మంగళవారం 26 మే 2020
Devotional - May 06, 2020 , 22:58:38

కలిని కట్టడి చేసిన పరీక్షిత్తు!

కలిని కట్టడి చేసిన పరీక్షిత్తు!

భాగవతం ‘శుకశాస్త్రం’గానూ ప్రసిద్ధినొందింది. శుకశాస్ర్తాన్ని సాకల్యంగా విని, తరించిన భాగవతోత్తముడు పరీక్షిత్తు. ఉత్తరాభిమన్యుల ఉత్త మ సంతానమైన పరీక్షిత్తు జననం పరమపావనం, కృష్ణకృపా సంపన్నం. పరీక్షిత్తుకు కూడా ప్రహ్లాదునిలాగే తల్లిగర్భంలో ఉన్నప్పట్నించే నిండైన భగవద్భక్తి పల్లవించింది. దుర్యోధనుని దురాశయానికి అనుగుణంగా పాండవ వంశాన్ని నిర్మూలనం చేయదలచి, అశ్వత్థామ ఉత్తర గర్భానికి గురిపెడు తూ తిరుగులేని ‘బ్రహ్మ శిరోనామకాస్ర్తాన్ని’ ప్రయోగించాడు. ఆ అస్త్రం వెలువరించే అగ్గిమంటలకు గురై ఆమె గర్భంలోని శిశువు (పరీక్షిత్తు) మలమలా మాడిపోతూ-‘తనను ఆ వేడి నుంచి రక్షించే దైవమెవరైనా ఉన్నారా?’ అని వేడుకొన్నాడు.

అప్పుడు ఆ శిశు వేదనను, రోదనను కృష్ణభగవానుడు విన్నాడు. వెంటనే ఆ శ్రీహరి బొటనవేలంత పరిమాణం గల దేహంతో  గదాధారియై ఉత్తరా గర్భంలోని ఆ అర్భకుని ముందు ఆవిర్భవించాడు. కృష్ణుడు యోగేశ్వరుడు కాబట్టి, తన యోగశక్తితో సూక్ష్మరూపియై గర్భకుహరంలోకి ప్రవేశించగలిగాడు. ‘సూర్యుడు మంచుతెరలను పటాపంచలు చేసినట్లు’గా ఉద్ధండమైన తన గదాదండాన్ని ప్రచండంగా తిప్పుతూ ఎగసివస్తున్న ఆ బాణాగ్ని జ్వాలల్ని పటాపంచలు చేసి, ఆ శిశువును ముప్పు నుంచి తప్పించాడు. తల్లి కడుపులోనే శిశు దశలో శ్రీహరిని దర్శించిన పరీక్షిత్తు ఎంతటి పుణ్యాత్ముడో కదా. ‘తనను తల్లి ఉదరం లో బాణాగ్ని నుంచి కటాక్షించి, రక్షించిన ఆ పర మ దాక్షిణ్యవర్తి, పావనమూర్తి ఎవరా?’ అని పరీక్షిత్తు పరీక్షిస్తుండగానే ఆ భక్త రక్షకుడు అదృశ్యమయ్యాడట. విష్ణువుతో అలా పరిరక్షితమై, ప్రసాదించబడ్డాడు (విష్ణునా రాతో దత్త ఇతి విష్ణురాతః). కాబట్టి, పరీక్షిత్తు మొదటి పేరు విష్ణురాతుడు. తాను పుట్టిన తర్వాత పూర్వం తల్లి గర్భంలో సాక్షాత్కరించిన ఆ దివ్య సుందరమూర్తి అయిన విష్ణువును లోకులందరిలో పరీక్షిస్తూ, స్మరిస్తూ ఉండేవాడు (గర్భే దృష్ణమనుధ్యా యన్పరీక్షేత నరేష్విహ). కనుక, విష్ణురాతుడు ‘పరీక్షిత్తు’గా సార్థకుడయ్యాడు. ఈ సన్నివేశం ‘భగవంతుడు అవ్యాజ దయామయుడని, గట్టిగా నమ్మినవారిని ఎంతటి కష్టా ల నుంచైనా గట్టెక్కించగలడనీ’ గొప్ప సందేశాన్నిస్తున్నది.

విష్ణుభక్తి ధన్యుడైన పరీక్షిత్తు తన మేనమామ ఉత్తరుని కుమార్తె ఇరావతిని పెండ్లాడాడు. శిబి చక్రవర్తిలా వదాన్యుడై, భరతునిలా కీర్తిభరితుడై, అర్జునునిలా విలువిద్యలో నేర్పు సంపాదించి, నేలతల్లిలా ఓర్పు సాధించి, తేజస్సులో సూర్యుని వంటివాడై, సకల ప్రాణిహితుడై, రాజవిద్యా మహితుడై జనరంజన దిశగా రాజ్యపాలన చేశాడు. విశేషించి కృపాచార్యుల వారి (గురువు) పర్యవేక్షణలో మూడు అశ్వమేధ యాగాలు నిర్వహించాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ‘కాలోహి దురతిక్రమః’ అని ఆర్యోక్తి. పరమ పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఏ రోజైతే తన అవతారాన్ని చాలించాడో ఆ రోజే కలి పురుషుడు నేలపై ఆవరించాడు. ఎదురులేని వీరుడిగా పరీక్షిత్తు ముందుకుసాగుతున్న ఈ సందర్భంలోనే ఒకచోట మూడు పాదాలు (తపస్సు, శౌచం, దయ) కోల్పోయి, ఒకే పాదం (సత్యం)తో ఎద్దు రూపంలో ఉన్న ధర్మదేవతను, కన్నీళ్లు కారుస్తున్న ఆవు రూపంలో ఉన్న భూమాతను, కర్కశంగా కొడుతూ, తంతూ ఉన్న కలి పురుషుణ్ణి చూశాడు. వెంటనే ఆయన తన రథాన్ని ఆపి, చిచ్చరపిడుగులా లేచి, ఆ కలిపై కత్తిని మోపి, ‘తన రాజ్యంలో అలాంటి దుశ్చర్యకు వీలు లేదని’ ఆగ్రహించాడు. కలి వణికిపోతూ పరీక్షిత్తు పాదాలపై పడ్డాడు.

కలిని తన రాజ్యంలో ఎక్కడా ఉండవద్దని ఆ రాజర్షి కట్టడి చేశాడు. అయితే హింస, కామం, ద్యూతం, మద్యపానం, అసత్యం మొదలైన దురాచారాలున్న చోట్లను కలికి నివాసాలుగా సూచించాడు. దీన్నిబట్టి పుణ్యప్రదేశాల్లో సద్గుణాలున్నచోట కలి నిలువ కూడదన్నది పరీక్షిత్తు నిర్దేశం. అంటే, సదాచారపరులై స్వీయ నియంత్రణలో ఉండే మనుషులపై కలి దాడి చేయకుండా కట్టడి చేసిన ఘనత పరీక్షిత్తుదే. కలియుగం కలుషాల యుగం. ధర్మదేవత (వృషభంగా) సత్యం అనే ఒకే పాదంతో సాగవలసి ఉంది. అయితే, పరీక్షిత్తు శాసనంతో ఆయన పరిపాలనలో కృతయుగంలో లాగా తపస్సు, శౌచం, దయ అనే మూడు పాదాలను కూడా నిలబెట్టి ధర్మదేవతను సకలాంగగా, సముజ్జలింపజేసిన పరీక్షిత్తు ధార్మికచిత్తం ఈ నేలపై నేతలందరికీ సందేశాత్మక వృత్తం.


logo