గురువారం 04 జూన్ 2020
Devotional - May 04, 2020 , 10:59:40

ఆత్మ సాకారం!

ఆత్మ సాకారం!

శక్తిని సృష్టించలేం, నశింపచేయలేం. కానీ, ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చగల మని చెప్పే ‘శక్తి నిత్యత్వ నియమం’ భౌతికశాస్త్ర మౌలికసూత్రాల్లో ఒకటి. క్రీ.పూ. 5వ శతాబ్ది మొద లుకొని ‘పారిశ్రామిక విప్లవం’ వరకు పాశ్చాత్య తత్త్వవేత్తలు, శాస్త్రవేత్తలు శక్తిని గురించి చర్చోపచ ర్చలు చేయగా, చేయగా రూపొందిన సూత్రం అది. ఐతే, పాశ్చాత్య శాస్త్రవేత్తల సిద్ధాంతంలో పేర్కొన్న శక్తిని మన ఋషులు దాదాపు 3,000 ఏండ్ల కిందటే బృహచ్ఛక్తిగా కనుగొని, ఉప నిషత్తులలో పరిపరివిధాలుగా చెప్పారు.

‘న జాయతే మ్రియతే వా విపశ్చిత్‌/ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్‌/ అజో నిత్యః శాశ్వతోయం పురాణో/ న హన్యతే హన్యమానే శరీరే’. 

‘ఆత్మ జన్మించడం లేదు, మరణించడం లేదు. అది దేనినుంచీ రూపొందింది కాదు, జన్మ రహితమైంది. ఎప్పటికీ ఉండేది. పురాతనమైంది. శరీరం నశిం చినా నశించనిది’ అని కఠోపనిషత్తులో ‘ఆత్మ నిత్యత్వ నియమాన్ని’ బోధించా రు. అచ్చు గుద్దినట్లుగా దీని వలెనే ‘ఆధునికశక్తి నిత్యత్వ నియమం’ ఉం డటం చూస్తే అలనాటి ఋషుల జ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తున్నది. దాదాపు గా ఇదే శ్లోకం ‘సాంఖ్యయోగం’లో కనిపిస్తుంది. ఒకే విషయాన్ని రెండు ఉత్కృష్ట గ్రం థాలలో ఒకేలా చెప్పారంటే ఋషులు ఆత్మను సం దర్శించడమే కాక మనమూ సందర్శించాలనేది ఇందులోని ఆంతర్యం.

ఋషులు ‘ఆత్మ’ అనే పదం ఎందుకు ప్రయో గించారనేది ఒకసారి చూద్దాం. నాడు ఒకవైపు ఋషులు వేద సంహితలు, వేదాంగాల పట్ల విశేష ప్రగతిని చూపెట్టారు. వాటితో సంతృప్తి చెందని వారు మరోవైపు ప్రకృతిని, గ్రహ, నక్షత్రాదులను తనలో సృష్టిస్తూ, తనలోనే లయం చేసుకోవడమే కాక వాటిలోపల అంతర్లీనంగా ఓ మహాశక్తి ఆవ రించి ఉన్నదని కనుగొని దాని లక్షణాలను సూత్రీ కరించారు. అది ‘స్వయంభూ’ అని, అది లేని చోటు అనేదే లేనంతగా వ్యాప్తి చెందిందని, అది కంటికి కనిపించనిదని, అదే పరిణమించి అన్ని రూపాలుగా మారుతూ వస్తున్నదని పలు లక్ష ణాలనూ సూత్రీకరించారు. వాటన్నింటి ఆధారంగా భగవంతుడు, దేవత, అనంత శక్తి లాంటి పలురకాల పేర్లు దానికి పరి పూర్ణ అర్థాన్ని ఇవ్వలేవని, సార్వజనీన ఆమోదయోగ్యంగా దానికి ‘ఆత్మ’గా నామకరణం చేశారు. ‘అతతి సర్వత్ర వ్యాప్నోతి ఇతి ఆత్మః.’ ‘అంతటా వ్యాపించి ఉండేదే ఆత్మ’ అని నిర్వ చిస్తూనే ‘స ఏష నేతి నేతి ఆత్మః’ అన్నారు. ‘ఇది కాదు, ఇది కాదు’ అంటూ దృశ్యమైన వాటినన్నింటినీ నిషే ధించి ఏది చెప్పారో అదే ‘ఆత్మ’ అని విభిన్న నిర్వచ నం కూడా ఇచ్చారు.

ఆత్మ సర్వాంతర్యామిగా ఉన్న ఒక్క శక్తే అయి నా, అది ప్రస్ఫుటమయ్యే రూపాలు మాత్రం అనం తం. పై శ్లోకంలో చెప్పిన శరీరాన్ని మానవ శరీరం గానో, జీవి శరీరంగానో తీసుకోవద్దు. ఇక్కడ శరీర మంటే, ఆకృతి కలిగి ఉన్న ఏదేని భౌతికవస్తువు. అలాంటి ప్రతి వస్తువు ఆకృతిని మొదలుకొని దాని లో నిక్షిప్తమై ఉండే శక్తివరకు అన్నీ ఆత్మమయమే. ఉదాహరణకు సూర్యుడు-సూర్యునిలో ఉద్భవించే సౌరశక్తి, భూమి-భూమిలోపలి పలురకాల ఉష్ణ, గురుత్వ శక్తులు, జీవి-జీవిలో ఉండే ప్రాణశక్తి, బొగ్గు-బొగ్గులోని జ్వలన శక్తి, వజ్రం- వజ్రంలోని కఠిన బంధన శక్తి, నిశ్చల జలం- దానిలోని స్థితిజ శక్తి, దాని ప్రవాహ సమయంలోని గతిజశక్తి, అదే గతిజశక్తి వల్ల టర్బైన్ల ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుచ్ఛక్తి, ఆ విద్యుచ్ఛక్తి వల్ల ఉత్పత్తి అయ్యే కాంతిశక్తి.. ఇలా చెప్పుకుంటూ పోతే కనిపించే అన్ని వస్తువులు, వాటిలోని అన్నిరకాల అంతర శక్తులు అన్నీ ఆత్మజనితాలే! మరోరకంగా దృశ్య, అదృశ్య రూపాలన్నీ కలిసే ‘ఆత్మ’ అని చెప్పాలి.

ఇంతటి వైవిధ్యభరితమైన ఆత్మ ఎంతటి బలీయ మైందో ఊహించలేం. అలాంటి దాని ఏకత్వాన్ని మేథతోనే స్పృశించాలి. ఆ స్పర్శ మనకు అద్భుత మైన జ్ఞానాన్ని ఇస్తుంది. అదే సమయంలో దాని తత్త్వాన్ని మనసుతో దర్శించాలి. ఆ సందర్శనం మనకు అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తుంది. దాని నిరంతరత్వాన్ని మనం మన లోపలినుంచే శోధించాలి. ఆ శోధన మన తృష్ణకు తపోనిష్టను ఇస్తుంది. అలాగే, దాని నిరంజనత్వాన్ని మనో వాక్కాయ కర్మలతోనే అనుభవించాలి. అప్పుడే సాధకులకు ‘అహం బ్రహ్మాస్మి’గా ఆత్మ సాకారం అవుతుంది.


logo