ఆదివారం 31 మే 2020
Devotional - May 12, 2020 , 23:49:33

రామాయణ సుభాషితం

రామాయణ సుభాషితం

మనిషి జీవితం ఒడిదుడుకులు లేకుండా, ఋజు మార్గంలో సాగడానికి హితవాక్యాలూ, పెద్దలు చెప్పే మంచిమాటలు, సూక్తులు ఎంతో దోహదం చేస్తాయి. అవి మానవుడిలో స్ఫూర్తిని పెంచి, జీవితాన్ని సరైన దృక్పథంతో మలుచు కోవడానికి కొంతవరకు ఉపయోగపడుతాయి. కాలానికి వీగిపోని అలాంటి ఎన్నో గొప్పనైన హితోపదేశాలను మహాకవి వాల్మీకి శ్రీ మద్రామాయణంలో పొందుపరిచారు.

మూలకథను నడిపిస్తూనే పాత్రోచితంగా, వాటిమధ్య సంభాషణల రూపంలో మనకు ఎన్నో సందేశాలను, కొన్ని సూటిగా, కొన్ని అన్యాప దేశంగా, ఆయా పాత్రలు ఆచరించినట్టుగానే చూపి మానవాళికి మహోపకారం చేశారు ఆ మహాకవి. ‘తండ్రి మాటను ఆచరించడమే ముఖ్య ధర్మమని’ శ్రీరాముడు, ‘అన్నమాట జవదాటని తమ్ముళ్లు’, ‘ధర్మాచరణ ప్రాముఖ్యాన్ని’ తెలియజేస్తూ ‘ఇది తమకే కాక సమస్త మానవాళికీ శిరోధార్యమని’ చెప్తారు. ‘మానవాళికి క్షమాగుణమే గొప్ప అలంకారమని, దానం, యజ్ఞం, కీర్తి, చివరికి ధర్మమూ క్షమకు ప్రతిరూపాలు’ అని హితవు పలుకుతారు. మరోచోట ‘మానవ ప్రయత్నం కన్నా దైవేచ్ఛయే మిన్న. అన్ని కష్టసుఖాలకు దైవాశ్రయమే సరైన దారి’ అన్న సందేశం ఉంటుంది.

రామలక్ష్మణ సంవాద నేపథ్యంలో ఎన్నో సుభాషితాలు కనిపిస్తాయి. పురుషార్థాలన్నీ ధర్మాచరణం వల్లే లభిస్తాయని, కఠోర నియమా లను అనుసరించి తపస్సు చేసే ఋషులు కూడా ఒక్కొక్కప్పుడు ధర్మం తప్పి కోరికలలో, మోహంలో పడి భ్రష్టులు కావడం, కార్యభంగాలు జరుగడం వంటివన్నీ దైవ నిర్ణయాలని అంటారు. ‘ఆత్మీయులు తిరిగిరావాలని కోరుకోవాలి గానీ, వారిని ఎక్కువ దూరం సాగనంపకూడదు’ అని దశరథుడి ద్వారా, హోమంలో వాడిన నెయ్యి, యజ్ఞప్రసాదం, ఒక యజ్ఞం తర్వాత మరో యజ్ఞానికి పనికిరావని మరో పాత్ర తోనూ చెప్పిస్తారు. ‘అనేక మంది మూర్ఖులకన్నా ఒక పండితుడి సూచన శ్రేయస్కరమని, అలాగే దక్షుడు, శూరుడైన ఒక్క మంత్రి చాలు రాజ్యానికి మంచి చేయడానికి’ అనీ తెలియజేస్తారు.

చెట్లు ఋతువులను బట్టి పూతనూ, కాయలను పొందినట్టుగా ప్రాణులు తమ కర్మల ఫలితాల సమయం రాగానే వాటిని పొందుతారు. స్వలాభపరులు రాజుకు ఎప్పుడూ ప్రియవచనాలే పలికి తమ పని చక్కపెట్టుకుంటారు. అటువంటి వారిని రాజులు గుర్తించాలి. మారీచుడు ఒకసారి ‘పాపాలు చేసిన వారి సాంగత్యంలో ఉన్న పవిత్రులు కూడా ఒక్కోసారి ఆ పాప ఫలితానికి ‘పాములున్న మడుగులోని చేపవలే’ బలవుతారు. ‘సాధువుల దుష్ట సాంగత్యం వల్ల వారి పరివారం కూడా నష్టపోతారని’ అంటాడు. మోయగలిగిన బరువునే తలకెత్తుకోవాలి. జీర్ణమయ్యే ఆహారాన్నే భుజించాలి, లేకపోతే అది వ్యాధికారకం అవుతుంది. దుఃఖం, ఆర్థిక నష్టం, ప్రాణానికి ముప్పు ఉన్నప్పుడే, ధైర్యవంతుడు తన బుద్ధితో వాటిని ఎదుర్కొనాలి. రాజద్రోహి, గో బ్రాహ్మణ హంతకుడు, చోరుడు, లోభి, మిత్రద్రోహి, గురుద్రోహి, కచ్చితంగా నరకానికి పోతారు.

ఎవ్వరితోనైనా ఎక్కువ ప్రీతి, ఎక్కువ ద్వేషం మంచిది కాదు. ‘ఉపకారం పొంది ప్రత్యుపకారం చేస్తానని మాటిచ్చి తప్పినవాడు పురుషాధముడు, కృతఘ్నుడు’ అంటాడు సుగ్రీవుని గురించి మాట్లాడేటప్పుడు శ్రీరాముడు. ‘కోపి పాపం చేయకుండా ఉండడు. సజ్జనులను దోషించకుండా కష్టపెట్టకుండ ఉండడు’ అంటూ కోపం వల్ల వచ్చే నష్టాలు హనుమ ద్వారా చెప్పిస్తారు వాల్మీకి మహాకవి.

ధనం కలవానికే ఎక్కువమంది స్నేహితులు ఏర్పడుతారు. అతడొక ఉత్తముడిగా, గొప్ప గుణవంతుడిగా, తెలివైనవాడిగా ప్రశంసలు అందుకుంటాడు. నిజంగా బుద్ధికుశలుడు వీటినుంచి తెలివిగా తప్పించుకోగలడు. రాజు.. ధర్మం, ధనార్జన, వాటి వినియోగంలోనూ, పుణ్య పాపకార్యాల్లోనూ మార్గదర్శకుడు. రాజు ధర్మాచరణను పాటిస్తే ప్రజలు కూడా ఆయననే అనుసరిస్తారు కదా. ‘యథా రాజా తథా ప్రజా’ అన్న సూక్తి కూడా మనకు రామాయణంలోంచి ఉద్భవించిందే.


logo