శుక్రవారం 05 జూన్ 2020
Devotional - May 17, 2020 , 00:12:03

మరణ భయ నివారణ మంత్రం!

మరణ భయ నివారణ మంత్రం!

‘సంసృష్టం ధనము భయం సమాహృత మస్మభ్యం ధత్తాం వరుణశ్చ మన్యుః/ భియో దధానా హృదయేషు శత్రవః పరాజితా సో అపనిలయం తామ్‌’. ఈ వేదమంత్రం చాలా ప్రాచీనమైంది. మానవజన్మను సార్థకం చేసుకొని ఇహపర సంపదలు రెండింటితో సుఖజీవనం సాగించే విధానాన్ని తెలిపే మహా మంత్రమిది. ఇది వరుణ దేవుణ్ణి, యజ్ఞాన్ని గురించి చెబుతూనే, తద్వారా మానవులు శత్రుంజయులై వర్ధిల్లే విధానాన్ని వివరిస్తున్నది. 

పురాణాల్లో వరుణుడిని పశ్చిమ దిక్పతిగా, అష్టదిక్పాలకుల్లో ఒకడిగా పేర్కొన్నారు. అతను ఋగ్వేదకాలంలోని అతిప్రాచీన దైవం, సర్వేశ్వరుడు, సర్వనియంత, సర్వశక్తిమంతుడు. ఆ తర్వాతి కాలంలో త్రిగుణాతీతుడైన పరబ్రహ్మగా వర్ణితమైన సృష్టి మూలదేవత కూడా అతనే. దేవతలంతా ఆయననే ఆరాధించి వరాలను పొందుతారు. కనుక, ఆయనే వరుణుడని ‘గురుబాల ప్రబోధిక’ (అమరకోశం వ్యాఖ్య) నిర్వచిస్తున్నది. వరుణుడిని ఉభయలోక పాలకుడైన మహాదేవతగానూ ఋగ్వేదం అభివర్ణించింది. ‘వరుణుడు’ అనే మాటకు సూర్యుడు అనే అర్థం కూడా ఉన్నది. ఇది తర్వాత్తర్వాతే ఏర్పడి ఉంటుంది. సూర్యుని వల్లనే సమస్త జీవకోటి జీవిస్తుంది. కనుక, సూర్యారాధనకూ ప్రాధాన్యం ఏర్పడింది.

మానవుల అదృష్టాన్ని పై మంత్రం మొదటగా పేర్కొన్నది. జీవకోటికంతటికీ జీవనసంపద ఒక్కటే అయితే, ఒక్క మానవుల కోసం సంపద రెండువిధాలుగా ఉంటుంది. దీన్ని మానవులు గుర్తించడం చాలా ముఖ్యం. మిగతా ప్రాణులకు బతికి ఉన్నకాలంలోని అనుభవం, సుఖం ఒక్కటే. వాటికి పుణ్యపాపాలతో ప్రమేయం లేదు. ఆహార సంపాదనే వాటి జీవిత లక్ష్యం. స్వజాతి విస్తరణే వాటి విహార విధానం. అదే వాటికున్న ఏకైక సంపద. కానీ, మనిషికి దీనితోపాటు మరో విధమైన సంపద కూడా ఉన్నది. అదే మోక్ష సంపద. ఇహలోక సుఖం, దానితో తృప్తి పడటం మాత్రమే కాదు, మోక్షసాధనకు వరుణదేవుని అనుగ్రహం తప్పక కావాల్సిందే.

‘మన్యుదేవత’ కూడా ఈ మంత్రంలో ఉభయవిధ సంపదలను చేకూర్చేవాడుగా ఉన్నాడు. ‘మన్యు’ అంటే ‘యజ్ఞం’ కూడా. ఈ మన్యు శబ్దానికి సూర్యుడితోపాటు అగ్ని, రుద్రుడు అనే అర్థాలూ ఉన్నాయి. అగ్ని, రుద్రుడు కూడా వరుణదేవత వలెనే ఋగ్వేదమంత్రాల్లో ముఖ్యలైన వారు. నిజానికి అగ్ని అంటే సూర్యుడే. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌, శ్రియమిచ్ఛేత్‌ హుతాశనాత్‌'. సూర్యుడంటేనే ఆరోగ్యదేవత. సంపదలను ఇచ్చేవాడు. రుద్రుడు క్రోధ దేవత, లయకారుడూ. ఈ దేవతలు ఐహిక సంపదలతోపాటు మోక్షసంపదనూ వృద్ధి చేస్తూ మానవజాతిని పోషించమని వేడుకోవడం ఈ మంత్ర ప్రార్థనగా కనిపిస్తున్నది. ఐతే, ‘ఈ సంపదల సాధనకున్న అడ్డేమిటి?’ అంటే ‘భయం’ అని బోధపడుతున్నది. హృదయంలో నిరంతరం మానవులను బాధించేదీ, సుఖానికి దూరం చేసేదీ ఈ ‘భయమే’. మరణ భయం గురించి వేరే చెప్పక్కర్లేదు.

అయితే, ‘ఈ భయానికి కారణమెవరు? శత్రువులెవరు?’ అంటే, మనిషి హృదయంలోనే తిష్ఠ వేసుకొన్న ‘కామ క్రోధాద్యరిషడ్వర్గాలు. ‘కామం’ అంటే ‘అది కావాలె, ఇది కావాలె’ అనే కోరిక. ఇది ఒకదానితో ఆగేదీ కాదు. ఈ కోరికల పరంపరనే క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలకూ మూల కారణం. ఈ ఆరు శత్రువులనూ హృదయం నుంచి తరిమేస్తే ఇక మానవులకు ఇహలోకంలోగానీ, పరలోకంలోగాని భయమన్నదే ఉండదు. కనుకనే, ఈ ఋగ్వేద మంత్రం మానవులకు ప్రతి క్షణం భయాన్ని కలిగించే అరిషడ్వర్గాలనే శత్రువులను హృదయం నుంచి గెంటివేయమని ప్రార్థిస్తున్నది. ఇందుకు వరుణాది దేవతలే ఆరాధ్యనీయులు. ఈ కరోనా ఆపత్కాలంలో వారి ఆరాధనతో భయరహితులమై సుఖజీవన ఆనందాన్ని సాధిద్దాం..


logo