గురువారం 28 మే 2020
Devotional - May 11, 2020 , 22:59:47

కరోనాసుర సంహారం!

కరోనాసుర సంహారం!

దేవకిదేవి అష్టమగర్భంలో జన్మించిన శిశువు (శ్రీకృష్ణుడు) ఇంకా మరణించలేదని, నందగోకులం లో పెరుగుతున్నాడనీ తెలిసినప్పట్నుంచీ కంసునికి నిద్రాహారాలు దూరమైనాయి. గోకులంలోని పిల్లలందరినీ చంపాలని ప్రణాళిక వేసుకున్నాడు. కానీ, అది అసమంజసమని భావించి విరమించుకున్నాడు. శిశువును గుర్తించే పనిని పూతన చేసింది. విషపూరితమైన స్తన్యంతో బాలకృష్ణుని చంపబూని తానే మరణించింది. ఎడ్లబండి రూపంలో వచ్చిన శకటాసురుడు కూడా బాలకృష్ణుని చేతిలో నిహతుడైనాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడిని సంహరించే బాధ్యతను తృణావర్తుడు స్వీకరించాడు.

పగటిపూట అయినా మబ్బులు కమ్ముకొస్తున్నాయి. వాతావరణం చల్లబడింది. గాలి చల్లగా, మెల్లగా వీచసాగింది. అప్పటివరకు తల్లి చంకలో ఉన్న కృష్ణయ్య కిందకు దిగి ఆడుకొంటానన్నాడు. తల్లి దింపింది. వాకిట్లో అంబాడుతూ ఆడుకోసాగా డు కృష్ణయ్య. గాలి ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చిం ది. సుడిగాలిగా మారింది. ధూళిధూసరితమైన వాయుస్తంభం ఒకటి నేల నుంచి నింగివరకు ఏర్పడింది. ఆ సుడిగాలిలో నేల నుండి నింగికెగిసి పోతు న్న చిన్ని కృష్ణుణ్ణి చూశారు నందగోకుల వాసులు. యశోదమ్మ అంతులేని దుఃఖానికి లోనైంది.

కొద్ది తడవైనాక, గాలి నిమ్మళించింది. మేఘాలు తొలిగిపోయి ఆకాశం నిర్మలమైంది. నందుని ఇంటి ముందరి వీథిలో ఈ చివరి నుంచి ఆ చివరివరకు విస్తరించిన ‘రాక్షస కళేబరం’ పడి ఉన్నది. విశాలోన్నతమైన ఆ రాక్షసుని వక్షస్థలాన్నుంచి పోరాడుతూ దిగుతున్న చిన్ని కృష్ణుడిని చూసిన యశోద పరుగున వెళ్లింది. చిన్నారి క్రిష్ణయ్యను ఎత్తుకొని, గుండెలకు హత్తుకొంది. కన్నీటి ముత్యాలు బుగ్గల నుంచి జారిపడుతుండగా తనివితీరా ముద్దాడింది. గాలిని, ధూళిని దేహంగా చేసుకొన్న తృణావర్తుడు నిజరూపంతో మరణించాడు.

దేవతల ప్రార్థన మేరకు రాక్షస సంహారార్థం గౌరి కౌశికి రూపాన్ని ధరించి వచ్చింది. శుంభ నిశుంభులను చంపడం ఆమె ప్రథమ కర్తవ్యం. దనుజులను చూసినంతనే ఆమె ముఖం క్రోధంతో నల్లబడింది. నల్లబడిన ఆ ముఖాన్నుంచి ఖడ్గ హస్తమై, వ్యాఘ్ర చర్మాంబర ధారియైన దేవి జనించింది. శుంభ నిశుంభులను దునుమూడిన కాళికాదేవి ఈమెయే.

శుంభ నిశుంభుల సేనాపతి రక్తబీజుడు కూడా దేవితో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. కాళికాదేవి తన ఖడ్గపు వేటుతో రక్తబీజుని తలను ఖండించింది. వాడు కిందపడి మరణించాడు. కానీ, ఆశ్చర్యకరంగా అప్పటికప్పుడు వందలు వేలుగా రక్తబీజులుద్భవించి, దేవితో యద్ధం చేయనారంభించారు. అలా ఉద్భవించిన వారినందరినీ సంహరిస్తున్నా మరల మరల వేలు, లక్షల సంఖ్యలో రక్తబీజులు పుడుతూనే ఉన్నారు. యుద్ధానికి వస్తూనే ఉన్నారు.

దేవి జాగ్రత్తగా గమనించింది. రక్తబీజుని దేహం నుంచి పారిన ప్రతి రక్తపు బిందువు నేలను తాకిన వెంటనే రక్తబీజ రూపం ధరించి యుద్ధానికి సిద్ధమవుతున్నది. ఫలితంగా ఒక రక్తబీజుడు మరణిస్తే వందల రక్తబీజులు ఉద్భవించసాగారు. అలా, రక్తబీజుల సంఖ్య చూస్తుండగానే అనంతమై పోతున్నది. దేవి అప్పడు తన కళలలో ఒకటైన చండికను రావించింది. మళ్లీ దేవి రక్తబీజుని తలను నరికివేసింది. అతని దేహం నుంచి ఉప్పొంగిన రక్తంలో ఒక్క బొట్టుకూడా నేల మీద పడకుండా చండిక తాగివేసింది. ఈ విధంగా రక్తబీజ విస్తరణ ఆగిపోయింది. అతడు శాశ్వతంగా మరణించాడు.

ఇవి పురాణకథలే కావచ్చు. కానీ, ఇవాళ్టి కరోనా అంటువ్యాధి ప్రపంచవ్యాప్తంగా వీటిని గుర్తుకుతెచ్చే స్థాయిలో విజృంభిస్తున్నది. ఈ ‘కరోనాసురుడు’ మనుషుల పాలిట రక్కసివలె దాపురించిండు. నాడు తృణావర్తుని సంహరించిన శ్రీకృష్ణపరమాత్మ, రక్తబీజుని హతమార్చిన కాళికాదేవి ఇప్పుడు ఈ ఆపద నుంచి మానవాళినీ కాపాడాలని కోరుకొందాం. వైద్యులు, ఇతర అత్యవసర ప్రభుత్వ విభాగాల వారు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ నిద్రాహారాలు మాని సమాజ సేవ చేస్తున్నారు. అలాంటి వారందరిలోనూ శ్రీకృష్ణ పరమాత్మ నెలకొని ఉన్నాడు. ఆ వేన వేల కృష్ణపరమాత్మలకు వందనాలను అర్పిస్తూ జేజేలు పలుకుదాం. మనమంతా విధిగా దైహికదూరాన్ని పాటిస్తే చాలు, స్పర్శ మాత్రాన బతికే రక్తబీజుడు (రాక్షసుడు) వంటి ‘కొవిడ్‌-19’ వైరస్‌ తప్పక తోకముడవాల్సిందే.


logo