శుక్రవారం 07 ఆగస్టు 2020
Devotional - May 09, 2020 , 23:46:58

మాటకు కట్టుబడిన గంగాదేవి!

మాటకు కట్టుబడిన గంగాదేవి!

మహాభారతంలో గంగా-శంతనుల కథ ఆసక్తికరం, అందరూ తెలుసుకోదగ్గది కూడా. ఇక్షాకు వంశానికి చెందిన రాజు మహాభిషుడు ధర్మశీలుడు, వేయి అశ్వమేథాలు, వందలాది రాజసూయ యాగాలతో ఇంద్రాది దేవతలను మెప్పించినవాడు. ఈ ఘనత కారణంగానే, ఒకసారి దేవతలు అతనిని దేవలోకానికి ఆహ్వానిస్తారు. అదే సమయానికి, అక్కడ దేవతలంతా కొలువుదీరి బ్రహ్మదేవుని కొలుస్తుంటారు. ఈ సంగతి గంగాదేవికి తెలుస్తుంది. ఆమె స్త్రీ రూపంలో పరుగు పరుగున దేవతల సభకు వస్తుంది. ఐతే, అప్పుడు ఆమె పైట గాలికి తొలగిపోతుంది. అది చూసి, దేవతలందరూ విధిగా తలలు దించుకొంటారు. కానీ, మహాభిషుడు మాత్రం గంగాదేవిని నఖశిఖ పర్యంతం చూశాడు. 

దీనిని గమనించిన బ్రహ్మదేవుడు ఆగ్రహిస్తాడు. ‘భూలోకంలో జన్మించ’మంటూ గంగా, మహాభిషులను ఇద్దరినీ శపిస్తాడు. భయపడిన మహాభిషుడు బ్రహ్మను మన్నించమని వేడుకొంటాడు. శాపప్రభావం ఎటూ తప్పదు కాబట్టి, ‘భూలోకంలోని భరతవంశంలో పుణ్యచరితుడైన ప్రతీపునికి తనను పుత్రునిగా జన్మింపజేయమని’ కోరుకొంటాడు. అలాగే, రూపసౌందర్యవతి అయిన గంగాదేవికూడా ‘మానవరూపంతో భూలోకంలో ఎక్కువ కాలం ఉండలేనని’ బ్రహ్మదేవుని వేడుకొంటుంది. దానికి ‘నువు ఉండాలనుకున్నంత కాలమే ఉండి, తిరిగి రమ్మని’ ఆమెకూ వరమిస్తాడు. గంగాదేవి ‘అందమైన రాకుమారుడిని వివాహమాడి, కొంతకాలం భూలోకంలో ఉండాలని’ ఆశిస్తుంది. యజ్ఞయాగాదుల ఫలమంతా ‘అగ్నికణానికి బలైన గడ్డివాము’ వలె తన ఒక్క‘చూపు’తో భస్మీపటలమైనందుకు మహాభిషుడు బాధపడి, మరణించాడు. 

భూలోకంలో ప్రతీపుడనే రాజు, తన భార్య సునందాదేవితోకూడి సంతానం కోసం తీర్థయాత్రలు, వ్రతాలు చేస్తాడు. కొన్నాళ్లకు వారు శంతనుణ్ణి పుత్రునిగా పొందుతారు. యుక్తవయసులో వీరుడిగా ఎదిగిన తర్వాత, కొడుకు శంతనుణ్ణి పట్టాభిషిక్తుని చేసి, రాజ్యభారం అప్పగిస్తాడు.

‘కుమారా! నీకు నచ్చిన యువతిని కులగోత్ర నామాలేవీ అడుగకుండానే వివాహం చేసుకో. ఆమె ఇష్టానుసారం నడుచుకో’ అని దీవించి, తపస్సు చేసుకోవడానికై అడవులకు వెళ్లిపోతాడు ప్రతీపుడు. గంగాదేవికూడా భూలోకానికి రావాల్సిన సమయం వస్తుంది. ఆకాశమార్గాన బయల్దేరింది. అప్పుడామెకు విచారంతో వున్న అష్టవసువులు కనిపిస్తారు. ‘కారణం ఏమిటని’ అడిగితే, ‘వశిష్ఠుని శాపంతో మేం కూడా భూలోకంలో జన్మించాల్సి ఉంది. కానీ, ఎక్కువ కాలం అక్కడ ఉండలేం కదా. కనుక, నువ్వే మమ్మల్ని కని, వెంటనే పవిత్రమైన నీ జలాలలో కలుపుకొంటే, మాకు శాపవిమోచనం అవుతుంది. మాలోని ఏడుగురిని ఇలాగే చేయి. కానీ, మా చివరివాడైన అష్టవసువు కొంతకాలం భూలోకంలో ఉండాలన్నది వశిష్ఠులవారి ఆజ్ఞ’ అనికూడా వారు చెప్తారు. ఆర్ద్ర హృదయంతోనే గంగాదేవి ‘వారి కోర్కెలను తీరుస్తానని’ మాట ఇచ్చి బయల్దేరుతుంది.

శంతనుడు ఒకనాడు నదీతీరానికి వాహ్యాళికి వస్తాడు. అతనికి ఉత్తమ దివ్యాంబరాలతో, మణిమయ కర్ణాభరణాలతోవున్న కన్య(గంగాదేవి) కనిపించింది. ‘వనకన్యో, జలకన్యో, దేవకన్యో, నాగకన్యో.. ఈ అందాలరాశి ఎవరా’ అని కన్నార్పకుం డా చూస్తాడు. అప్పుడే ఆమెకూడా రాజకుమారు ని చూసింది. ఒకరి నొకరు పలుకరించుకొన్నా రు. ఇరువురి నడుమ ‘ప్రేమ’ పుట్టింది, మాటలు కలిశాయి. పరస్పరం ఎవరు, ఏమిటి అన్న ప్రసక్తే రాలేదు. ఇద్దరూ పెండ్లితో ఒక్కటవ్వాలని అనుకొంటారు. కానీ, గంగాదేవికి తాను వసువులకు ఇచ్చిన మాట గుర్తుకువస్తుంది. ‘పుట్టిన బిడ్డలను గంగపాలు చేస్తానంటే ఏ భర్తయినా ఒప్పుకొంటాడా?’ అందుకే చిత్రంగా ఓ షరతు విధించింది. ‘రాజకుమారా! నేనేం చేసినా నువ్వు ఎందుకు, ఏమిటి? అని అడుగకూడదు. ఎప్పుడు ఎదురు తిరిగినా తక్షణం నిన్ను వదిలి వెళ్లిపోతాను. దీనికి నీ కిష్టమైతేనే నేను నీతో వివాహానికి సిద్ధం’.

శంతనుడు సరేననడంతో ఇద్దరూ ఒక్కటవుతారు. కొన్నాళ్లకు ఏడుగురు వసువులు వరుసగా పుట్టసాగారు. పుట్టిన వాళ్లనల్లా పురిటిలోంచే ఎత్తుకెళ్లి నదీ జలంలో వదిలేయసాగింది గంగాదేవి. తట్టుకోలేని శంతనుడు ఆఖరుకు ఎనిమిదవ పర్యాయం పుట్టిన బిడ్డ విషయంలో ఎదురు తిరుగుతాడు. అంతే! ఇచ్చిన మాట ప్రకారం గంగాదేవి భూలోకం వదిలి వెళ్లిపోతుంది. 8వ వసువు మగబిడ్డరూపంలో భూమిపై మిగిలిపోతుంది. అతనే భీష్ముడు! దేవవ్రతుడు, గాంగేయుడుగా ప్రసిద్ధినొంది, మహాభారత గాథకే కీలక భూమిక పోషించాడు.


logo