బుధవారం 03 జూన్ 2020
Devotional - May 09, 2020 , 01:04:55

ప్రాణి కోటిలో పరమాత్మ దర్శనం!

ప్రాణి కోటిలో పరమాత్మ దర్శనం!

‘విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

శునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః॥’. 

మానవ ధర్మాలనే భగవంతుని ముఖతః వ్యక్తీకరించి సర్వమానవాళికి బోధించిన మహాగ్రంథం భగవద్గీత. అయిదవ అధ్యాయంలోని ఈ శ్లోకం ‘మనుషులకు కనువిప్పు కలిగించే గొప్పధర్మాన్ని’ చెప్పింది. ‘విద్య, వినయం మొదలైన గుణసంపదలతో కూడిన బ్రాహ్మణులలో, గోవులలో, ఏనుగులలో, కుక్కలలో, కుక్కమాంసం వండుకొని తినే చండాలుని వంటి వారందరిపట్లా సమదృష్టి కలిగివున్నవారే నిజమైన పండితుడు’. అంటే, ప్రతి ప్రాణిపట్ల సమబుద్ధితో ప్రవర్తించిన వారినే ఆత్మజ్ఞానిగా భావించాలి. భగవద్గీతలో అనేక సందర్భాలలో మానవునికి ఆత్మజ్ఞానం ముఖ్యమన్న సందే శం వినిపిస్తుంటుంది. సమదృష్టి లేనివారిని అధములుగా భావించింది. 

అధములైన వారు కేవలం రూపాలను, దేహాలను మాత్రమే చూడటానికి ఇష్టపడతారు. దానివల్ల తమను ఇతర ప్రాణులతో వేరుగా భావించి ప్రవర్తిస్తుంటారు. కానీ, ఆత్మజ్ఞాన తత్వాన్ని తెలిసిన పండితులు సమదర్శులై మనోదృష్టితో ఇతరుల దేహాలపైన లేదా రూపాలపైన బుద్ధి పెట్టక, వారిలోని దేవుడిని మాత్రమే చూస్తారు. అలా వారు ప్రాణులు అన్నింటినీ, అందరినీ ఒక్కటిగానే భావించి గౌరవించగలరు. అది ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. ఇదే అసలైన ఆత్మదృష్టి. అందుకే, ఉచ్ఛనీచ భావాలను వదిలి జీవునిలోని దేవుడిని చూసి మాత్రమే ప్రవర్తించడం కారణంగా ‘ఆత్మవత్సర్వ భూతాని’ అన్నమాటకు ప్రమాణంగా నిలుస్తారు. ఇటువంటి సమదృష్టి కలిగిన వారే నిజమైన భగవద్భక్తులుగా గీతాసారం చెబుతున్నది. 

‘అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ

నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ॥’. భక్తియోగంలో సాక్షాత్తు కృష్ణపరమాత్మే ఇలా అన్నా డు. ‘నా కిష్టమైన, నిజమైన భక్తుడు సమస్త ప్రాణులపట్ల ద్వేషం లేనివాడై ఉండాలి. మైత్రి, కరుణ వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలి. అంతేకాదు, అహంకార మమకారాలను పూర్తిగా వదిలి, సుఖదుఃఖాలను సమదృష్టితో చూడగలిగినవాడై ఉండాలి’ అని అన్నాడు. దీనినిబట్టే ద్వేషరాహిత్యం, స్నేహం, కరుణ, నిరహంకారం, నిర్మోహత్వం, సుఖదుఃఖాలపట్ల సమదృష్టి.. వీటిని ఉత్తమ భక్తుని లక్షణాలుగా గుర్తించవచ్చు. అటువంటి ఉత్తమ భక్తుడే ఉత్తమ గుణవంతుడైన మానవుడు. వారివల్లే ఈ విశ్వం వైభవోపేతమవుతుంది.

కృష్ణపరమాత్మ సందర్భం వచ్చినప్పుడల్లా గుణాలపరంగా ‘సర్వభూత సమదృష్టి’ని గురించి బోధిస్తూ, అర్జునునేగాక సర్వమానవ ప్రపంచానికీ మార్గదర్శనం చేశాడు. జ్ఞానాలను మూడు విధాలుగా చెబుతూ, భగవద్గీతలోని చివరి అధ్యాయం ‘మోక్ష సన్యాసయోగం’లో ‘సర్వభూతేషు యేనైకం, భావ మవ్యయమీక్షతే, అవిభక్తం విభక్తేషు తత్‌జ్ఞానం విద్ధి సాత్వికం’ అన్నాడు. వేరువేరుగా కనిపించే అన్ని భూతాలలోను ఒక్కటై వుండే పరమాత్మ భావాన్ని, ఎటువంటి ఎక్కువ-తక్కువలు లేక దర్శించే జ్ఞానమే ‘సాత్విక జ్ఞానం’ అన్నాడు. ఇదే ఉత్తమమైన ఆత్మజ్ఞానం. సమస్త ప్రకృతిలోను పరమాత్ముని దర్శించుకొనే సాత్విక జ్ఞానాన్ని పొందినవాడే నిజమైన భక్తుడు, పండితుడూ.

‘భగవంతుడు సర్వవ్యాపి’ అని భావించాలన్న విషయాన్ని ‘ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే ర్జున తిష్ఠతి/ భ్రామయ స్సర్వ భూతాని యంత్రరూఢాని మాయమా॥’ అంటూ అర్జునునికి భగవంతుడు బోధించాడు. ‘అర్జునా! దేవుడు సర్వవ్యాపి కనుక జీవులన్నింటి హృదయాకాశాల్లో అంతరాత్మగా ప్రకాశిస్తున్నాడు. మన కళ్లు అజ్ఞానంతో మూసుకుపోయి అక్కడ ప్రకాశిస్తున్న దైవాన్ని చూడలేక పోతున్నాయి. కాని, వివేకం కలిగిన జ్ఞానచక్షువులకు ఆ దైవాన్ని చూడగలిగే శక్తి ఉంటుంది.’ సాక్షాత్తు కృష్ణ భగవానుడే సర్వజీవులలో సమదృష్టి కలిగి ఉండాలని, దానినే భగవంతుని దృష్టి అని, అది అత్యంత పవిత్రమైందనీ చెప్పాడు. ఈ దృష్టిజ్ఞానంతోనే లోకంలో శాంతి వర్ధిల్లుతుందన్నది భగవత్సందేశం.


logo