సోమవారం 01 జూన్ 2020
Devotional - May 02, 2020 , 00:03:26

వెలుగు, చీకటి.. రెండూ అమ్మే!

వెలుగు, చీకటి.. రెండూ అమ్మే!

విశ్వం అంటే ఆకాశం. ‘ఆ’ అంటే సంపూర్ణమైంది. ‘కాశం’ అంటే ప్రకాశం, శక్తి. సృష్టి అంతా నడిపే అమ్మవారి కార్యాలయం ‘ఖం’ అని పిలువబడే ఆకాశమే. అందుకే, ఆకాశమే ఆదిజనని. సూర్యమండలంలోని శక్తి ప్రాణశక్తి. ‘దేవి’ అని పిలువబడే ఆ శక్తి స్వయంప్రకాశకమైంది. అణువులో ఉండేది, బ్రహ్మాండంలో ఉండేది ఆ తల్లే. జగత్తంతా పాలించే అమ్మనే ఆకాశం. వెలుగు, చీకటి ఈ రెండూ అనంతమైనవి. ఈ రెండూ లభించేవి అక్కడినుంచే. చీకటికి రూపమిస్తే కాళీ, వెలుగుకు రూపమిస్తే గౌరి. వెలుగు అమ్మే చీకటి అమ్మే. ‘అమ్మ’ అంటే ఒక రూపం కాకుండా ఒక భావన గుర్తుకురావాలి. అమ్మంటేనే చైతన్యం. బిడ్డ నిద్రలో ఉలిక్కిపడ్డా లేచి జోకొట్టి పడుకో పెట్టేది అమ్మే. లేపేది అమ్మే. బిడ్డ ఆకలి పిలుపు వినిపించేది అమ్మకే. అందుకే, అమ్మ ప్రేమ ఆకాశమంత.

మన తల్లి కారకురాలిగా, పోషకురాలిగా, నెపం లేని ప్రేమ కలదిగా ఈ జన్మకు మాత్రం పరిమితం. మరి, ఆ జగన్మాత సర్వసృష్టికి కారకురాలు. పోషకురాలు. అందుకే కనబడని అమ్మ, కనిపించే అమ్మ.. బింబ-ప్రతిబింబాలు. కడుపులో బిడ్డ పెరుగుతూ కాళ్ళతో గుండె దాకా తన్నుతుంటే ఆ బాధను మర్చిపోయి, ‘నా బిడ్డ క్షేమంగా పెరుగుతున్నాడని’ అనుకొని తృప్తిగా ఉంటుంది తల్లి. బిడ్డను ప్రసవించడానికి పురిటినొప్పులు ఎన్ని ఉన్నా హాయిగా ఓర్చుకొంటుంది. బిడ్డ క్షేమంగా బయటపడాలనీ వేదన పడుతుంది. పుట్టిన బిడ్డను అడుగడుగునా కాపాడుకోవాలని ప్రేమతో తపిస్తుంది. కానీ, అవేవి ఈ తల్లి చేతిలో లేవు. ఆ జగన్మాత కరుణతో కాపాడాల్సిందే. ఆ తల్లి ఆకలి రూపంలో ఉండి ఈ తల్లితో తినిపిస్తుంది. ఆ తల్లి లోపల ఉండి చైతన్యాన్ని ఇస్తే ఈ తల్లి బిడ్డను నడిపిస్తూ అనేక పనులు చేయిస్తుంది. ఆ తల్లి అనుగ్రహిస్తేనే ఈ తల్లి ప్రేమ సార్థకమవుతుంది. ఈ తల్లినే బిడ్డ సర్వస్వంగా చేసి తాను గుప్తంగా ఉండిపోతుంది. అంతేకాక, ఈ బిడ్డ తల్లిని ప్రత్యక్ష దైవంగా చూస్తేనే ఆ తల్లి సంతోషిస్తుంది.

తల్లిని ‘మాత’ అని కూడా అంటాం. ‘మాత’ అంటే ‘కొలత పెట్టునది’ అని అర్థం. బిడ్డకు ఎప్పుడు ఏది తినిపించాలో, ఏది వద్దో తల్లికి మాత్రమే తెలుస్తుంది. అప్పుడే బిడ్డ ఆరోగ్యవంతంగా పెరుగుతాడు. అదేవిధంగా జగన్మాత కూడా సృష్టిలో ఏ జీవికి ఎప్పుడు, ఎక్కడ ఎలా ఎంత అందించాలో కొలత పెట్టి ఇస్తుంది. అప్పుడే ఆ జీవి సుఖవంతంగా ఉంటాడు. ఆ తల్లి అనుగ్రహం శరీరం మీద ఉంటేనే ఆ దేహం అనేక పనులు చేస్తుంది. ప్రతి పనిని మనతో గొప్పగా చేయిస్తూ, ఆ కీర్తిని మనకే కట్టబెడుతుంది. మరి, ఈ శక్తినంతా ఆ తల్లి మనకెందుకిస్తుంది? ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించా? లేక, బాధ్యత అనుకొనా? ఇవేవీ కావు. ‘అమ్మ’ అంటేనే అపారమైన కరుణామూర్తి గనుక.

బిడ్డ యోగ్యుడు కాకున్నా తల్లి తన ప్రేమను కురిపిస్తుంది. నడువలేని వారి దగ్గరికి తానే నడిచివెళ్తుంది. చూడలేనివారికి తానే లోచనాలుగా ఉండి స్పర్శ వల్ల దర్శనం ఇప్పిస్తుంది. చెవిటివారికి పెదవుల కదలికతోనే భావాన్ని అందిస్తుంది. బలహీనులైన బిడ్డను అమ్మ ఎక్కువగా చేరదీసి ప్రేమిస్తుంది. మలినంలో దొర్లుతున్న బిడ్డను తల్లి తప్ప ఎవ్వరూ ముట్టరు. ఆ స్థితిలో ఆదరించేది అమ్మనే, కడిగి శుభ్రపరిచేది అమ్మనే. అదేవిధంగా పాప పంకిలంలో ఉన్న తన బిడ్డల్ని దయతో కడిగేసేది ఆ జగన్మాతనే. కారణమేమంటే అమ్మకు బిడ్డను ప్రేమించడం తప్ప మరేదీ తెలియదు.

జగన్మాత తన సృష్టినంతా సర్వకాల సర్వావస్థల్లోనూ క్షేమంగా ఉంచాలని అనుకుంటుంది. ‘అమ్మ’ అంటేనే రాశీభూతమైన కారుణ్యం. ‘అమ్మా’ అంటే తనువంతా చాలు పొంగిపోయి సాక్షాత్కరిస్తుంది. అదే అమ్మ సమర్థత. ఆమె మన కన్నుల ముందుండే బ్రహ్మ. అమ్మ లాంటి స్త్రీమూర్తి లోకంలో ఉండదు. అనుకున్నది నెరవేరినా, ఒత్తిడి తగ్గినా, అలసట తీరినా, మనకు తెలియకుండానే ‘అమ్మయ్య’ అనుకొంటాం. అంటే, మనసుకు శాంతిని, సుఖాన్నిచ్చేది అమ్మనే. అందుకే, మనిషి జ్ఞానంతో ఈ సృష్టిలో పుట్టిన ప్రాణులను పెంచేది, కదలికలను కల్పించేది, తీసుకువస్తున్నది, తీసుకువెళ్తున్నది ఏదో ఉన్నదని గుర్తుపట్టి ఆ దైవికశక్తికి నమస్కరించడం మన సంస్కృతి గొప్పతనం. ఆ దేవి మనకిచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకోవటమే భక్తి.


logo