శుక్రవారం 07 ఆగస్టు 2020
Devotional - May 14, 2020 , 22:57:13

క్షమ.. వీరుని లక్షణం

క్షమ.. వీరుని లక్షణం

ప్రతి మనిషీ తన శ్రేయస్సు కోసమే కాకుండా జీవన సార్థకతకూ ధార్మికమైన జీవనాన్ని తప్పక అలవాటు చేసుకోవాలి. ఇది అత్యంత అవసరమేకాక అనివార్యం కూడా. భారతీయ ధర్మశాస్ర్తాలలో ఎన్నదగినదైన ‘మనుధర్మం’ ఎలాంటి పక్షపాతం లేకుండా మనుషులందరికీ సమానంగా వర్తించే పది ధార్మిక లక్షణాలను సూచించింది. మానవులంతా వాటిని పాటించడం వల్ల ‘ఉత్తమ సమాజం’ ఆవిర్భవిస్తుంది. మనిషి జీవనాన్ని అత్యంత సుఖదాయకంగా మార్చడమే ఇందులోని అసలు లక్ష్యం. 

‘ధృతిః క్షమా శమాస్తేయం శౌచమింద్రియ నిగ్రహః / ధీర్విద్యా సత్యమక్రోధః దశకం ధర్మ లక్షణమ్‌’. 

ధృతి, క్షమ, శమ, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీ (బుద్ధి), విద్యా, సత్యం, అక్రోధం.. ఇవి ధర్మానికి చెందిన పది లక్షణాలు. ఇవన్నీ ఏ మతానికి, వర్గానికి, మార్గానికి పరిమితం కాకుండా మనుషులందరికీ విధిగా వర్తించేవి. ఆచరణ యోగ్యమైనవి కూడా. ఫలితంగా సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 

‘ధృతి’ అంటే ధైర్యం. ఎవరివద్ద ధైర్యం వుండదో వారు ఏ కార్యాన్నయినా సాధించలేరు. ధైర్యవంతులు తమ కార్యసాధనలో చలించకుండా నిలుస్తారు. జనుల నిందలకు, ధనలాభానికి, నష్టాలకు, ప్రాణాపాయానికి భయపడకుండా న్యాయమార్గంలో తమ కార్యాన్ని సాధిస్తారు. దశ ధర్మాల్లోని రెండవ లక్షణమైన ‘క్షమ’ వీరుని లక్షణం. నింద, స్తుతి, హాని, లాభం, సుఖం, దుఃఖం వంటి ఎలాంటి స్థితిలోనైనా ఓర్పుతో వ్యవహరించే మనోభావమే క్షమా గుణం. తర్వాతి లక్షణమైన ‘శమ’ అంటే శాంతిగా ఉండటం. మన ఋషులు, విద్వాంసులు ఎప్పుడూ ప్రజలకు శాంతిమార్గాన్నే బోధించి, నిర్దేశించారు. శాంతితో చేసే ప్రతి ఆలోచన, పని తప్పక విజయవంతంగా పూర్తవుతాయి. 

‘స్తేయం’ అంటే దొంగతనం. దీనికి వ్యతిరేకమే ‘అస్తేయం’. దొంగిలించడం అంటే పరుల వస్తువులను వారి అనుమతి లేకుండా తీసుకోవడం. అందుకే, చెప్తారు ‘పరద్రవ్యేషు లోష్టవత్‌'. ఇతరుల ద్రవ్యాలను లోష్టము (గడ్డి పరచకంటే హీనం)లాగా భావించాలి. ‘శౌచ’మంటే శుచిగా ఉండటం. దీనిని ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఆచరిస్తున్నాం. కరోనా మహమ్మారి ఎప్పుడైతే ఆరంభమైందో అప్పట్నించీ మనుషుల మధ్య, పరిసరాలలో శుభ్రతను, సామాజిక దూరాన్ని పాటించడం అనివార్యమైంది. దీనిని మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే ఉపదేశించారు. ‘ఇంద్రియ నిగ్రహం’ అంటే ‘మనసు మొదలుకొని ప్రతి ఇంద్రియాన్నీ మన అధీనంలో ఉంచుకోవడం. ఇది ఎంతో నిగ్రహంతోనే సిద్ధిస్తుంది. అలా సాధించడాన్నే ‘జితేంద్రియః’ అని అంటారు. ‘ధీ’ అంటే ‘బుద్ధి’ అని అర్థం. ఇదే ధారణశక్తి. ఇది చాలా ముఖ్యమైనది. బుద్ధిపూర్వకంగా మనకు మంచి ఆలోచనలు వస్తేనే మహాత్ములంతటి వాళ్లమవుతాం. ‘బుద్ధిం యా నః ప్రచోదయాత్‌' అంటే, బుద్ధి మంచివైపు ప్రయాణించాలి.

మనిషిని జీవితంలో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లడంలో అత్యంత ప్రధానమైనది విద్య. ఇది మరో రకంగా ‘జ్ఞానం’. ‘విద్‌' అనే ధాతువు నుంచి పుట్టిందే విద్య. అంటే తెలుసుకోవడం. ‘ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మమో’ తెలుసుకొనే వస్తుజ్ఞానాన్ని ఇచ్చేదే విద్య. భారతీయ ధర్మాలలో ప్రధానమైంది సత్యం. వేదాలలో వింటుంటాం ‘సత్యం వద’ అని. అంటే, సత్యమే మాట్లాడాలి. సత్య వాక్పరిపాలన కోసం రాజ్యాలు, భోగభాగ్యాలను విడిచి పెట్టిన వారి ఉదంతాలు పురాణాల్లో చదివాం. హరిశ్చంద్రుడు ఒక మంచి ఉదాహరణ. క్రోధానికి వ్యతిరేకమే అక్రోధం. క్రోధం మన నుండి అధర్మం, అన్యాయం, పాపం వంటి పనులను చేయించి, మనలను అనవసరంగా ఇబ్బందుల పాలు చేస్తుంది. క్రోధంలో వివేకం నాశనమవుతుంది. వివేచన (బుద్ధి) లేకుండా చేసే ప్రతి ఆలోచన, కార్యం సర్వనాశనానికి దారితీస్తుంది. ఇలా ఈ పది ధర్మ లక్షణాలను ప్రతి ఒక్కరూ ఆచరించడం అత్యంత ముఖ్యం. అప్పుడే ఆరోగ్యకరమైన ఉత్తమ సమాజం నిర్మాణమవుతుంది.


logo