బుధవారం 03 జూన్ 2020
Devotional - May 07, 2020 , 23:06:35

లింగార్చన భూమి ఆరాధనే!

లింగార్చన భూమి ఆరాధనే!

శివపూజ అంటే శివలింగానికే పూజ. కాని, శివరూపానికి పూజలేదు. ఈ అంశాన్ని మనం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొని శివుని రూపాన్ని గమనిస్తే ఏదో ప్రత్యేకమైన విధానం మనకు కనిపిస్తుంది. పౌరాణిక కథనాలను అన్వయం చేసుకుంటే శివపూజ ఎంతటి వైజ్ఞానికమో మనకు అర్థం అవుతుంది. శివలింగాన్ని పూజించడం, శివమహిమను తెలుసుకోవడం, శివపూజ చేయడంలోని అంతరార్థాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. 

భారతీయ ధర్మంలో కనిపించే ప్రతి దైవప్రతిమ ఒక వైజ్ఞానిక భావానికి, ఖగోళానికి, భూగోళానికి, ప్రకృతికి ప్రతీకగానే ఉంటుంది. చూసే దృష్టి ఉంటే అంతా విశ్వమయమే. అతిపెద్ద శక్తులకు ఒక రూపాన్ని ఇచ్చి, ఆ రూపారాధన ద్వారా మూలశక్తిని ఆరాధించే ‘గొప్ప వైజ్ఞానిక సంప్రదాయం’ భారతీయులదే. ఆ రూపాన్ని, ధ్యాన శ్లోకాన్ని, మంత్రాన్ని, అక్షరాలను జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో ప్రత్యేక విషయాలు మనకు కనిపిస్తాయి. మన దైవారాధనలోని గొప్పదనం, మన పూర్వీకుల వైజ్ఞానిక దృక్పథం పరిపూర్ణంగా అర్థం అవుతుంది. ఈ వరుసలో మొట్టమొదట ఆలోచించదగింది శివారాధనే. శివుని మనం లింగరూపంలోనే ఆరాధిస్తున్నాం. ఈ లింగం మనం నివసిస్తున్న భూగోళానికి ప్రతిరూపమే. 

భూమి రూపం పూర్తిగా శివలింగ రూపంలో ఉంటుంది. శివుని తలపై చంద్రుడు ఉంటాడు. భూమికి ఉపగ్రహం చంద్రుడు. శివుడు దిగంబరుడు. అంటే, దిక్కులే అంబరం (వస్ర్తాలు)గా కలవాడు. భూమికూడా ఆకాశంలో దిగంబరంగానే ఉంటుంది. శివుని తలపై గంగ ఉంటుంది. భూమిపైన కూడా మూడింట రెండు వంతులు జలమే ఉంది. శివుని మెడలోని పాములు, భూమిచుట్టూ ఉండే విద్యుదయస్కాంత శక్తి తరంగాలకు సంకేతం. భూమిలోని లావాలు, ఆమ్ల సంబంధమైన వ్యవహారాలన్నీ నీలకంఠత్వాన్ని నిరూపిస్తున్నాయి. క్షీరసాగర మథనమంటేనే భూమికి మరో గ్రహం కొట్టుకొని భూగ్రహ స్థానం మారి, దానిపైన ప్రకృతి ఏర్పడి, చంద్రుడు ఏర్పడటమే. అర్ధనారీశ్వర రూపం భూమిచుట్టూ ఉండే పాంచభౌతిక శక్తితో కలిసి ఉండటానికి సంకేతమే. భూమిలోని అనేక సంపదలే శివుని ఐశ్వర్యత్వానికి సంకేతాలు. శివునికి పూసే విభూతి భూమిపైని మట్టి మాత్రమే. 

మరి, శివుని ఎందుకు ఆరాధించాలి? అంటే, ఈ భూమిపైన కొద్ది వర్షం పడినా, భూమి ఉత్పాదక శక్తిని పెంచుకుని పూర్తిగా పచ్చబడుతుంది. అంటే, భూగోళంపై పడే వర్షం వల్ల భూమి పచ్చబడి పంటలు, పైరులు, వృక్షజాతులు వికసించినట్లుగా మనం శివలింగానికి చేసే అభిషేకం మనలో అనేక శక్తులను పెంచడానికి, కోరికలు తీర్చడానికి వినియోగపడుతుంది. సంతానశక్తి, బుద్ధిశక్తిని కూడా పెంచుతుంది. అందుకే, ‘అభిషేకః ప్రియః శివః’ అని అనడం సంప్రదాయం, వైజ్ఞానికం. శివారాధనలో తులసీపత్రాలు, మారేడు (బిల్వ) పత్రాలు వినియోగించడమంటే.. భూమిపై తప్పనిసరిగా ఈ రెండు వృక్షాలను బాగా పెంచాలని, దానిద్వారా భూమిపైన కాలుష్యాలను తొలగించుకొనే అవకాశం కలుగుతుందని సూచించడమే. ప్రతిరోజూ చేసే శివారాధన భూమిపైన మాలిన్యాలను తొలగించి, స్వచ్ఛత, శుద్ధతను ఆపాదింపజేసే ప్రయత్నమే. 

రాశులలో వృషభ- మిథున రాశులు మనకందరికీ తెలుసు. మిథునరాశిలోని ఆర్ద్ర నక్షత్రాన్ని శివునికి సంకేతంగా చూస్తారు. వేదం కూడా ‘ఆర్ద్రయా రుద్రః ప్రథమాన ఏతి’ అని చెపుతున్నది. ‘మిథునం’ అంటే ‘పార్వతీ పరమేశ్వరుల ఆర్ధనారీశ్వర భావనా మైథునమే’. దాని ముందున్న రాశి వృషభం తూర్పు ఆకాశంలో కనిపిస్తే శివునికి ధ్వజంలా, పశ్చిమాకాశంలో అస్తమించే ముందు శివునికి వాహనం లాగా కనిపిస్తుంది. అందుకే, శివునికి నంది మాత్రమే వాహనం. అంతేకాదు, ఈ విశ్వమంతా ఒక శివలింగంలా ఉన్నదని ఇటీవలి ఒక ‘నాసా’ ఛాయాచిత్రం తెలియజేస్తున్నది. దీనిలో అన్ని కాంతి సంబంధ పదార్థాలూ ఉన్నాయి. ఈ రకంగా, శివుడు విశ్వనాథుడుకూడా అవుతున్నాడు. ‘శివరాత్రి’ అంటే ‘భూమి ఉద్భవించిన రోజు’. అందుకే శివరాధన చేయాలి. మనల్ని కాపాడి సంపదలిచ్చే భూగోళానికి నిరంతరం నమస్కరిస్తూనే ఉండాలి. ‘తత్ప్రణమామి సదాశివ లింగం’.


logo