బుధవారం 03 జూన్ 2020
Devotional - May 05, 2020 , 10:36:33

విశ్వ జీవన వాహిని నదీ దేవత!

విశ్వ జీవన వాహిని నదీ దేవత!

విశ్వమానవ మేధోవికాసానికి ప్రతీకలైన వేదాలు మానవజాతి మనుగడకు మూలాధారమైన నదులను దేవతలుగా స్తుతించాయి. సంస్కృతినీ, నాగరికతనూ బతుకుచిత్రంగా మార్చిన నదీ దేవతను కొనియాడుతూనే వేద ప్రవాహం కొనసా గింది. విశ్వజీవనానికి శిఖరాయమానంగా చెప్పబ డిన నదీదేవత ‘విజ్ఞానసింధువు’గా అభివర్ణితమైం ది. నదీజలాలు భావనా సమైక్యతకు ఆస్కారమిచ్చే అమృతజలాలని వివరించింది వేదం.

మనిషి పుట్టిన నాటినుంచి నేటివరకు, ఇకపై కూడా ప్రకృతిశాస్ర్తాన్ని మార్చలేడు. లోకంలో జరిగిన, జరుగుతున్న, జరుగబోయే ఆవిష్కరణలన్నీ ప్రకృతి శాసనానికి అనుగుణంగా నెరవేరడం అతిశయోక్తి కాదు. కానీ, మనిషి దగ్గర ఒక మహత్తు ఉంది. అదే ఆలోచన, అన్వేషణ. దానిద్వారానే వాస్తవమైన నదీరూపాన్ని తెలుసుకోవచ్చన్నది వేదం. వేదాల్లో నదులకు చాలా ప్రాధాన్యమీయబడింది. జీవనాధారిత నదులు దేవతలుగా వర్ణితమైన వేదంలో చారిత్రక ఆధారాలకూ కొదువ లేదు. నదీ దేవత వర్ణన ప్రాకృతిక, నైతిక, ధార్మికరూపంలో ఉంటుంది. పొంగిన నదిని చూస్తే ఉప్పొంగని మది ఉండదు. పారే ఏరును చూస్తే ద్రవించని హృదయం ఉండదు. అతిసాధారణ, సుందర, సత్య, నిత్య, శాశ్వత నదీజలాలు నిరంతర గమనులుగా, అన్నకారిణులుగా, ధనసమన్వితలుగా, పాపశూన్యులుగా, కళ్యాణ కారిణులుగా, మాతృతుల్యులుగా, ఆనంద ప్రదాయనులుగా పరిఢవిల్లాయి. ఇంతటి గొప్పదనాన్ని ఆపాదించుకొన్న నదీజలాలు జీవజాతిని గొప్పగా బతికేలా చేస్తుందని కొనియాడింది శ్రుతి.

భూమికి, ఆకాశానికి అనుసంధానంగా అలరారే నదీదేవత దివి నుంచి భువికి, భువి నుంచి దివికేగి లోకాలను పావనం చేస్తుంది. అందుకే, నదీజలం లోకాలకు తల్లి వంటిది. వందనీయమైన నదీ దేవతను స్థాపించండి. జీవన పురోగతికి లోటు ఉండదని నాడే ఘోషించింది వేదం. నదీ జీవనాధారిత సమాజం శాంతియుతమై, స్వయం సమృద్ధమై, సహకారకమై, సద్భావ ప్రేరకమై, పరిపూర్ణమై విలసిల్లుతుంది. వేదాల్లో నదీ దేవత సప్తరూపాత్మకంగా వర్ణితమైంది. సరస్వతి, సింధు, సరయు, గంగ, యమున, విపాశా, శతుద్రి అనే నదులు ముఖ్యంగాను, మరొక 21 నదులు ఉపనదులుగా వర్ణితమైనాయి. సరస్వతీ నది ముఖ్యమైందిగా, విశిష్ఠమైందిగా చెప్పబడినా, సింధూ నది భువిపై ఉత్తమమార్గాన్ని ఏర్పరిచే మహానదిగా వివరించబడింది. అందుకే అన్ని నదులనూ సప్త సింధువులనే అంటారు. నేలపై ఎగిసిపడే సింధునాదం ఆకాశాన్నే కప్పివేసేంత వేగవంతమైందట.

నదీ దేవత అపరిమిత, అకుటిల దీప్త, అప్రతిహత గత జలవేగం ప్రచండ ధ్వని చేస్తూ సాగిపోతుందట. సరళంగా ప్రవహించే నదీదేవత పరుగులు శ్వేతవర్ణంలో నలువైపులకూ సాగిపోతాయి. ‘ఏషామయం జగతా మిరజ్యసి’. జగాలలోనే అగ్రస్థానంలో నిలిచేది నదీ దేవత. గంగ, యమున, సరస్వతి, శతుద్రి, సట్లెజ్‌, పురుష్ణి, అసిక్ని, వితస్త, సుషోమ, రస, వ్యాస, ఆర్జికీయ, తృష్ణా, మరువర్దప, క్రము, కుభ, మేహత్‌, ఘేల, సోహాన్‌, విపాశా, సరయు, సింధువులనే నదులను వేదం జన జీవనాన్ని నడిపించే నదీ దేవతగా, నాగరికతను సృష్టించగల మార్గదర్శకంగా కొనియాడింది. నదులు జ్ఙానానికి ప్రతీకలనీ, జీవహేతువులనీ, స్వచ్ఛమైన అగ్నికి ఆధారమైనవనీ, పవిత్రమైనవనీ, దివి నుంచి భువికి దిగివచ్చిన అమృత మనీ వేదం స్తుతించిం ది. భూమిని సారవంతం చేసి అభివృద్ధిపరచగల ఏకైక సాధనం నదీజలం. ఆంతరంగిక చైతన్యాన్ని కలిగించగల నదీ దేవత స్వచ్ఛతనూ, మాధుర్యా న్నీ, ఔషధ గుణాన్నీ ప్రపంచానికి అందిస్తుంది. ఉప్పు నీటి సముద్రంలో ఉద్భవించిన నదీజలం తన ప్రవాహగుణంతో మధురమై తిరిగి ఉప్పు సముద్రాన్నే చేరడం అత్యద్భుతం. అందుకే ‘ఆపోదేవః దివ్యః’ అనుభవైక వేద్యమైన ఆనందం, దివ్యత్వం నదీజలం.

సత్యం తేజస్సుగా, నిర్భయమైన గొంతుకలోంచి వచ్చే వాణిగా, ఆలోచనను మార్చగల అద్భుత సాధనంగా, ప్రపంచానికి నూతన అవకాశం ఇచ్చే నిజరూపంగా పరిఢవిల్లుతుంది. సత్యస్వరూపంగా వ్యక్తీకృతమైంది నదీదేవత. అందుకే అది జీవనదిగా విశ్వాసాన్ని చూరగొంటున్నది. సముద్రం ఒక్కటే నదులు అనేకం. భారతీయత ఒక్కటే ఆదర్శాలు అనేకం. ఇదే నదీ నాగరికత నేర్పిన జీవత్వం.


logo