గురువారం 28 మే 2020
Devotional - May 13, 2020 , 22:50:26

గొప్ప రామభక్తుడు గోస్వామి!

గొప్ప రామభక్తుడు గోస్వామి!

రామనామామృత పానమే జీవితమై తరించిన గొప్ప రామభక్తుడు కవి గోస్వామి తులసీదాసు. భారతీయ సంస్కృతి రామాయణంలో అంతర్లీనంగా పొదిగి ఉన్న విధానాన్ని ప్రచారం చేసిన దాసభక్తి ఆయనది. తులసీదాసు రాసిన ‘రామచరిత మానస్‌' ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. దీన్ని ఉత్తర భారతంలో ‘తులసీ రామాయణం’గా పిలుస్తారు. వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, ప్రసన్న రాఘవం, భగవద్గీత, హనుమచ్చరిత్ర, శివపురాణం ఎన్నింటిలోనో గల ప్రత్యేకతలను క్రోడీకరించి ‘రామచరిత మానస్‌"గా తులసీదాసు తీర్చిదిద్దడం విశేషం. రామనామమే మనసు నిండా నింపుకొని తరించిన ఆ భక్తుని జీవితం కూడా విశేషాలమయమే.

ప్రయాగ సమీపంలో రాజాపురంలో ఆత్మారాం డూబే, శ్రీమతి హులసి దంపతులకు తులసీదాస్‌ జన్మించారు. తల్లి గర్భంలో పన్నెండు నెలలు ఉండటం, పుట్టుకతోనే ‘రామ్‌' శబ్దం పలుకటం, ముప్పది రెండు పళ్లు, పెద్ద ఆకారం.. అన్నీ విచిత్రాలే. పుట్టిన సమయం మూలా నక్షత్రం కావటం తో లోకుల అవాకులు చెవాకులు విని తండ్రి వణికిపోయాడు. తల్లి హులసీ దాది చునియా చేతిలో పసిపాప నుంచి ప్రాణం విడిచింది. కొన్నాళ్లకు తండ్రి, ఐదేళ్లకు దాది చునియా మృతి చెందటంతో అనాథ బాలుడయ్యాడు. ‘ముసలి ముత్తయిదువ రూపంలో అమ్మవారే కొన్నాళ్లు కడుపు నింపిందని’ జనశ్రుతి గాథలతో పాటు రామచరిత మానస్‌ పీఠిక చెబుతున్నది. రామశైలానికి చెందిన అనంతానందజీ శిష్యుడు నరహరి చేరదీసి ‘రామ్‌బోలా’ అన్న పేరు పెట్టి ఉపనయనం చేశాడు. ఏది విన్నా ఒకేసారికి గుర్తుపెట్టుకోగల చురుకైన తులసీదాసుకు నరహరియే రాముని చరితం, వేదం, శాస్త్ర పురాణాలు చెప్పారు. పదిహేనేండ్లకే రామచరిత ప్రవచనాన్ని తులసీదాసు అనర్గళంగా చెప్పేవాడు.

రత్నావళితో పెళ్లయింది. తనకోసం తనవెంటే తిరిగే తులసీదాసును భార్య వ్యంగ్యంగా విమర్శించటం అతనిని వైరాగ్యం బాట పట్టించింది. తీర్థయాత్రలు చేస్తూ సాధువయ్యాడు. కాశీకి చేరి రామచరిత ప్రవచనం చెప్పేవాడు. రోజూ ప్రవచనం కాగానే పూజ చేసిన నీళ్లు ఒక చెట్టు మొదట్లో పోసేవాడు. ఒకరోజు చెట్టుపై ఉన్న బ్రహ్మ రాక్షసుడికి శాపవిముక్తి కలిగి మనిషయ్యాడు. తులసీదాసుకు నమస్కరించి ‘తనకు సహాయం చేసినందుకు మీకేమి చేయాలని’ తులసీదాసును అడుగుతాడు. ‘రామ దర్శనం కావాలని’ తులసీదాసు కోరుతాడు. ‘ఆంజనేయుడిని దర్శించమని, ఆయన రామదర్శనం చేయిస్తాడని’ చెప్పి అతను వెళ్లిపోయాడు. నిత్యం ప్రవచనం వినే ముసలి బ్రాహ్మణుడు హనుమద్దర్శనం చేయిస్తాడు.

‘చిత్రకూటంలో రామచరితం ప్రవచనం చేస్తే రామ దర్శనం చేయిస్తానని’ ఆంజనేయుడు కలలో చెబుతాడు. తులసీదాసు చిత్రకూటం చేరి ప్రవచనాలు చేస్తుంటాడు. ఇద్దరు చిన్నపిల్లలు బాణాలతో ఆడుతుంటే తులసీదాసు పట్టించుకోడు. మారుతి కలలో కనిపించి ‘వారే రామ లక్ష్మణులు’ అని చెప్పటంతో బాధపడుతాడు తులసీదాసు. మరొక్కసారి ఒక బాలుడు వచ్చి ‘బాబా! మాకు చందనం పూయవా’ అని అడుగుతాడు. కపివరుడు చిలుకరూపంలో వచ్చి ‘చిత్రకూటకే ఘూట్‌ పర్‌ భ ఇ సంతన బీర్‌/ తులసిదాసు చందన ఘిసే తిలక్‌ దేత్‌ రఘువీర్‌' అని పలుకుతాడు. తులసీదాసుకు రాముని దర్శనమవుతుంది. కళ్లు చెమ్మగిల్లి మూర్చపోతాడు. అయోమయం, ఆనందంతో ఏమీ అర్థంకాక తులసీదాసు అయోధ్యకు వెళ్లి ఋషులను సేవించి తన కథ చెప్పుకుంటాడు. కలలో శివపార్వతులు ‘బ్రాహ్మణ దంపతులు’గా దర్శనమిస్తారు. రాముని చరితం కథారచన చేయమని కోరుతారు. తులసీదాసు కాశీ చేరి కథారచన ఆరంభిస్తారు. రెండేండ్ల ఏడు నెలల ఇరువై ఆరు రోజుల్లో దాన్ని పూర్తిచేస్తారు.

‘సమాజంలో దుఃఖాన్ని తొలిగించేందుకు భక్తి, జ్ఞానం అనే రెండు మార్గాలున్నాయి. వాటిలో భక్తే నాకు ఇష్టం’ అంటారు తులసీదాసు. రామభక్తుడిగా, ప్రవచన, ప్రచారకుడిగా, జాతిని ధర్మమార్గంలో నడిపిన తపస్విగా, భారతీయ సంస్కృతి ప్రతినిధిగా రామనామ స్మరణలో లీనమై తరించిన గొప్ప రామభక్తుడు తులసీదాసు. ఆయన రచనలు రామచరిత మానస్‌, హనుమాన్‌ చాలీసా భక్తకోటికి పఠనీయ, ఆచరణీయ మార్గదర్శకాలు.


logo