శుక్రవారం 07 ఆగస్టు 2020
Devotional - May 02, 2020 , 23:28:41

ఈనెల 6వ తేది శ్రీనృసింహ జయంతి నమామి నారసింహం!

ఈనెల 6వ తేది శ్రీనృసింహ జయంతి నమామి నారసింహం!

సృష్టి వ్యక్తమయ్యే సమయంలో సంధిస్థితియే ‘నరసింహావతారం’. సృష్టి జరిగే సంరంభంలో ప్రళయభీషణ స్థితిని సింహం సూచిస్తే, మానవరూపం ధర్మాకృతిని తెలుపుతుంది. భూమి జడమైన ప్రకృతి. అది ఈశ్వరాభిముఖంగా ఎదుగుతుంది. కాగా, అమృతత్వం అవతరణగా కిందికి దిగుతుంది. అదే భగవదనుగ్రహం. భూలోకమే సాధనా స్థానం. సాధన భూమిని మంగళదాయినిగా మారుస్తుంది. 

‘ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం  నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం॥’ 

ఇది నరసింహుని తత్త్వం. ఉగ్రుడు, వీరుడు, మహావిష్ణువు, జ్వలించేవాడు, దిక్కులన్నీ తానైనవాడు, నరసింహాకృతిని ధరించినవాడు, భయంకరుడు, భద్రతను చేకూర్చేవాడు, మృత్యువుకే మృత్యువైనవాడు అయిన ఆ నరసింహుని స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇందులో ‘ఓం‘కారం ప్రక్షిప్తమై వున్నదని తత్త్వదర్శకులు చెప్తారు. ‘ఉగ్రవీరం మహావిష్ణుం’.. ఇది విరాట్‌ స్వరూపాన్ని సూచిస్తున్నది. ‘ఓం’కారంలోని ‘అ‘కారానికి ప్రతీకగానూ నిలుస్తున్నది. ‘జ్వలంతం సర్వతో ముఖం’.. ఇది అంతరిక్షాన్ని, పరమపురుష తత్త్వాన్ని సూచిస్తున్నది. ‘ఓం’ కారంలోని ‘ఉ‘కారానికి ప్రతీకగానూ నిలుస్తున్నది. ‘నృసింహం భీషణం భద్రం’.. ఇది స్వర్గలోకాన్ని, చంద్రతత్త్వాన్ని సూచిస్తున్నది. ‘ఓం’ కారంలోని ‘మ‘కారానికి ప్రతీకగా నిలుస్తున్నది. ‘మృత్యోర్‌ మృత్యుం’.. ఇది ఆకాశాన్ని, సకల దేవతా స్వరూపాలను సూచిస్తున్నది. ‘ఓం’ కారంలోని ‘అను’ స్వరానికి ప్రతీకగా నిలుస్తున్నది.

హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల సంహారంలో విష్ణువు వరాహ- నరసింహావతారాలను ఎత్తాడు. వరాహావతారంలో భూమిని ఉద్ధరించాడు. తాత్త్వికంగా ‘వరాహం’ అంటే సూర్యోదయం. సృష్టి ఆరంభంలో భూమిపై మొదటి సూర్యోదయంగా చెపుతూ, సృష్టికి పూర్వరూపంగా వరాహావతారాన్ని వర్ణిస్తారు. గుడ్డుమీది వలయాన్ని ఛేదించుకొని పక్షి ప్రపంచంలోకి అడుగుపెట్టిన విధంగా సృష్ట్యారంభంలో భూమి ఆవిర్భవించింది. ఈ ప్రక్రియలో అంధకారం నుండి వ్యక్తమవుతున్న భూమిని ఆవరించి వున్న వలయాన్ని హిరణ్యాక్షుడుగా చెబుతారు. ‘నరసింహ’లోని నరరూపం భూలోకానికి ప్రతీక అయితే, సింహరూపం అమృత తేజస్సుకు ప్రతీక. అలాగే, సింహం అవ్యక్తమైన తత్త్వానికి ప్రతీక. కాగా, మానవుడు వ్యక్తానికి ప్రతీకగా చెపుతారు.

ప్రహ్లాద చరిత్ర అందరికీ తెలిసిందే. పూర్వజన్మలో శాపగ్రస్థుడైన తన సేవకుడే హిరణ్యకశిపుడు. కనుక, శాపవిముక్తిని కలిగించేందుకు, విష్ణువు సర్వాంతర్యామి అని సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించిన తన భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించేందుకు ‘నరసింహ రూపాన్ని’ ధరించాడు. ఏకకాలంలో విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపునికి భయంకరమైన మృత్యు స్వరూపాన్ని, అతని కుమారుడు, తన భక్తుడైన ప్రహ్లాదునికి అతిసౌమ్యమైన కరుణా స్వరూపాన్ని విష్ణువు ప్రదర్శించాడు. ఇది దృష్టిభేదమే కాని, వస్తుభేదం కాదనే సత్యాన్ని చెపుతున్నది. ఏ ప్రయోజనాన్ని ఆశించి అనంత చైతన్య శక్తి ఆకృతితో అవతరించిందో ఆ ప్రయోజనానంతరం ఆ ఆకృతి అనంతత్త్వంలో లయమవుతుంది. నరసింహావతార ప్రయోజనం చాలా పరిమితం. కాబట్టి, హిరణ్యకశిపుని వధానంతరం వెంటనే ఉపసంహరింపబడింది.

ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, యోగ నరసింహుడు వంటి మూర్తులు మనకు కనిపిస్తారు. హిరణ్యకశిపుని వధ తర్వాత కనిపించే మూర్తి ఉగ్రనరసింహమూర్తి. కాగా, లక్ష్మీదేవితోకూడిన మూర్తి లక్ష్మీనరసింహుడు. ప్రకాశవంతమై, సర్పాకృతిలో దర్శనమిచ్చే స్వామి జ్వాలా నరసింహుడు. ఆదిశంకరాచార్య నరసింహుడిని కీర్తిస్తూ ‘యోగీశ శాశ్వత శరణ్య‘ అన్నారు. సత్యాన్వేషణకు తత్త్వానుభూతినిచ్చే యోగమార్గానికి ప్రతీకనే యోగ నరసింహమూర్తి. తాను భక్త సులభుడు కాబట్టే, ధ్యానం చేసే సాధకుల హృదయాలలో నిత్యం సన్నిహితంగా ఉంటాడని సాధకులు చెపుతారు. 

హిరణ్యకశిపుడు తపస్సులో భయాన్ని జయించాడు. కానీ, వరం కోరే వేళ సహజమైన మృత్యువును అధిగమించాలని ఆశ పడ్డాడు. ‘జయించడం’ అంటే దాని స్వరూపాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవడమే. నిజానికి హిరణ్యకశిపుడు మృత్యువు వద్దని కోరినట్లు కనిపించినా వైకుంఠాన్ని వీలైనంత త్వరగా చేరుకోవాలనే ఆరాటం అతనిలో అంతర్లీనంగా కనిపిస్తుంది. సర్వాంతర్యామిగా విశ్వసించి ప్రార్థించిన ప్రహ్లాదుని నమ్మకాన్ని నిలబెట్టేందుకు స్తంభంలోంచి ఆవిర్భవించిన నరసింహుడు, నమ్మకం ప్రాతిపదికగా పరిపూర్ణత, సామరస్యత కలిగిన ఆలోచనలతో, సమర్పణా భావనతో ప్రార్థించే భక్తులకు సంపూర్ణ ఆరోగ్యాన్నేకాక చక్కని దార్శనికతను, నైపుణ్యాలను, వనరులను, సమగ్ర కార్యస్వరూప ప్రణాళికను అనుగ్రహిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

ఎక్కువ మంది భక్తులు అపజయం పాలవడానికి ప్రాథమిక కారణం వారి ప్రార్థన యాంత్రికంగా ఉండటమే. దానితోపాటు లక్ష్యం లేకుండా పనిచేయడం, చేసే పనిపై సరైన అవగాహన లేకపోవడం, సంకల్పబలం లోపించడం వంటివీ ముఖ్యమైన కారణాలుగా ఉంటాయి. నిజానికి సంకల్పం బలంగా ఉంటే మిగతా రెంటినీ అదే నడిపిస్తుంది. శ్రీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల ఈ అద్భుతమైన సంకల్పాన్ని బలోపేతం చేసుకోగలుగుతాం. మనలోని అంతర్గత ప్రజ్ఞను వెలికి తీసేందుకు అత్యంత ప్రధానమైంది ‘సాధించగలమనే నమ్మకం’. 

దానికి కల్పన, సృజనాత్మకతలు తోడైతే ఆలోచనలలో స్పష్టత వస్తుంది. 

సరైన దిశలో ఆ ఆలోచనలు ప్రసరిస్తే కార్యవిజయాలు తథ్యం. అందుకే, యాంత్రికంగాకాక త్రికరణ శుద్ధిగా ఆ యాదాద్రి నారసింహుని స్మరించి, ధన్యులమవుదాం. 

  లక్ష్మీ నరసింహ స్వరూపుడు!

శాంత- ఋష్యశృంగుల కుమారుడు ‘యాద‘. అంజనేయస్వామి సూచించగా, అతడు విష్ణువును గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆవు మాంసాన్ని, నరమాంసాన్ని తినే ఒక రాక్షసుడు ఆతనిని కబళించేందుకు వచ్చాడట. దాంతో మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, ఆ రాక్షసుడిని చంపి వేసాడు. తదుపరి, యాద మహర్షికి ప్రత్యక్షమవుతాడు. ఆయన కోరిక మేరకే భక్తులను అనుగ్రహించేందుకై ‘యాదగిరి‘పై ‘లక్ష్మీ నరసింహుని’గా ఆవిర్భవించాడన్నది క్షేత్ర ప్రాశస్త్య కథనం.


logo