ఆదివారం 31 మే 2020
Devotional - May 17, 2020 , 00:14:08

నేడు పెద్ద హనుమజ్జయంతి అద్భుత దైవం అంజన్న!

నేడు పెద్ద హనుమజ్జయంతి అద్భుత దైవం అంజన్న!

భారతీయ భక్త సామ్రాజ్యానికి అధిపతి, పరమ భక్తాగ్రేసరుడు హనుమంతుడు. రామాయణ మహామాలారత్న ఈ వాయునందనుడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనమనే నవవిధ భక్తి మార్గాలలోనూ నిరంతరం రాముని సేవిస్తూ తనను తాను పునీతుణ్ణి చేసుకున్న ధీశాలి. కపివర శ్రేష్టుడీతడు. అనేక రకాలైన గొప్ప గుణాలీతనిలో ఇమిడిపోతుంటాయి. ధైర్యానికి, ఆరోగ్యానికి, ఆనందానికి వేదికగా మారి భారతదేశంలోని దాదాపు అన్ని ప్రదేశాలలోనూ ఘనంగా పూజలందుకొంటున్నాడీ రామదూత. 

మన మనస్సు బలహీన పడుతున్నప్పుడు, ఇంట్లో పిల్లలు భయపడుతున్నప్పుడూ హనుమంతుని స్మరించుకొమ్మని, హనుమంతుని దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయమని చెప్పడం సంప్రదాయం. హనుమంతుడు, అంజనాసూనుడు, వాయుపుత్రుడు, మహాబలుడు, రామేష్టుడు, ఫల్గుణ సఖుడు, పింగాక్షుడు, అమిత విక్రముడు, ఉధధిక్రమణుడు, సీతాశోక వినాశకుడు, లక్ష్మణ ప్రాణదాత, దశగ్రీవ దర్పమణచినవాడనే ద్వాదశ నామాలను గుర్తు చేసుకున్నంత మాత్రాన మనం చేసే ప్రయాణమార్గ లోపాలు మాత్రమేకాక జీవనయాత్రలోని కర్మదోషాలు కూడా తీరి ప్రశాంతతను పొందుతామని ప్రగాఢ విశ్వాసం. అందుకే, నిరంతర స్మరణీయుడీ హనుమంతుడు.

నిరంతరం మనకన్నా ఉన్నతశక్తిని స్మరించడం వల్ల మనకు శక్తి సమకూరుతుంది. తాము ఉన్నతశక్తితో నిరంతరం కలిసి ఉండటం వల్ల తమను ఆధారం చేసుకున్న వారికి తాము బలాన్ని ఇవ్వగలరు. హనుమంతుడు నిరంతరం శ్రీరాముని ఆధారం చేసుకుని, ఆయన నామస్మరణతోనే గడిపిన భక్తశ్రేష్టుడు. మనమందరం హనుమంతుని స్మరిస్తే ఆతడు రాముని ద్వారా పొందే శక్తిని మనం పొంది మరింత ఉన్నతమైన, ఉత్తమమైన జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది. హనుమంతుడు నిరంతర రామనామ స్మరణవల్ల సాధించిన గుణవిశేషాలను ఒకసారి విశ్లేషించుకుంటే, హనుమత్‌ స్మరణావశ్యకత తెలుస్తుంది. 

‘బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వా మరోగతాఅజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్‌ స్మరణాత్‌ భవేత్‌'

ఎవరిలో ఏ శక్తి ఉంటే ఆ శక్తిని మనం ఉపాసించే అవకాశం ఉంటుంది. ఆంజనేయునిలో ఉన్న వేర్వేరు శక్తులను మనం స్మరించుకోవడం ద్వారా మనకూ చాలా సుగుణాలు అబ్బుతాయి. అంతరంగ చతుష్టయంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగూ ఉంటాయి. ఈ నాలుగింటిలోనూ రాముణ్ణి మాత్రమే నింపి ప్రశాంత జీవనాన్ని సాధించే  బుద్ధిమంతుడైన హనుమంతుని నిరంతరం స్మరిస్తే మనకు బుద్ధిశక్తి పెరుగుతుంది. బుద్ధివల్ల విశ్లేషణ పెరుగుతుంది. వివేకవంతుడు అవుతాడు. బుద్ధి పెరిగిన వానికి కామక్రోధ రూపమైన మోహనాశనం అవుతుంది. కొండలను పిండిచేయగల శక్తికూడా మన మనస్సుకే ఉంది. నిరంతరం బలాన్ని ఉపాసించే వాడే బలవంతుడు. సృష్టిలో అన్నింటికన్నా బలమైంది చైతన్యమే. ఆ చైతన్యమే శ్రీరామరూపం. ఆ రూపాన్ని, ఆ భావాన్ని నిరంతరం ధ్యానించే తత్త్వమే హనుమంతుడు. మనస్సును నిరంతరం చైతన్యం వైపు మళ్ళించేవాడు దేహపరంగా, మనోపరంగా బలవంతుడవుతాడు. అటువంటి బలవంతుల స్వరూపమే హనుమ. అతణ్ని స్మరించేవారు కూడా బలవంతులే. 


ప్రతి మనిషి ఇహలోకంలో జీవనం సాగిస్తూ వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. కొన్ని ఈ జీవిత నిర్వహణ కోసం కాగా, మరికొన్ని సమాజం, ప్రకృతి, పశుపక్ష్యాదులకు హితమైన కార్యక్రమాలు. వీటివల్ల పూర్వకర్మల ప్రభావాలు తొలగి, చిత్తం శుద్ధి అవుతుంటుంది. ఇటువంటి పనులే నిరంతరం చేసేవాడు ‘అమృతమయుడు’ అవుతాడు. వాడికి చావు ఉండదు. శరీరం మరణించినా ఏదో రూపంలో జనాల హృదయాలలో అతను నిలిచిపోతాడు. అలా పొందే దానిని ‘యశస్సు’ అంటాం. హనుమంతుడు నిరంతరం రాముణ్ణి మాత్రమే స్మరిస్తూ, లోక వ్యవహారాలన్నీ రామమయంగా భావించిన వాడు. మనస్సు నిరంతరం చైతన్యంతోనే సంగమించినపుడు ఇక మరణం ఎక్కడ ఉంటుంది? అందుకే, హనుమ ఉపాసన మనకు అత్యంత శుభదాయకం. 

మనసు గొప్ప శక్తి.. ధైర్యం. ఇదికూడా బుద్ధి (ధీ)కి సంబంధించిందే. మనిషికి నిరంతరం కావలసింది కూడా అదే. ఇది కోల్పోయినప్పుడు మనం అన్నీ కోల్పోతాం. ధైర్యమున్నవారు ఈ లోకంలో సాధించలేనిదేదీ లేదు. మనస్సు బలహీనమైన వారు ఏమీ చేయలేరు. నిరంతరం రామశక్తితో కలిసి ఉండే హనుమంతుడు కార్యసాధకుడు. రామ కార్యాల నిర్వహణలో ధైర్యమే శక్తిగా, దేహంగా ఉన్నవాడు. అందుకే, హనుమత్‌ స్మరణ అన్నివేళలా మనకు ధైర్యాన్నే ఇస్తుంది. భయం మనిషిని కుంగదీస్తుంది. మనసుకు ఉన్న వ్యతిరేక కోణాలలో భయం ఒకటి. నిర్భయత్వం మనిషిని మనీషిని చేస్తుంది. ఏ కాలంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఎటువంటి సందర్భంలోనైనా తాను శక్తి స్వరూపమని భావించిన మనస్సు మాత్రమే ఎన్నో కార్యక్రమాలను ఆనందంగా నిర్వహిస్తుంది. భయం వల్ల తమకున్న శక్తులన్నీ కోల్పోతారు. భయరహితులుగా ఉంటే తమ శక్తులన్నీ వృద్ధి చెందుతాయి. భయ రహితుడై, ఎందరో రాక్షసులను అణచివేసిన హనుమను నిరంతరం స్మరించే వారు కూడా భయరహితులై జీవించినంత కాలం సంతోషంగా ఉండగలుగుతారు.

రోగం శరీరానికి, మనస్సుకు రెండింటికీ ఏర్పడుతుంది. రోగాలన్నీ శరీరానికన్నా ముందుగా మనస్సుకే వస్తాయి. రోగనిరోధక శక్తి ఉన్నవాని దగ్గరకు ఏ రోగాలూ చేరవు. రోగనిరోధక శక్తి మాత్రమే మనకున్న చైతన్యం. ఆ చైతన్యాన్ని ఆశ్రయించిన వాడు హనుమంతుడు. అందువల్ల హనుమంతుని స్మరణ మన మనస్సుకుకూడా శక్తిని పెంచి రోగరహితుణ్ని చేస్తుంది. శరీరం జడం. మనస్సు, ఆత్మలు చైతన్యాలు. మనస్సు శరీరాన్ని ఆశ్రయించినపుడు జడత్వాన్ని, చైతన్యంతో నిరంతరం సంగమించినపుడు జడరహితమవుతుంది. జాడ్యం శరీరగుణం. మనస్సు దీనివైపు దృష్టి కేంద్రీకరించకూడదు. హనుమంతుడు నిరంతరం శ్రీరామ భావనాత్మకమైన చైతన్యంతోనే సంగమించి ఉండేవాడు కావడం వల్ల చైతన్య స్వరూపంగా మారినవాడు. హనుమంతుని స్మరణ మనలోని జడత్వాన్ని తొలగించి చైతన్యవంతులను చేస్తుంది. 

వాక్కు నాలుగు రకాలు. పరావాక్కు, పశ్యంతీవాక్కు, మధ్యమావాక్కు, వైఖరీవాక్కు. సమయానుకూలంగా వ్యక్తమైన వాక్కు వైఖరీవాక్కు. దీనికి మూలాలను శోధిస్తే శక్తి (పరా) కారణమవుతుంది. మనస్సు శక్తివంతమైనప్పుడే వాక్‌ ప్రకటన అద్భుతమౌతుంది. వారి వాక్కు లోకానికి హితకరమవుతుంది. హనుమంతుడు వాగ్మి. అవసరానుకూలంగా, స్పష్టంగా, సమయోచితంగా మాట్లాడగలిగేవాడు. అందుకే, 

హనుమంతుని స్మరణ మనకు వాక్పటుత్వాన్ని కలిగిస్తుంది.

ఆత్మే రాముడు, మనసే హనుమ!

ఎవరిలో ఏ శక్తి ఉంటే ఆ శక్తిని మనం ఉపాసించే అవకాశం ఉంటుంది. ఆంజనేయునిలో ఉన్న వేర్వేరు శక్తులను స్మరించుకోవడం ద్వారా మనకూ చాలా సుగుణాలు అబ్బుతాయి.

హనుమంతుడు మన మనస్సుకు ప్రతీక. కోతిగా హనుమంతుని భావిస్తే రామునికి, రామనామానికి దూరమైన హనుమంతుడు కూడా సాధారణమైన కోతి లాంటివాడే. మన కోతివంటి మనస్సుకు ప్రతీకనే. రామనామానికి సన్నిహితమైన హనుమంతునికి ఎన్నో విశేష గుణాలు ఉన్నాయి. మనలోని చైతన్యం, శక్తి మన మనస్సుకు ఎప్పటికీ తెలియదు. తగినంత ప్రోత్సాహం లభిస్తే సముద్రాన్ని కూడా లంఘిస్తారని చెప్పడానికి హనుమంతుని గాథనే ప్రత్యక్షర సాక్షి. మనలోని ఆత్మ రాముడైతే, మన మనస్సు హనుమంతుడు. ఆత్మ (శక్తి, చైతన్యం) చుట్టూ మనస్సు (హనుమ) సంచరించాలని చెప్పడమే హనుమత్‌ వృత్తాంతం. సూర్యుడు ఆత్మ స్వరూపుడు కాబట్టి, హనుమంతుడు సూర్యుని వద్ద తన విద్యలన్నీ నేర్చుకుని నవ వ్యాకరణ పండితుడైనాడని పురాణగాథలు చెబుతున్నాయి.

అంటే, మనస్సు నిరంతరం ఆత్మకు సన్నిహితమైతే జ్ఞానం, తెలివి, ప్రకాశం, చైతన్యం మనకెప్పటికీ ఏర్పడతాయని చెప్పే విశేషమిది. ‘హనుమజ్జయంతి’ కూడా మనకిచ్చే సందేశమిదే. నిరంతరం మన మనస్సును చైతన్యంతో నింపాలి. శక్తివంతులం కావాలి. శక్తియుత వ్యవస్థ ఏర్పడాలి. ఆత్మపైనే విశ్వాసం పెంచుకోవాలి. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. హనుమంతుని స్మరణతో ఆత్మనిర్భరులమై ప్రపంచానికి మార్గదర్శకులం కావాలి. అందుకే ఆ వాయుపుత్రుని, పవమాన నందనుని నిరంతరం భావిద్దాం. స్మరిద్దాం.


logo