గురువారం 04 జూన్ 2020
Devotional - May 10, 2020 , 23:32:13

పునర్జన్మను ఎందుకు తప్పించుకోవాలి?

పునర్జన్మను ఎందుకు తప్పించుకోవాలి?

‘ఈ ప్రపంచంలో ఒక యోగిలా జీవించడం ఎంతో పారవశ్యంతో కూడుకున్నదైతే, పునర్జన్మను ఎందుకు తప్పించుకోవాలి?’ అన్న ప్రశ్న సాధారణంగా చాలామందికి ఎదురవుతుంది. నిజానికి దీన్ని ‘తప్పించుకోవడం’గా అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ స్కూలుకు వెళ్లారు. కొంతమందికి స్కూలు గొప్ప అనుభూతి కాకపోయి ఉండవచ్చు. కానీ, చాలామందికి స్కూలు ఒక మంచి అనుభూతి. ముఖ్యంగా, ఎవరైతే చదువుకోవడం మీద శ్రద్ధ పెట్టలేదో, ఫస్ట్‌ర్యాంక్‌ రావాలని అనుకోలేదో వారు హాయిగా వారి స్నేహితులతో ఆడుకున్నారు, ఆనందించారు. 

స్కూలు ఒక చక్కటి అనుభూతి. స్కూలు చదువులు పూర్తయిన తరువాత, దానిని ‘స్కూలునుండి తప్పించుకోవడం’ అంటామా? లేదంటే, ‘స్కూలు పూర్తి చేసుకోవడం’ అంటామా? స్కూల్లో ఉన్నప్పుడు, స్కూలు ఎంత బాగున్నప్పటికీ, కాలేజీకి వెళ్ళాలనిపించింది కదా? ఎవరైనా ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలనే అనుకుంటారు. ఇది మనిషి సహజ స్వభావం. ఇది ఎంత బాగా ఉన్నా సరే, జీవితంలోని తర్వాత స్థాయికి వెళ్లాలని అనుకుంటారు. బాగుంది కాబట్టి, ఎప్పటికీ అదే చేస్తూ ఉండిపోతాను అనడం, జీవితాన్ని మూర్ఖత్వంతో చూడటమే. జీవితం ఎంతో అద్భుతంగా ఉండటం వల్ల కాదు కానీ, మీకు తెలియని దాంట్లోకి అడుగు పెట్టాలంటే, మీకు ఉన్న భయం వల్ల అలా అనిపిస్తుంది.

ఒకానొకసారి ఇలా జరిగింది. పరిస్థితులు అంతగా బాగా లేకపోవడంతో ఒక ప్రముఖ వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడిగా మారి, కూలి పని చేయడం మొదలుపెట్టాడు. ఇటుకలను ఎన్నో అంతస్తులపైకి మోసుకుపోవాల్సి ఉంటుంది. అతను అక్కడి సూపర్‌వైజర్‌ అడిగినదానికంటే ఎక్కువ ఇటుకలు మోసుకెళ్ళడం తోటి కూలీ గమనించాడు. అందరూ 8 ఇటుకలను మోసుకుపోతుంటే అతను మాత్రం 12 ఇటుకలను మోస్తున్నాడు. ఎనిమిది ఇటుకలు మోయడమే బరువుగా ఉంటుంది. వాటిని చాలా అంతస్తులపైకి తీసుకుపోవాలి. వాళ్లు ఇటుకలు పైకి తీసుకుపోయిన తర్వాత, అక్కడ దించి వచ్చేస్తారు. ఇక్కడ హాయి కలిగించే విషయమల్లా, చేతులు ఊపుకుంటూ కిందకి రావడం. ఇక లంచ్‌ టైంలో ఆ వేరే కూలీ ఆ ప్రముఖ వ్యక్తిని ఇలా అడిగాడు, ‘8 ఇటుకలు మోస్తేనే పూర్తి కూలి వస్తుంది. 12 ఎందుకు మోస్తున్నావు?’. అప్పుడా వ్యక్తి ‘నీకు తెలీదు. నేను అవే 12 ఇటుకలను పైకి కిందకి మోస్తున్నాను’.

ఇలాంటి ‘మేధావులు’ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఒకేదాన్ని పైకి కిందకీ మోసుకు పోతున్నారు. మళ్ళీ మరణం, మళ్ళీ జననం. అదే చట్రంలో తిరుగుతున్నారు. ఎందుకిలా జరుగుతున్నదంటే, జీవితానికి కొంతకారుణ్యం ఉంది. సృష్టి కరుణతో జరుగుతున్నది. మీ జ్ఞాపకశక్తికి తెరను వేస్తున్నది. ఆ తెరలు లేకపోతే, అవే మూర్ఖపు పనులు 100సార్లు చేశామని ఇప్పుడు మీరు చాలా చింతిస్తారు. అవే పనులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నామని మీరు తెలుసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరే ఓ చెంపదెబ్బ వేసుకోవాలని అనుకుంటారు. అందుకే, ఒకరికి ప్రస్తుతం అనుభూతిలో ఉన్నదానికంటే ఎక్కువగా స్మృతిని తెరవాలంటే అందుకు ఎంతో స్థిరమైన మానసిక స్థితి ఆధారంగా ఉండాలి. ఆధ్యాత్మికం కాదు, మానసికం. ఎందుకంటే, మీకు ఎంతో స్థిరమైన మానసిక స్థితి లేకపోతే, మీ స్మృతులకు ఉన్న తెరలు తొలగిపోయినప్పుడు మీ మనసు పగిలిపోతుంది. 

ఒక జీవితానుభవంతోనే ప్రజలు ఇంత కష్టపడుతున్నప్పుడు, ఇంకా పూర్తిగా జీవించకుండానే, వారికి ఓ 30 ఏండ్లు వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ స్మృతులతో, ఆలోచనలతో, భావాలతో ఎంతో సంఘర్షణ పడుతున్నారు. దుఃఖంలో మునిగిపోతున్నారు. ఒకవేళ మీరు వారికి మూడు జన్మల జ్ఞాపకాలను వెలికి తీసుకువస్తే వాళ్ళు దాన్ని నిర్వహించుకోగలరా? పూర్తిగా పిచ్చివాళ్లు అయిపోతారు. అందుకే, జీవి తం కారుణ్యంతో, మీ జ్ఞాపకాన్ని విడిగా పెట్టింది. మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నారని మీకు అర్థం కాదు. అది ఎంత అందంగా, అద్భుతంగా, ఉల్లాసంగా ఉన్నా సరే, మళ్లీ మళ్లీ అదే తిప్పుతూ ఉంటే! 

నేను ఒక పని చేస్తాను, మీకు ఇష్టమైన మ్యూజిక్‌ను ప్లే చేస్తాను. మీ బుర్రలో ఎప్పుడూ ఆడేలా చేస్తాను, ఆపకుండా! వచ్చే 21 రోజులు! ఆ అద్భుతమైన మ్యూజిక్‌తోకూడా మీరు పిచ్చివాళ్ళు అవుతారు. ఎందుకంటే, అది ఆగకుండా తిరుగుతున్నది కాబట్టి. మళ్లీ మళ్లీ ఒకే విషయాలు ఒక చక్రంలా జరుగుతున్నాయని గమనించినవారు, సహజంగానే ఆ చక్రం నుండి బయటపడాలనుకుంటారు. ఇది తప్పించుకోవడం కాదు, అంతకు అతీతమైన దానికి మీకు ఒక నిచ్చెన దొరికిందని అర్థం. మీరు జీవితంలో ఒక స్థాయినుండి మరొక స్థాయికి ఎదిగినప్పుడు దాన్ని తప్పించుకోవడం అనరు. దాన్ని ఎదగడం లేదా విముక్తి అంటారు.

-సద్గురు జగ్గీ వాసుదేవ్‌


logo