గురువారం 28 మే 2020
Devotional - May 09, 2020 , 22:37:11

విశ్వ విరాట్‌ స్వరూపం!

విశ్వ విరాట్‌ స్వరూపం!

‘నాలుగు వర్ణాలవారు భగవంతునినుంచి పుట్టారని, వారి పుట్టుకను అనుసరించి హెచ్చుతగ్గులు మనుషులలో ఏర్పడ్డాయని, క్రమంగా వర్ణవ్యవస్థ కులవ్యవస్థకు దారిచూపిందని, వర్ణవ్యవస్థే సమాజంలోని అన్ని రుగ్మతలకు కారణమని, దాన్ని రూపు మాపడానికి అందరూ ప్రయత్నించాలని’ ఒక వాదం ఆధునిక కాలంలో ప్రబలంగా వినిపిస్తున్నది. కానీ, ప్రాచీన వర్ణవ్యవస్థ వేద ప్రతిపాదితమైంది. 

వేదజ్ఞానం కలిగినవాణ్ణి బ్రాహ్మణుడన్నారు. బాహుబలం కలిగినవాణ్ణి క్షత్రియుడన్నారు. వ్యాపార దక్షత కలిగినవాణ్ణి వైశ్యుడన్నారు. సేవలు అందించేవాణ్ణి శూద్రుడన్నారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఒకరెక్కువ, మరొకరు తక్కువ అని వేదం చెప్పదు. ప్రపంచం నడవాలంటే నాలుగు బలాలు తప్పనిసరి అవసరం. సృష్టికర్త నాలుగు బలాలను మాత్రమే సృష్టించాడు కానీ స్వయంగా బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి సృష్టించలేదు. బుద్ధిబలం, భుజబలం, ధనబలం, సేవాబలం ఇవి ధర్మాలు మాత్రమే. వీటిని ఎవరు అలవర్చుకొంటే, వారు ఆ పేర్లతో వ్యవహరింపబడుతారు.

‘వృణతే ఇ అవర్ణః’ అని ‘వర్ణ’శబ్ద నిర్వచనం. వరింపబడేది వర్ణం. వర్ణం మారుతుందికూడా. ఒక వర్ణాన్ని అవలంబించినప్పుడు మానవుడు తదనుగుణంగా వ్యవహరించవలసి ఉంటుంది. ‘నేను బ్రాహ్మణుడను’ అని చెప్పుకొన్నవాడు ‘తప్పక జ్ఞాని అయి’ ఉండాలి. ‘నేను క్షత్రియుడ’నని చెప్పుకొన్నవాడు ‘శత్రువులనుంచి దేశప్రజలను రక్షించగలిగి’ ఉండాలి. ‘నేను వైశ్యుడ’నని చెప్పుకొన్నవాడు ‘కృషి, వాణిజ్యరంగాలలో నిష్ణాతుడై’ ఉండాలి. ‘నేను శూద్రుడ’నని చెప్పుకొన్నవాడు ‘సేవాదృక్పథాన్ని’ అలవర్చుకోవాలి. తెలివి, పరాక్రమం, వ్యాపారదక్షత, సేవాతత్పరత- ఈ నాలుగూ ప్రపంచాన్ని నడిపించే సుగుణాలు. ఈ నాల్గింటి అవసరం సమాజానికి ఉన్నది. 

అందుకే, భగవంతుడు ఈ నాలుగు పనులు చేసే వారిని తనలో కలిగిఉన్నట్లు ‘పురుషసూక్తం’ చెప్తున్నది. ‘యజర్వేదం’లోని 31వ అధ్యాయంగా కనిపించే పురుషసూక్తం ‘ఎవరు సృష్టికర్తలో, ఎవరు ఉపాసింపదగిన వారో, ఏ విధంగా సృష్టి జరిగిందో’ తెలియజేసింది. భగవంతుడు వేలకొలది ప్రాణుల శిరస్సులను, నేత్రాలను, పాదాలను తనలో కలిగి, అంతటా వ్యాపించి ఉన్నాడు. అన్ని వైపులనుంచి భూమిని స్పృశిస్తున్నాడు. పంచస్థూల భూతాలతో, శబ్దస్పర్శ రూపరస గంధాలనే పంచసూక్ష్మ భూతాలతో కూడిన ఈ సకలజగత్తును అధిగమించి ఉన్నాడు. మొత్తం విశ్వానికి నేరుగాకూడా ఉన్నాడు.

భగవంతునితోనే మానవులకు సమస్త భోగ్యవస్తువులు సృష్టింపబడినాయి. వన్యమృగాలతోపాటు పెంపుడు జంతువుల ఉత్పత్తీ జరిగింది. అంతేకాదు, సత్యవిద్యల గ్రంథమైన వేదం ప్రభవించింది. దాన్నే అనుసరిస్తూ విద్వాంసులు యోగమార్గం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలని వేదం ఉపదేశిస్తున్నది. ‘ఈ ప్రపంచాన్ని విరాట్‌ పురుషునిగా భావిస్తే అతనికిగల మఖ్యాంగాలేవి?’ అనే ప్రశ్నకు ‘పురుషసూక్తం’ చక్కని సమాధానమిచ్చింది. ‘వేదవిజ్ఞానం కలిగి, భగవంతుణ్ణి గురించి తెలుసుకొన్నవాడు మాత్రమే భగవంతునికి ముఖం వంటివాడు. బలపరాక్రమాలు కలిగిన క్షత్రియుడే భుజాల వంటివాడు. ఏ దేశానికైనా వెళ్లగలిగిన వైశ్యుడే తొడలవంటివాడు. సేవాగుణం కలిగిన శూద్రుడే పాదాలవంటివాడు’ అని తెలియజేసింది.

ఇంకా, ఆ భగవంతునికి చంద్రలోకం మనస్సు వంటిది. సూర్యమండలం నేత్రం వంటిది. వాయుప్రాణాలు చెవుల వంటివి. అగ్ని ముఖం వంటిది. అంతరిక్షం నాభి వంటిది. ఆకాశం శిరస్సు వంటిది. భూమి పాదాల వంటిది. అలాంటి భగవంతుణ్ణి మనోరూప యజ్ఞంలో అర్చించాలి. గాయత్రి మొదలైన ఏడు ఛందస్సులను దారాలుగా యజ్ఞానికి చుట్టి, మనోయజ్ఞంలో పంచస్థూల భూతాలను, పంచసూక్ష్మ భూతాలను, పంచజ్ఞానేంద్రియాలను, త్రిగుణాలను చివరికి మహదహంకారాలను, ప్రకృతిని సామగ్రిగా చేసి ఆహుతులివ్వాలని ‘పురుషసూక్తం’ చెప్తున్నది.

‘ప్రకాశ స్వరూపుడైన భగవంతుణ్ణి పూజిస్తూ, ధర్మమార్గంలో నడుస్తూ, మోక్షానందాన్ని పొందడానికి అర్హత సంపాదించిన మహిమాన్వితులైన విద్వాంసులను ఆదర్శంగా తీసుకోవాలి. చేసే కర్మలనుబట్టి జీవకోటికి శరీరరూపాలను ఇచ్చే ఆ భగవంతుని ఆజ్ఞను శిరసావహించాలి. అనంతమైన ప్రకాశం కలిగి, అజ్ఞానానికి అవతల ఉండి, స్వస్వరూపంతో వెలిగే భగవంతుణ్ణి తెలుసుకొన్నప్పుడే మృత్యువును జయించగలం. ఇంతకంటే ఉత్తమమార్గం మరొకటి లేదు’ అని వేదం మనకు ఉపదేశిస్తున్నది. చావు పుట్టుకలు లేనివాడై, జీవుల అంతరంగాలలో చరించువాడై, మహిమోపేతుడై, జగత్తునకాధారుడై, సర్వవ్యాపకుడై ప్రకాశించే భగవంతుడే ఉపాసింపదగినవాడని, భూమిమీద నివసించే ప్రాణికోటికి కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేసే విధంగా సూర్యుణ్ణి సృష్టించిన భగవంతుడే ధ్యానింపదగిన వాడని వేదం పేర్కొన్నది.

‘పూర్వవిద్వాంసులు భగవంతుని గురించి, జీవప్రకృతులను గురించి చెప్పిన విషయాలను మరిచిపోరాదు. ధర్మతత్పరత, జితేంద్రియత్వం, ఆత్మబలం, దేహబలం సంపాదించుకోవాలి. సత్కర్మలవల్లనే సుఖభోగాలు లభిస్తాయి. భగవంతునిలోని న్యాయాది గుణాలను, విశాల దృక్పథాన్ని, దయను, సత్యనియమాలను, నిత్యబుద్ధముక్త స్వభావాన్ని అందరం అలవర్చుకొని క్రమంగా అభ్యుదయాన్ని, మోక్షాన్ని పొందాలి’ అని ‘పురుషసూక్తం’ ఉద్బోధిస్తున్నది.

అనంతమైన ప్రకాశం కలిగి, అజ్ఞానానికి అవతల ఉండి, స్వస్వరూపంతో వెలిగే భగవంతుణ్ణి తెలుసుకొన్నప్పుడే మృత్యువును జయించగలం. ఇంతకంటే ఉత్తమమార్గం మరొకటి లేదు’ 

ఎవరిని ఉపాసించాలి?

ఈ సృష్టి రచన ఎవరివల్ల జరుగుతున్నదో, ఎవరివల్ల సకల సంపదలు సృష్టింపబడినాయో, ఎవరివల్ల ఈ ప్రపంచం నశిస్తున్నదో ఆ భగవంతుడినే ఉపాసించాలని వేదం ఉపదేశిస్తున్నది. ఈ దృశ్యాదృశ్య ప్రపంచమంతా భగవంతుణ్ని సూచిస్తుంది. ఈ ప్రపంచం ‘ఉత్పత్తి, స్థితి, ప్రళయం’ ఈ మూడింటినీ పొందుతున్నది. కాని, భగవంతుడు నాశం లేని వాడు. అతని మహిమలో ఈ ప్రపంచం నాల్గవభాగం మాత్రమే. అతని మూడువంతుల మహిమ ఎవరికీ అర్థం కాదన్నది వేదోపదేశం. భగవంతుడు తన మహిమలోని 4వ భాగంతో ఈ సృష్టిరచన చేసినా అతడెప్పుడూ సృష్టికంటే భిన్నంగానే ఉంటాడు. అతనిద్వారా సమష్టిరూపంలో ఈ జగత్తంతా నిర్మాణమైనా దానికి అంటువడక, అధిష్ఠాతగా ఉంటాడని వేదం ప్రవచిస్తున్నది.

- ఆచార్య మసన చెన్నప్ప 

98856 54381


logo