శనివారం 06 జూన్ 2020
Devotional - May 02, 2020 , 23:15:02

సాధ్య సాధన సంబంధం

సాధ్య సాధన సంబంధం

‘అపి క్రియార్థం సులభం సమిత్కుశం?

జలాన్యపి స్నానవిధి క్షమాణితే? 

అపి స్వశక్త్యా తపసి ప్రవర్తసే?

శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం॥’. 

ఇది మహాకవి కాళిదాసు విరచితమైన ‘కుమార సంభవం’ కావ్యంలోని 5వ సర్గలోని శ్లోకం. ఇందులోని చివరి పాదం ఒక గొప్ప సుభాషితంగా లోకంలో ప్రసిద్ధి చెందింది. ఏ ధర్మాన్ని సాధించడానికైనా శరీరం సహకరించడం చాలా అవసరం. కనుక, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం చాలా ముఖ్యమని ఈ సూక్తి చెబుతున్నది. ధర్మమంటే నిర్వర్తించవలసిన అవసరమైన పని.

శివుడు తనకు భర్తగా లభించాలని పార్వీతీదేవి గొప్ప తపస్సు చేసింది. ఆ తపస్సు ఫలించే ముం దు, శివుడు ఆమెను పరీక్షించదలిచాడు. బ్రహ్మచారి రూపంలో ఆమె ఉన్న ప్రదేశానికి వచ్చాడు. పార్వతి తన ధర్మంగా శివునికి అతిథి మర్యాద లు చేసింది. అప్పుడు ఆ బ్రహ్మచారి ఆమె యోగక్షేమాలు కనుక్కొన్నాడు. ఈ సందర్భంలోనిదే పై శ్లోకం. ‘పార్వ తీ! నీ తపస్సు బాగా సాగుతున్నదా? తపస్సుకు కావలసిన సమిధలు, దర్భ లు సులభంగా లభిస్తున్నవా? తపస్సుకు ముందు స్నానం చెయ్యాలె గదా. మరి, అందుకు ఇక్కడ నీళ్లు అనుకూలంగా ఉన్నవా? అటు తర్వాతిది తప స్సు. దానికి నీ శరీరం సహకరిస్తున్నదా? తపస్సు కఠినమైంది. దానికిముందు శరీరం సిద్ధంగా ఉండా లె. అందుకు ఆరోగ్యం ముఖ్యమైంది. నువు నీ శరీరారోగ్యాన్ని కాపాడుకుంటూ, దానికి అనుగుణంగా నే తపస్సు సాగిస్తున్నావా? ఏ ధర్మాన్ని సాధించాల న్నా సాధకునికి తన శరీరమే ముఖ్యసాధనం గదా!’ అన్నది దీని తాత్పర్యం.

క్రియా సిద్ధికి అత్యవసరమైన పనిముట్టును ‘సాధనం’ అంటాం. రాతకు పెన్ను వలె. పెన్ను సరైందిగా లేకపోతే రాత సాగదు కదా! అలాగే, ప్రతి పనికీ ఒక సాధనం అవసరం. తపస్సుకు సమిధలు, దర్భలు మొదలైనవి అవసరమే. కానీ, అం తకుముందు తపస్సుకు ముఖ్యసాధనం సాధకుని శరీరం. దేహం సరిగా లేకపోతే మిగతావి ఉన్నా ప్రయోజనం లేదు. రాయడానికి కూడా శరీరమే మొదటి సాధనం. ఆ తర్వాతే కలం. అందుకే, ఏ ధర్మ నిర్వహణకైనా, ఏ కార్యాన్ని సాధించాలన్నా ముందుగా మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న మాట. కనుక, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరి కీ ప్రథమ కర్తవ్యం. అంటే, స్వశరీర రక్షణను కూడా ధర్మంగానే భావించాలన్నమాట.

లోకంలో కొన్ని పనులు చేయడానికి సుదృఢమైన శరీరం అవసరం. రక్షణశాఖ లో ఉద్యోగం చేసేవారికి ముందుగా వారి శరీరం అందుకు యోగ్యమా, కాదా అని పరీక్షిస్తా రు. ఆ తర్వాత కఠినమైన శిక్షణతో వారి శరీరాలను మరింత సుదృఢంగా మార్చే ప్రక్రియలు చేపడుతా రు. ఎప్పటికప్పుడు వ్యాయామాలు చేస్తూ అందు కు సరిపడా ఆహారం వారు తీసుకోవలసి ఉంటుం ది. ఆ ఆహారం మితిమీరితే ఆరోగ్యానికి భంగం తప్పదు. తక్కువైనా ప్రమాదమే. కనుక, సమతుల పోషకాహారం తప్పనిసరి. ఇలా శరీరారోగ్యాన్ని కాపాడుకోవలసి ఉంటుంది.

ధర్మాన్ని సాధించడానికి శరీరం మనకున్న ముఖ్య సాధనమని పై శ్లోకం పేర్కొన్నది. శరీరం సాధనమైతే మరి, సాధ్యమేమిటి? అనేది అసలు ప్రశ్న. పై కాళిదాసు సూక్తి ‘శరీరం సాధనమనే’ చెబుతున్నది. కానీ, సాధ్యమని చెప్పడం లేదు. అం తేకాదు, ‘ధర్మం సాధ్యమనీ’ చెబుతున్నది. ఈ ధర్మం బహుముఖమైంది. కొందరు శరీరమే సాధ్యమని భావించి, దాని పోషణే ముఖ్యమని యాతన పడుతుంటారు. ‘సాధ్య సాధన సంబంధం’ మారు తూ ఉంటుంది. కనుక, ఎప్పుడు ఏది సాధ్యమో? ఏది సాధనమో? తెలుసుకొని, దానికి తగిన విధంగా మన ప్రవర్తనను మలచుకోవాల్సి ఉం టుంది.

ఒక గమ్యస్థానం చేరడానికి మనం ఒక వాహ నాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అప్పుడు ఆ వాహ నం మనల్ని గమ్యస్థానం చేరడానికి ‘సాధనం’ అవుతుంది. చిన్నపిల్లలు ఆ వాహనం బాగున్నదని, దానిపై గమ్యం చేరిన తర్వాత కూడా దిగకపోతే, ‘అది వారి అజ్ఞానమని’ అంటాం. లోకంలో ఎప్పటికప్పుడు ఏది సాధ్యమో? ఏది సాధనమో? గ్రహి స్తూ మన ప్రయాణాన్ని సాగించాలి. కనుక, శరీరం ధర్మాన్ని సాధించడానికి ముఖ్య సాధనం. దాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం.


logo