శనివారం 30 మే 2020
Devotional - May 15, 2020 , 23:10:29

శివశక్తే సృష్టికి మూలం!

శివశక్తే సృష్టికి మూలం!

‘ఏకం అద్వితీయ బ్రహ్మం’ అన్నది వేదం. ప్రపంచాన్ని నడిపేటప్పుడు అనేక రూపాలుగా కనపడినా భగవంతుడొక్కడే. ‘ఏకో దేవః సర్వభూతేశ గూఢయా’ అని ఉపనిషత్తు చెప్పింది. సర్వభూతా ల్లో ఉన్న దేవుడు ఒక్కడే. మన శరీరంలో రహస్యంగా కొన్ని ఉన్నాయి ఉదాహరణగా ప్రాణం. అది ఉందని తెలుసు కానీ, చూపించమంటే చూపించలేం. అదేవిధంగా, ప్రాణులన్నింటిలో ‘పాలలో దాగున్న వెన్నలా’ కనపడకుండా ఉండేవాడే దేవుడు. ‘డు’ అంటే పుంలింగం. మరి, ‘దేవుడు పుంలింగమా, స్త్రీలింగమా’ అనే ప్రశ్నకు ‘పుంరూపం వా స్మరేత్‌ దేవం/ స్త్రీ రూపం వావి చింతయేత్‌/ అధవాం నిష్కళాం ధ్యాయేత్‌/ సచ్చిదానంద లక్షణం’. అంటే, సచ్చిదానంద లక్షణమే భగవంతుడు. స్త్రీ రూపంలోగాని, పురుష రూపంలోగాని, ఆ రెండూ గాని, అమృతత్వంలోగాని భగవంతుని ఆరాధించవచ్చు.

‘సత్‌' అంటే శాశ్వతమైంది. ‘చిత్‌' అంటే చైత న్యం. చైతన్యంతో కూడిన ఆనందమే భగవంతు డు. అదే సచ్చిదానంద రూపం. భారతీయ సనాతన ధర్మాలన్నింటికీ వేదాలే ఆధారాలు. ఆ వేదసారాన్ని అందించేవే పురాణాలు. పురాణాలు అంటే ప్రాచీనమైనా నిత్యనూతనమైనవి. అవి లేకుంటే మన భారతీయ సంస్కృతి నిలిచేదే కాదు. కొన్ని విష్ణువుకు సంబంధించినవి, కొన్ని శివునికి సంబంధించినవి, కొన్ని దేవికి సంబంధించినవి. మనలాంటి సామాన్యులకు ఒకరు గొప్పని, ఒకరు తక్కువని వాదోపవాదాలు రావచ్చు. పురాణాలన్నింటినీ రాసిన వ్యాసుడు పరమాత్మ ఒక్కడేనని, కొమ్మలెన్నున్నా వృక్షమొక్కటెట్లో, పండ్లెన్ని ఉన్నా వాటి మాధుర్యం ఒక్కటైనట్లు అన్ని పురాణాల సారాంశం ‘ఏకో బ్రహ్మ’ని సదా మననం చేసుకోవాలి.

‘సృష్టికి పూర్వం ఏముంది?’ అంటే, అది అం తుపట్టనిది. వెలుగు, లేకుంటే చీకటి ఉండాలి. చీక టి, లేకుంటే వెలుగు ఉండాలి. మరి, ఈ రెండూ లేవు. ఏదో ఒక చైతన్యం ఉంది. అదే శివం. ఆ చైతన్యపూరిత శివం ‘ఒక్క నేనే ఎన్నో’ కావాలనుకున్నాడు. ఒక సంకల్పం. అంటే, వ్యర్థం కాని కోరిక. అది క్రియా రూపం పొందాలంటే శక్తి కావాలి. పరమేశ్వరునికి ఆ శక్తి ఎవరో ఆపాదించుకున్నదో, కొని తెచ్చుకున్నదో కాదు, సహజమైం ది. ఆ రెండూ వేరు వేరు కాదు. సూర్యునికి కాంతి వలె, చంద్రునికి వెన్నెల వలె ఏకంగా ఉన్న శివశక్తే సృష్టికి మూలం. ఆ శక్తి పేరే ‘దేవి’ అని వేదం చెప్పింది. వేదరూపమే దేవి. ‘కడుపు చల్లంగ వేదాల కన్నతల్లి’ అంటాడు శ్రీనాథ కవి.

శక్తి లేనిదే పరమేశ్వరుడు ఏమీ చేయలేడు. అగ్నిలో మండటం గాని, గాలిలో కదలిక గాని, విత్తనం మొలకెత్తాలన్నా, సముద్రంలో అలలు ఎగిసిపడాలన్నా అనేక రీతులుగా ప్రేరేపించి, ప్రకాశించేదే శక్తి. లోకంలో శక్తి లేని వస్తువు గౌరవాన్ని పొందదు. ఆ శక్తినే ‘అమ్మా’ అంటాం. అందుకే సృష్టి, స్థితి, లయలకు కారకురాలు ఆ దేవియే. ‘తల్లి’ అంటే తరింపచేసేది. సర్వ ప్రపంచాన్ని తన కన్నబిడ్డలుగా లాలిస్తూ, పాలిస్తూ ‘ఈ సృష్టి నాది’ అని చెప్పగలిగిన విశ్వజనని అమ్మ. లోకంలో సామాన్య మానవులం కల్పించుకున్న ఎన్నో భేదాలకు అతీతమైన, అత్యున్నతమైన స్థితి అమ్మది. అందుకే, ఆ తల్లి అద్వైతమూర్తి.

చెరకు గడ ఎక్కడ కొరికినా తీయదనమిస్తుంది. అమ్మను ఎవరు కొలిచినా కరుణిస్తుం ది. అందుకే, సర్వసృష్టికి కారణం అమ్మనే. ఆమెనే ఆరాధిస్తున్నాం. కష్టా న్ని ఆర్తితో చెబితే వినే ఓర్పు, తీర్పు అమ్మ దగ్గరే ఉంటుంది. రాశీభూతమై న కారుణ్యం చూపగలిగేది అమ్మ ఒక్కతే. దయ అనేది స్త్రీకి అన్వయం అయినట్లు పురుషుడికి కాదు. అందు కే, వేదం మొదట అమ్మకే నమస్కా రం చేయించింది. ‘నన్ను అనుగ్రహించడానికే నా ఇంట లక్ష్మి వలె పుట్టింది. ఈ బిడ్డ నా ఇంట ఉండదు. నారాయణమూర్తిని వెతుక్కుంటూ ఆడికే వెళ్లిపోతుంది. ఈ పిల్ల ఆడపిల్ల’ అంటాడు పార్వతీదేవి పుట్టినప్పుడు హిమవంతుడు. పురుషుడు ఒక్క వంశాన్ని ఉద్ధరిస్తే ఆడది రెండు వంశాలను ఉద్ధరిస్తుంది. అంటే, గోత్రం పేరు, ఇంటిపేరునూ మార్చుకొని వేరే వం శాన్ని ఉద్ధరించటానికి వెళ్లే త్యాగమూర్తి. ఆ మూర్తి అక్కడ మాతృమూర్తిగా మారుతుంది. ఇదే మాతృత్వపు గొప్పదనం. 


logo