభవతీహ విశ్వమ్‌'. ‘సాలెపురుగు ఎలా తన గూడును నోటినుండే వెలికితీసి తనలోకే తీసుకుంటుందో, భూమినుండి మూలికలన్నీ ఎలా ఉద్భవిస్తాయో, మానవుని తలమీదా, శరీరం మీదా ఏ ప్రయత్నం లేకనే వెంట్రుకలు ఎలా పెరుగుతాయో.. అలాగే ఆ అక్షరతత్త్వం నుండి ఈ విశ్వం ఉత్పన్నమవుతుంది’. తన శిష్యుడైన శౌనకునికి ఇదే విషయాన్ని చెప్పాలని అనుకుంటూ ఆత్మానందంతో లోపలికి నడిచాడు అంగిరసుడు.

ఆధునిక మానవుడూ ఓ నిశీధిరాత్రి అలాంటి ఆలోచనలతోనే ఆకాశంలోకి దృష్టిని సారించాడు. తను చదువుకున్న విజ్ఞానం ప్రకారం భూమి సూర్యుని చుట్టూ గంటకు దాదాపు లక్షా పదివేల కిలోమీటర్ల వేగంతో పరుగెత్తుతున్నా తాను గుర్తించలేకుండా ఉన్నాడు. సూర్యుడుకూడా గెలాక్సీ కేంద్రం చుట్టూ గంటకు ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నా ఆ అగ్నిగోళం మనకు నిదానంగా కదులుతున్నట్టే అనిపిస్తుంది. అతనికి మరో ఆలోచన కలుగగానే ఆశ్చర్య చకితుడయ్యాడు. భూమి తనచుట్టూ తాను తిరిగే వేగం, సూర్యుని చుట్టూ తిరిగే వేగం, సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ తిరిగే వేగం, ఇన్ని వేగాలు ఏకకాలంలో జరుగుతున్నా.. ‘మనిషి ఎందుకు గుర్తించలేక పోతున్నాడో’ ఆలోచిస్తున్నాడు. 

‘ఎందుకంటే, మనం భూమిలో అంతర్భాగం. భూమి సౌరకుటుంబంలో అంతర్భాగం’. అప్పుడు మనిషికి మరో ఆలోచన కలిగింది. ఇంత వేగంతో తిరుగుతుంటే ఈ గ్రహాలు, నక్షత్రాలు ఎక్కడో దూరంగా పడిపోవాలి కదా! అంటే, ఇవన్నీ పడిపోకుండా ఒడిసి పట్టే శక్తి ఏదో ఒకటి విశ్వంలో విస్తరించి ఉంది. ఆ శక్తిని శాస్త్రవేత్తలు ‘డార్క్‌ మేటర్‌' అని, ‘డార్క్‌ ఎనర్జీ’ అని రకరకాలుగా పిలుస్తున్నారు. ‘ఆ అనంతమైన శక్తిపట్ల తనకు అపారమైన ఆరాధన ఉన్నట్టుగా ఐన్‌స్టీన్‌ చెప్పాడు కదా!’ అనే ఆలోచనల్లో ఆధునిక మానవుడు తేలి పోతున్నాడు. ఆయన మస్తిష్కంలో అంతులేని శక్తి, దాని బలిమి, దాని సంపూర్ణత పూర్తిగా నిండిపోయాయి.

ఆ శక్తినే నాటి ఋషి పుంగవులు ‘ఆత్మ’ అన్నారు. ‘తత్యన్‌ అధర్వణుడు’ తన కుమారునికి ‘ఈశావాస్యోపనిషత్తు’ను బోధిస్తూ ‘తదేజతి తన్నైజతి తదూరే తద్వంతికే/ తదంతరస్య సర్వస్య తద్‌ సర్వస్యాస్య బాహ్యతః’ అన్నాడు. అది చలిస్తుంది- చలించదు, అది దూరంగా ఉంటుంది- దగ్గరగా ఉంటుంది. అది అన్నింటి లోపలా ఉంటుంది- అన్నింటి బయటా ఉంటుంది. ఆ ఆత్మ పూర్ణమైంది. పరిపూర్ణమైంది అని చెప్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆ బోధనలు పరంపరగా సాధకుల చెవులలో రింగుమంటూనే ఉన్నాయి. వారి మనసులు ఆనందంలో తేలియాడుతూనే ఉన్నాయి.


logo